భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 44
ఈ భాగంలో శ్రీహరి చింతన చేసే పద్యాలు చూద్దాం. ముందుగా కథా సందర్భాలు.
మొదటిది. సప్తమ స్కంధంలోని ప్రహ్లాద చరిత్రలోనిది. హిరణ్యకశిపుడు ఘోర తపస్సు చేస్తున్నాడు. ఆ సమయంలో గర్భంతో ఉన్న అతడి భార్య లీలావతికి నారదుడు ఆశ్రయం కల్పించాడు. రోజూ శ్రీమహావిష్ణువు గురించి బోధించేవాడు. కడుపులోనున్న బిడ్డ ఆ కథలన్నీ విని, పుట్టినప్పటి నుండే శ్రీహరి యందు భక్తి పరాయణుడిగా ఉండేవాడు. ఆ ప్రహ్లాదుడు ఏమి చేసినా సదా శ్రీహరి ధ్యానమే.
రెండవది. దశమ స్కంధం - పూర్వ భాగంలోనిది. చెరసాలలో ఉన్న దేవకి అష్టమ గర్భం ధరించింది. కంసునికి ఎక్కడ చూసినా, ఏమి చేస్తున్నా ఆ శ్రీహరి ధ్యానమే.
ఇవిగో పద్యాలు.
7-123-శా.
పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషింపుచున్ హాస లీ
లా నిద్రాదులు సేయుచున్ దిరుగుచున్ లక్షింపుచున్ సంతత
శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సం
ధానుం డై మఱచెన్ సురారిసుతుఁ డే త ద్విశ్వమున్ భూవరా!
10.1-85-క.
తిరుగుచు గుడుచుచు ద్రావుచు నరుగుచు గూర్చుండి లేచు చనవరతంబున్
హరి దలచి దలచి జగమా హరి మయమని జూచె కంసు డారని యలుకన్
ధానుం డై మఱచెన్ సురారిసుతుఁ డే త ద్విశ్వమున్ భూవరా!
10.1-85-క.
తిరుగుచు గుడుచుచు ద్రావుచు నరుగుచు గూర్చుండి లేచు చనవరతంబున్
హరి దలచి దలచి జగమా హరి మయమని జూచె కంసు డారని యలుకన్
ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. రెండింటి లోనూ, సదా శ్రీహరి ధ్యానములో నిమగ్నమైన వ్యక్తులను చూపే పద్యాలు. ఇద్దరూ - త్రాగుతున్నా, తింటున్నా, తిరుగుతున్నా - శ్రీహరి గురించిన ఆలోచనే. ఒకరిది భక్తి, మరొకరిది భయము. ఈ పద్యాలు చదువుతుంటే, "అలుకనైన జెలిమినైన" (ద్వ-23) అనే పద్యం స్ఫురిస్తుంది. మార్గాలు వేరైనా గమ్యం ఒకటే కదా.
మొదటి పద్యం నాలుగు పాదాల శార్దూలము. రెండవది రెండు పాదాల కంద పద్యము. గమనిస్తే, మొదటి పద్యంలోని మొదటి రెండు పాదాలలోని సారాన్నే, రెండవ పద్యంలో ఉంచాడు పోతన. ఎందుకంటే, తరువాతి రెండు పాదాలు, ప్రహ్లాదుని "శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సంధాన"ము, కంసుడిలో లేదు కదా, అందుకే పోతన రెండు పాదాలను ("పాద యుగళము") తీసివేసి చమత్కరించాడు అనిపిస్తోంది.
ప్రహ్లాదుడు తన చుట్టూ ఉన్న ప్రపంచం మఱచిపోతే ("మఱచెన్ సురారిసుతు డే త ద్విశ్వమున్"), కంసుడు ఎక్కడెక్కడా అని చీమ చిటుక్కుమన్నా, శ్రీహరి ధ్యానమే చేస్తున్నాడు. రెండు పాదాలకు కుదించినా, భయంతో ఉన్న కంసుని స్థితిని వర్ణించడానికి, వెనువెంటనే ఒక పెద్ద సీస పద్యాన్నే (10.1-87-సీ.) ఎన్నుకున్నాడు పోతన. (ద్వ-26).
Comments
Post a Comment