భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 36

ఈ భాగంలో, చాలా రోజుల తరువాత ఇంటికి వచ్చిన భర్త, భార్యని అడిగే కుశల ప్రశ్నల పద్యాలు చూద్దాం. ముందుగా కథా సందర్భాలు.

మొదటిది. ప్రథమ స్కంధంలోనిది. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చాడు. భార్యలను కుశలప్రశ్నలు వేస్తున్నాడు.

రెండవది. అష్టమ స్కంధంలోని వామనావతార ఘట్టం ఆరంభంలోనిది. కశ్యప మహాముని ఎన్నో రోజుల తపస్సు తరువాత ఇంటికి వచ్చాడు. తన భార్య అదితిని కుశల ప్రశ్నలు వేస్తున్నాడు.

ఇవిగో పద్యాలు.

1-268-మ. (శ్రీకృష్ణుడు భార్యలను పరామర్శ చేయట)
"కొడుకుల్ భక్తివిధేయు లౌదురు గదా? కోడండ్రు మీ వాక్యముల్గ
డవంజాలక యుందురా? విబుధ సత్కారంబు గావింతురా? 
తొడవుల్ వస్త్రములుం బదార్థ రస సందోహంబులుం జాలునా?
కడమల్ గావు గదా? భవన్నిలయముల్ గల్యాణయుక్తంబులే?

8-463-మ. (కశ్యపుడు అదితిని పరామర్శ చేయుట)
తెఱవా! విప్రులు పూర్ణులే? చెలగునే దేవార్చనాచారముల్?
తఱితో వేలుతురే గృహస్థులు? సుతుల్ ధర్మానుసంధానులే?
నెఱి నభ్యాగత కోటి కన్న మిడుదే? నీరంబునుం బోయుదే?
మఱ లే కర్థుల దాసులన్ సుజనులన్ మన్నింపుదే? పైదలీ!

ఇప్పుడు ద్వంద్వశిల్పం చూద్దాం. రెండూ మత్తేభవృత్త పద్యాలు. రెండింటిలోనూ భార్యను భర్త కుశల ప్రశ్నలు అడిగే సందర్భము. చాలా సహజంగా జరిగే సంభాషణ చిత్రీకరించే పద్యాలు. మొదటి దానిలో "విబుధ సత్కారంబు గావింతురా?" అంటే, రెండవదానిలో "విప్రులు పూర్ణులే?" అంటూ ప్రశ్న. కొడుకులు విధేయులుగా ఉన్నారు కదా (కొడుకుల్ భక్తివిధేయు లౌదురు గదా) అని శ్రీకృష్ణుడు అడిగితే, సుతులు ధర్మాన్ని పాటిస్తున్నారు కదా (సుతుల్ ధర్మానుసంధానులే) అని కశ్యపుని ప్రశ్న.

శ్రీకృష్ణుడు తిండి, బట్టలకు కొదువలేదు కదా ("తొడవుల్ వస్త్రములుం బదార్థ రస సందోహంబులుం జాలునా?") అంటే, కశ్యపుడు, అభాగ్యులకు అన్న, పానీయాలు దానం చేస్తున్నావు కదా ("నెఱి నభ్యాగత కోటి కన్న మిడుదే? నీరంబునుం బోయుదే?") అని ప్రశ్న.

దానం చేయడమనేది, భార్యభర్తలు ఇద్దరి గృహస్థాశ్రమ ధర్మమని, తరువాత వచ్చే వామనావతార ఘట్టానికి సూచనగా తోస్తున్నది. ఆ ఘట్టంలో బలి చక్రవర్తి చేసే దానాన్ని అడ్డుచెప్పకుండా సహకరించే బలి సహధర్మచారిణి పాత్రకు సూచన. అలాగే, మొదటి స్కంధం నాందీ స్కంధమని, తరువాత వచ్చే ఘట్టాలకు ఎంతో సుందరంగా సూచనలు చేసిన భాగవత కర్త చాతుర్యానికి అబ్బురపడకుండా ఉండలేము.

కొడకులు, కోడళ్లు నీ మాటలు వింటున్నారా అనే విషయాన్ని శ్రీకృష్ణుడు వలెనే  కశ్యపుడు కూడా అడిగిన ప్రశ్నను తరువాత వచ్చే కంద పద్యంలో చూడవచ్చు. ఇదిగో చూడండి.

8-467-క.
బిడ్డలు వెఱతురె నీకఱ గొడ్డంబులు జేయ కెల్ల కోడండ్రును మా
ఱొడ్డారింపక నడతురె యెడ్డము గాకున్నదే మృగేక్షణ! యింటన్.

Comments