భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 48
ఈ భాగంలో శ్రీమహావిష్ణువు దశావతార వర్ణన చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. రెండూ దశమ స్కంధం, పూర్వభాగం లోనివి.
మొదటిది. కంసుని చెఱలోనున్న, దేవకి అష్టమ గర్భం ధరించింది. బ్రహ్మ తదితర దేవతలు వచ్చి గర్భంలో ఉన్న శ్రీమహావిష్ణువును స్తుతి చేస్తున్నారు.
రెండవది. శ్రీకృష్ణుడు కంసుని సంహారం చేసిన అనంతరం, మథురను రాజధానిగా రాజ్యం చేస్తున్నాడు. జరాసంధుడిని ఓడించాడు. తరువాత కాలయవనుడు అనేవాడు మూడు కోట్లమందితో దండెత్తి వచ్చాడు. శ్రీకృష్ణుడు సముద్రం మధ్యలో ద్వారకను కట్టించి, ప్రజలను అక్కడకు తరలించాడు. కాలయవనుడికి చిక్కకుండా పారిపోయాడు. పారిపోతున్న శ్రీకృష్ణుడిని, కాలయవనుడు వెంబడించాడు. "ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటా"నని అంటున్నాడు.
ఇవిగో పద్యాలు.
10.1-100-మ. (దేవకి గర్భంలోనున్న శ్రీకృష్ణుడిని స్తుతించుట)
గురు పాఠీనమవై, జలగ్రహమవై, కోలంబవై, శ్రీనృకేసరివై, భిక్షుఁడవై, హయాననుఁడవై, క్ష్మాదేవతాభర్తవై,
ధరణీనాథుడవై, దయాగుణగణోదారుండవై, లోకముల్
పరిరక్షించిన నీకు మ్రొక్కెద; మిలాభారంబు వారింపవే.
10.1-1625-మ. (శ్రీకృష్ణుని వెంబడిస్తూ కాలయవనుడి మాటలు)
బలిమిన్ మాధవ! నేఁడు నిన్ను భువనప్రఖ్యాతిగాఁ బట్టుదున్జలముల్ సొచ్చిన, భూమి క్రిందఁ జనినన్, శైలంబుపై నెక్కినన్,
బలిదండన్ విలసించినన్, వికృతరూపంబుం బ్రవేశించినన్,
జలధిన్ దాఁటిన, నగ్రజన్మ హలి కాశ్వాటాకృతుల్ దాల్చినన్.
ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. రెండూ మత్తేభ వృత్తాలు. రెండు పద్యాలకూ సామ్యము పోతన ఎన్నుకున్న దశావతార వర్ణనలో ఉన్నది. మొదటి పద్యంలో బ్రహ్మదేవుడు శ్రీమహావిష్ణువు యొక్క ఎనిమిది అవతారాలను వర్ణించాడు. మనము సాధారణంగా చెప్పుకునే బలరామ, శ్రీకృష్ణ, కల్కి తప్పించి హయగ్రీవావతారం చెప్పబడినది.
రెండవ పద్యంలో దశావతార వర్ణన కాకుండా, ద్వంద్వార్ధంలో, దశావతార సూచనగా ఉన్నది. నీటిలో ఉన్నా (మత్స్య), భూమి క్రింద ఉన్నా (వరాహ), కొండపై ఎక్కినా (కూర్మ) ఇలాగన్నమాట. దీనిలో మనము సాధారణంగా వినే దశావతార సూచన ఉన్నది.
నిజానికి, శ్రీమహావిష్ణువు యొక్క అవతారాలు చాలా ఉన్నవి. భాగవతం మొదటి స్కంధంలో కథ ఆరంభంలోనే సూతుడు భగవంతుని 21 అవతారాల గురించి చెప్పాడు. దానిలోనుండి ఒక పది అవతారాలు మన సౌలభ్యం కోసం మనం మననం చేసుకుంటూంటాం.
దశమస్కంధం అని కాబోలు, పోతన ఈ పద్యాలలో దశావతార వర్ణన, సూచనలు చేసి చమత్కరించాడు. దశమ స్కంధం నుంచే, ఇటువంటి పద్యాలు, మరో మూడు, తరువాతి భాగంలో చూద్దాం.
--
యాదృచ్ఛికంగా, ఈ వారం "పలికెద భాగవతం" అనే కార్యక్రమంలో శ్రీ అద్దంకి శ్రీనివాసు అవతారాల విశిష్టత గురించి చెప్పారు. వీరు "బాలల భాగవతం" పేరిట, పోతన వ్రాసిన భాగవతాన్ని, సరళమైన భాషలో పిల్లలకు అనువైనదిగా వ్రాసారు.
Comments
Post a Comment