భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 50
ఈ భాగంలో రెండు స్తుతి పద్యాలు చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. మొదటిది. నవమ స్కంధంలోని అంబరీషోపాఖ్యానము లోనిది. అంబరీషుడనే చక్రవర్తి గొప్ప విష్ణు భక్తుడు. అతడు ఒకసారి దూర్వాస మహర్షి కోపానికి గురయినాడు. దూర్వాసుడు తన జటను ఊడపెరికి నేలకేసి కొట్టి, దాని నుంచి ఒక పిశాచిని సృష్టించాడు. తన భక్తుడిని రక్షించేందుకు, శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రాన్ని పంపించాడు. ఆ సుదర్శన చక్రానికి భయపడి, దూర్వాసుడు బ్రహ్మదేవుడిని, శివడిని ఆశ్రయించాడు. వారు తమ నిస్సహాయతను తెలియచేసారు. చివరికి శ్రీమహావిష్ణువు దగ్గరకే వెళ్లగా, "నేను నా భక్తులకే దాసుడను. నీవు వెళ్లి ఆ అంబరీషుడినే శరణు వేడుకో" అని విష్ణువు చెప్పాడు. గత్యంతరం లేక, దూర్వాసుడు అంబరీషుడినే అర్ధించాడు. అంబరీషుడు, ఆ సుదర్శన చక్రాన్ని స్తుతిస్తున్నాడు. రెండవది. దశమ స్కంధం పూర్వభాగంలోనిది. బాలకృష్ణుడి అల్లరికి కోపం వచ్చిన యశోద, దండించడానికి చేతులు రాక, కృష్ణుడిని ఒక రోటికి కట్టివేసింది. బాలకృష్ణుడు ఆ రోటిని లాక్కుంటూ వెళ్లి, పెరటిలోని రెండు మద్ది చెట్లను కూల్చి వేసాడు. కూలిన మద్ది చెట్లనుంచి ఇద్దరు సిద్ధులు ప్రత్యక్షమైనారు. వారిద్దరూ బాలకృష్ణుడిని...