Posts

Showing posts from June, 2020

భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 12

చిన్న ఉపోద్ఘాతం. 1997/98 నాటి విషయం. పైచదువులకోసం భారతదేశం నుండి వచ్చిన క్రొత్తలు. ఒక స్నేహితుడు “Thesis defense” చేస్తున్నాడని, తోటివారమంతా వెళ్లాం. అతను మొదలు పెట్టిన రెండో నిమిషంలో ఒక ప్రొఫెసరు ఆపి, “What is your Thesis?” అని అడిగారు. తను థీసిస్ యొక్క శీర్షిక (Title) చెప్పాడు. అప్పుడు ఆ ప్రొఫెసరు, “That is title. I want to know what your Thesis is.” అన్నారు. తనతో పాటు, మేమందరం కూడా బిక్కముఖం వేశాం. అప్పుడు ఆయనే వివరించారు. Thesis అంటే ప్రతిపాదన. నువ్వేమి ప్రతిపాదిస్తున్నావు. దానిని రెండుముక్కలలో ముందు చెప్పు తరువాతదంతా దాని గురించిన వివరణ, సమర్ధన (defense). వ్రాసినప్పుడు కూడా చెప్పాలనుకున్న విషయాన్ని సంక్షిప్తంగా (abstract) చెబుతాము కదా. ఎందుకో ఆయన చెప్పినది నా మనసులో ఉండిపోయింది. భాగవతం కూడా ఆ దృష్టితో చూస్తే, పోతన తన మొదటి పద్యం ఒక ప్రతిపాదనా పద్యంలాగా కనబడుతుంది. అయితే దేని గురించి ప్రతిపాదన చేస్తున్నారు? భగవంతుని తత్వం గురించి ప్రతిపాదన. ఇదిగో భాగవతంలోని మొట్టమొదటి పద్యం. లంకె మీద నొక్కితే లోతైన వివరణ ఉన్నది. 1-1-శా. (ప్రతిపాదనా పద్యం) శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ ల

ఛందస్సు పద్యాలు చదవుకోవడం ఎలా?

Image
ప్రస్తావన: “పద్యాలు రాగయుక్తంగా పాడితే బాగుంటుంది” అంటారు ఘంటసాల భక్తులు. “కాదు, కాదు. అసలు నాటకీయ ఫక్కీలో చెప్తేనే బాగుంటుంది ” అంటూ పద్యనాటక ప్రియులు, “జెండాపై కపిరాజు..”, గుర్తుచేసుకుంటారు. “కాదండీ! ముందుగా నడక, విరుపు పట్టుకోవాలి “ అంటారు విజ్ఞులు. అన్నింటిలోనూ నిజముంది. మరి ఆ పట్టు ఎలా సాధించాలి? మనంతట మనము కొంచెం చదువుకోగలిగితే, ఎవరి శక్తిని బట్టీ వారు తరువాత పద్ధతి (పాట, నాటకీయత వగైరా) మార్చుకోవచ్చు. అసలు చిక్కంతా ఒక పద్యం తీసి మనమే ఎలా చదువుకోవాలి అని. “చక్కగా గద్యంలో ఉన్నట్టుగా, చుక్కలు-కామాలు-ప్రశ్నార్ధకాలు వంటి “దృశ్య చిహ్నాలు” (visual cues) ఉంటే పద్యాలన్నీ ఎంచక్కా చదివేసుకోవచ్చు” - అని నాకు ఒక ఆలోచన ఉండేది. ఎక్కడ ఆపాలో, ఎక్కడ నెమ్మదించాలో తెలిసేది కదా అనుకునేవాడిని. కూడబలుక్కుని చదువగా చదువగా, అటువంటి “చిహ్నాలు” భాషలోనే “శబ్ద చిహ్నాలు”గా (audio cues) - పాయసంలో పంచదారలాగా - కలసిపోయి ఉన్నాయని తెలిసింది. మరి వాటిని గుర్తించడం ఎలా? ఆ తీయదనం ఆస్వాదించి అనుభవించి తెలుసుకోవాలి. సూత్రములు: ఈ వ్యాసంలో ఛందోబద్దమైన పద్యాన్ని చదువుకోవడం, “విరుపు”, ఎలాగో కొన్ని మార్గదర్శ సూత్రీకరణలు (gu