భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 37
ఈ భాగంలో వామనుడి నడకను వర్ణించే పద్యాలను చూద్దాం. అన్నింటి కథా సందర్భాలు ఒకటే.
అష్టమ స్కంధంలోని వామనావతార ఘట్టంలోనివి. కశ్యప మహర్షి, అదితి పుత్రుడయిన వామనుడు, ఇంద్రునికి మరలా రాజ్యం ఇప్పించాలనే ఉద్దేశంతో బలి చక్రవర్తి దగ్గరకు వెళ్తున్నాడు. ఆ సమయంలో బలి గొప్పయాగం చేస్తున్నాడు. పొట్టివాడయిన వామనుడు అందరిని పలుకరిస్తూ బలి చక్రవర్తి ఉన్న చోటుకు చేరుకున్నాడు.
ఇవిగో పద్యాలు.
హరిహరి! సిరియురమునఁ గల
హరి హరిహయు కొఱకు దనుజునడుగన్ జనియెన్
బరహితరతమతియుతు లగు
బరహితరతమతియుతు లగు
దొరలకు నడుగుటలు నొడలి తొడవులు పుడమిన్.
వెఱచుచు వంగుచు వ్రాలుచు
నఱిముఱి గుబురులకుఁ జనుచు హరిహరి! యనుచున్
మఱుఁగుచు నులుకుచు దిరదిరఁ
మఱుఁగుచు నులుకుచు దిరదిరఁ
నెడనెడ నడుగిడఁగ నడరి యిల దిగఁబడఁగన్
బుడిబుడి నొడువులు నొడువుచుఁ
బుడిబుడి నొడువులు నొడువుచుఁ
జిడిముడి తడఁబడఁగ వడుగు సేరెన్ రాజున్
ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. మూడూ కంద పద్యాలు. మూడూ సర్వలఘువు కందాలు కాకాపోయినా, లఘువులు ఎక్కువగా ఉన్న పద్యాలు. మూడూ పొట్టివాడైన వామనుడి నడకను వర్ణిస్తున్న పద్యాలు.
ఒక పొట్టివాని నడకకు పొడుగువాని నడకకు తేడా ఉంటుంది. దానికి తోడు పొట్టివాడు వడివడిగా నడిస్తే, చిన్న చిన్న అడుగులతో ఒక రకమైన లయ మనకు కనిపిస్తుంది. ఆ లయను మనకు చూపించడానికే పోతన లఘువులు ఎక్కువగా ఉన్న కందాలను ఎన్నుకున్నాడు. ప్రతి పద్యంలోనూ ఒక గమ్మత్తు ఉంది. ఒక్కొక్క పద్యమే చూద్దాం.
మొదట పద్యంలో ఎత్తుకోవటమే, "హరిహరి" (అయ్యయ్యో!) అనే అర్ధంలో వాడి చమత్కరించారు. భగవంతుడు, లక్ష్మీ విభుడు, ఇంద్రుని కోసమని ("హరిహయు కొఱకు") బలి చక్రవర్తి ముందు చెయ్యి చాచటం ఏమిటి? ఏమిటీ వింత? అందుకే ఈ పద్యాన్ని కాస్త లోగొంతుకలో చదువుకోవాలని విశ్వనాథ సత్యన్నారాయణ చెప్పేవారని ఈ పద్యశిల్పం వ్యాసంలో చదివాను.
రెండవ పద్యం చూస్తే, వామనుడు యజ్ఞవాటికను చేరుకున్నాడు. అటూఇటూ తిరుగుతూ "హరిహరి" (అయ్యయ్యో!) అంటూ కొంత నటిస్తున్నాడు. ఆ నటనను సూచించడానికా అన్నట్లుగా, నడుస్తూ తిరుగుతున్నప్పుడు లఘువులు (2,3వ పాదాలు), "వంగుచు వ్రాలుచు", "గుఱుమట్టపు పొట్టివడుగు గొంత నటించెన్" (1,4వ పాదాలు) లో కొన్ని గురు శబ్దములు వాడాడు పోతను.
మూడవ పద్యం చూస్తే, వామనుడు యజ్ఞవాటికలో నున్న బలి చక్రవర్తి దగ్గరకు నడుచుకుంటూ వెళ్లాడు. మళ్లీ సర్వలఘు కందము. బలి చక్రవర్తిని చేరుకున్నప్పుడు మాత్రం, "సేరెన్ రాజున్" అని సర్వలఘు నడక, వామనుడి నడక ఆగింది.
శబ్దశిల్పంతో సన్నివేశాన్ని కళ్లకు కట్టట్టమంటే ఇదే.
Comments
Post a Comment