భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 42
ఈ భాగంలో పద్య శిల్పం ద్వారా చెప్పే విషయాన్ని కవి ఎలా పండిస్తాడో చూద్దాం. రెండూ, ప్రథమ స్కంధంలోని, ఒకటే కథా సందర్భంలోనివి.
మొదటిది. సూతుడు సౌనకాది మునులకు భాగవతం చెప్పడం మొదలు పెట్టాడు - మహాభారత యుద్ధం పూర్తయింది. తొడలు విరిగి పడి ఉన్న దుర్యోధనుడికి, "పాండవుల వంశ నాశనం చేస్తా"నని, అశ్వత్థామ మాట ఇచ్చాడు. రాత్రిపూట వెళ్లి, నిదురిస్తున్న ఉప పాండవులను చంపివేశాడు. పారిపోయిన అశ్వత్థామను అర్జునుడు, శ్రీకృష్ణుడు వెళ్లి పట్టుకున్నారు. ఆవేశంలో ఉన్న అర్జునుడిని కృష్ణుడు, అశ్వత్థామను ఎందుకు చంపకూడదో చెప్తున్నాడు.
రెండవది. అశ్వత్థామను బంధించి, విలపిస్తున్న ద్రౌపది దగ్గరకు, తీసుకువచ్చారు. నిదురిస్తున్న వారిని చంపడానికి నీకు చేతులెలా వచ్చాయని ద్రౌపది, అశ్వత్థామను ప్రశ్నిస్తోంది.
ఇవిగో పద్యాలు.
1-156-చ. (శ్రీకృష్ణుడి మాటలు)
వెఱచినవాని, దైన్యమున వేఁదుఱు నొందినవాని, నిద్ర మై
మఱచినవాని, సౌఖ్యమున మద్యము ద్రావినవాని, భగ్నుడై
పఱచినవాని, సాధు జడభావమువానిని, గావు మంచు వా
చఱచినవానిఁ, గామినులఁ జంపుట ధర్మము గాదు, ఫల్గునా!
1-163-శా. (ద్రౌపది మాటలు)
ఉద్రేకంబున రారు, శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు, కిం
చిద్రోహంబును నీకుఁ జేయరు, బలోత్సేకంబుతోఁ జీఁకటిన్
భద్రాకారులఁ, బిన్నపాఁపల, రణప్రౌఢక్రియాహీనులన్,
నిద్రాసక్తుల సంహరింప నకటానీ చేతు లెట్లాడెనో?
ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. నిజానికి రెండూ వేరువేరు వృత్త రీతులు. శ్రీకృష్ణుడి మాటలు చంపకమాల వృత్తంలో ఉంటే, ద్రౌపది మాటలు శార్దూలవిక్రీడితంలో ఉన్నది.
ముందుగా రెండింటికీ పోలిక చూద్దాం. భయపడేవారిని ("వెఱచినవాని") చంపరాదు అని కృష్ణుడంటే, ఉద్రేకంతో లేరు కదా ("ఉద్రేకంబున రారు") అని ద్రౌపది ప్రశ్నిస్తోంది. "నిద్రమైమఱచినవాని" అని మొదటి దానిలో ఉంటే, "నిద్రాసక్తుల" అని రెండోదానిలో ఉన్నది. అలాగే - దైన్యము, సాధుజడభావము, ఓడిపోయి పారిపోయే వారిని - చంపరాదు అంటే రెండవదానిలో యుద్ధావనిలో లేనివారిని-చీకటిలో-రణప్రౌఢక్రియహీనులను ఎలా చంపావు అని ప్రశ్న.
ఇప్పుడు పద్యశిల్పం చూద్దాం. శ్రీకృష్ణడు మాటల పద్యం గమనించండి. చంపకమాలలో ఉన్నది. పోతన దీనిని ఎంచుకోవడానికి కారణమున్నది. చంపకమాల వృత్తం శాంతం, కరుణ రసాలకు అనువైనది. అలాగే, పోతన ఎన్నుకున్న గురుశబ్దాలు కూడా చాలా వరకు సంయుక్తాక్షరాలు, ద్విత్వాలు లేకుండా ఉన్నాయి. ఎందుకంటే చెప్పవలసిన విషయం ద్వారా అర్జునుడిని శాంతింపచేయటం శ్రీకృష్ణుడి ముఖ్యోద్దేశం. తక్కువ మాటలతో ఆడంబరం లేకుండా చెప్పాలి.
రెండవ పద్యం ఇందుకు పూర్తి విరుద్ధం. ఉద్వేగంతో ఊగిపోతున్న ద్రౌపది మనస్సును మాటల ద్వారా ఆవిష్కరించాలి. గురువు శబ్దాలు ఎక్కువగా ఉండే శార్దూల వృత్తాన్ని ఎన్నుకున్నాడు పోతన. సంయుక్తాక్షరాలు, దీర్ఘాలు నిండి ఉన్న పదాలను ఎన్నుకుని పద్యాన్ని నడిపించాడు. మొదటి మూడు పాదాలనూ ఉద్వేగంతో నడిపించి, ఆఖరి పాదం మటుకూ "సంహరించ నకటానీ చేతులెట్లాడెనో" సంయుక్తాక్షరాలు లేకుండా, ద్రౌపది మనస్సులోని దైన్యాన్ని, నిస్సహాయతను మన కళ్లకు కడుతున్నాడు పోతన.
ఈ రెండు పద్యాలు చదువుతున్నప్పుడు ఆయా పాత్రలు మన కళ్లముందు సజీవంగా కనిపిస్తాయి. అందుకే పోతనది సజీవశిల్పం.
Comments
Post a Comment