భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 49
గత భాగంలో (ద్వ-48) లాగానే ఈ భాగంలో కూడా దశావతారముల గురించిన మూడు పద్యాలు చూద్దాం. అన్ని పద్యాలు, దశమ స్కంధం పూర్వభాగం లోనివే. ముందుగా కథా సందర్భాలు.
మొదటిది. బాలకృష్ణుడు తన ఇంటిలోని పెరుగు కుండను బ్రద్దలుచేసి, వెన్న తిని ప్రక్క ఇంటికి వెళ్లి అక్కడ కూడా అల్లరి చేస్తున్నాడు. యశోద కంటబడ్డాడు. యశోదను నానా తిప్పలు పెట్టి చివరికి చేతికి చిక్కాడు. యశోద బాలకృష్ణుడిని నిష్టూరాలు ఆడుతోంది.
రెండవది. బాలకృష్ణుడు కాళింది మడుగులోని కాళీయుని మర్దనం చేసాడు. హేమంత ఋతువు వచ్చింది. ఆ ఋతువులోని మొదటి నెల మార్గశీర్షం. గోపికలు ఆ నెలరోజుల పాటు కాత్యాయని వ్రతం చేయదలచారు. శ్రీకృష్ణుడిని తామందరికీ పతిని చేయమని పార్వతిని కోరుకున్నారు. వ్రతనిష్టలో ఉన్న గోపికలు ఒకనాడు వస్త్రాలన్నీ ఒడ్డున విడిచి యమునా స్నానం చేస్తున్నారు. బాలకృష్ణుడు ఆ వస్త్రాలని దొంగిలించి కడిమి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. గోపికలు చిన్నికృష్ణుడిని ప్రార్ధిస్తున్నారు.
మూడవది. శ్రీకృష్ణుడికి, అక్రూరుని ద్వారా, కంసుడి నుంచి పిలుపు వచ్చింది. ఆహ్వానం అందుకుని, బలరామకృష్ణులు మథురకు చేరుకున్నారు. అక్కడ చాణూరుడు, ముష్టికుడు అనే ఇద్దరు మల్లయోధులు ఉన్న ప్రాంగణానికి వెళ్లారు. చాణూరుడు, శ్రీకృష్ణుడిని, తనతో మల్లయుద్ధం చేయమంటూ హేళనగా పిలిచాడు. శ్రీకృష్ణుడు, "నేను చిన్నవాడిని. అయినా రాజుకి వినోదం కలిగించే ఆట కనుక కాదనకూడదు కనుక సరే" నన్నాడు. చాణూరునికి రోషం హెచ్చింది, శ్రీకృష్ణునితో "నీవింక పారిపోలేవు, వదలను"నంటున్నాడు.
ఇవిగో పద్యాలు.
తోయంబు లివి యని తొలగక చొచ్చెదు తలఁచెదు గట్టైనఁ దరల నెత్త;
మంటితో నాటలు మానవు; కోరాడె దున్నత స్తంభంబు లూఁపఁ బోయె;
దన్యుల నల్పంబు లడుగంగఁ బాఱెదు రాచవేఁటలఁ జాల ఱవ్వఁదెచ్చె;
దలయవు నీళ్ళకు నడ్డంబు గట్టెదు ముసలివై హలివృత్తి మొనయఁ; జూచె
దంబరంబు మొలకు నడుగవు తిరిగెద వింకఁ గల్కిచేఁత లేల పుత్ర!
నిన్ను వంప వ్రాల్ప నే నేర ననియొ నీ విట్టు క్రిందు మీఁదు నెఱుఁగ కునికి.”
10.1-822-సీ. (గోపికల వేడుకోలు)
బహుజీవనముతోడ భాసిల్లి యుండుటో? గోత్రంబు నిలుపుటో కూర్మితోడ?
మహి నుద్ధరించుటో? మనుజసింహంబవై ప్రజలఁ గాచుటొ? కాక బలిఁ దెరల్చి
పిన్నవై యుండియుఁ బెంపు వహించుటో? రాజుల గెలుచుటో రణములోన?
గురునాజ్ఞ జేయుటో? గుణనిధి వై బలప్రఖ్యాతిఁ జూపుటో భద్రలీల?
బుధులు మెచ్చ భువిఁ బ్రబుద్ధత మెఱయుటో? కలికితనము చేయ ఘనత గలదె?
వావి లేదు వారి వారు నా వారని యెఱుఁగ వలదె? వలువ లిమ్ము కృష్ణ!
10.1-1343-సీ. (చాణూరుని బెదిరింపులు)
చలమున నను డాసి జలరాశిఁ జొరరాదు నిగిడి గోత్రముదండ నిలువరాదు;
కేడించి కుంభిని క్రిందికిఁ బోరాదు మనుజసింహుఁడ నని మలయరాదు;
చేరినఁ బడవైతుఁ జెయి చాపఁగారాదు బెరసి నా ముందటఁ బెరుఁగరాదు;
భూనాథ హింసకుఁ బోరాదు నను మీఱి శోధింతుఁ గానలఁ జొరఁగరాదు;
ప్రబలమూర్తి ననుచు భాసిల్లఁగారాదు; ధరఁ బ్రబుద్ధుఁడ నని దఱుమరాదు;
కలికితనము చూపి గర్వింపఁగారాదు; తరముగాదు; కృష్ణ! తలఁగు తలఁగు.

ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. మూడూ సీసపద్యాలు. అన్నీ దశావతారాల అంతరార్థంతో నడిచిన పద్యాలు. వ్యాసము నిడివి కోసం మూడింటిలోని ఒక్కొక్క పరిశీలన చేద్దాం.
మొదటి పద్యం, దశావతారాలలో శ్రీహరి చేసిన పనులను బాలకృష్ణుని పనులతో పోల్చుతూ నడిచింది.
రెండవ పద్యం ద్వంద్వార్థాలతో నడిచింది. జీవనము (జలము, జన్మ), కూర్మి (కూర్మము, ప్రేమ), మనుజసింహము (నరసింహము, నరులలో సింహము) - ఇలాగన్నమాట.
మూడవ పద్యం దశావతారాలలోని వస్తువులను, పనులనూ సూచిస్తూ నిందాస్తుతిగా నడిచింది. గతభాగంలోని కాలయవనుడి మాటలు (ద్వ-48) గుర్తుకువస్తాయి.
ఆలోచిస్తే దశావతారాలలోని మర్మాలన్నీ, శ్రీకృష్ణుడు తన లీలలో చూపించాడు. ఉదాహరణకు నీళ్లలో (కాళీయ మర్దన), కొండ ఎత్తుటలో (గోవర్ధనగిరి), మరగుజ్జురూపము (బాలకృష్ణుడు), రాక్షస సంహారం, మొదలైనవి., రామావతారము పూర్ణావతారమని, శ్రీకృష్ణావతారము పరిపూర్ణావతారమని చెప్తారు కదా. శ్రీకృష్ణావతార మూలమైన దశమస్కంధం అని కాబోలు, పోతన పలుమార్లు దశావతారాల అంతరార్ధంతో పద్యాలు అద్భుతంగా నడిపించినాడు.
Comments
Post a Comment