భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 50
ఈ భాగంలో రెండు స్తుతి పద్యాలు చూద్దాం. ముందుగా కథా సందర్భాలు.
మొదటిది. నవమ స్కంధంలోని అంబరీషోపాఖ్యానము లోనిది. అంబరీషుడనే చక్రవర్తి గొప్ప విష్ణు భక్తుడు. అతడు ఒకసారి దూర్వాస మహర్షి కోపానికి గురయినాడు. దూర్వాసుడు తన జటను ఊడపెరికి నేలకేసి కొట్టి, దాని నుంచి ఒక పిశాచిని సృష్టించాడు. తన భక్తుడిని రక్షించేందుకు, శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రాన్ని పంపించాడు. ఆ సుదర్శన చక్రానికి భయపడి, దూర్వాసుడు బ్రహ్మదేవుడిని, శివడిని ఆశ్రయించాడు. వారు తమ నిస్సహాయతను తెలియచేసారు. చివరికి శ్రీమహావిష్ణువు దగ్గరకే వెళ్లగా, "నేను నా భక్తులకే దాసుడను. నీవు వెళ్లి ఆ అంబరీషుడినే శరణు వేడుకో" అని విష్ణువు చెప్పాడు. గత్యంతరం లేక, దూర్వాసుడు అంబరీషుడినే అర్ధించాడు. అంబరీషుడు, ఆ సుదర్శన చక్రాన్ని స్తుతిస్తున్నాడు.
రెండవది. దశమ స్కంధం పూర్వభాగంలోనిది. బాలకృష్ణుడి అల్లరికి కోపం వచ్చిన యశోద, దండించడానికి చేతులు రాక, కృష్ణుడిని ఒక రోటికి కట్టివేసింది. బాలకృష్ణుడు ఆ రోటిని లాక్కుంటూ వెళ్లి, పెరటిలోని రెండు మద్ది చెట్లను కూల్చి వేసాడు. కూలిన మద్ది చెట్లనుంచి ఇద్దరు సిద్ధులు ప్రత్యక్షమైనారు. వారిద్దరూ బాలకృష్ణుడిని స్తుతిస్తున్నారు.
ఇవిగో పద్యాలు.
9-129-సీ. (అంబరీషుని ద్వారా సుదర్శన చక్ర స్తుతి)
నీవ పావకుఁడవు; నీవ సూర్యుండవు నీవ చంద్రుండవు; నీవ జలము;నీవ నేలయు; నింగి నీవ; సమీరంబు నీవ; భూతేంద్రియ నికర మీవ;
నీవ బ్రహ్మంబును; నీవ సత్యంబును నీవ యజ్ఞంబును; నీవ ఫలము;
నీవ లోకేశులు; నీవ సర్వాత్మయు నీవ కాలంబును; నీవ జగము;
నీవ బహుయజ్ఞభోజివి; నీవ నిత్య మూలతేజంబు; నీకు నే మ్రొక్కువాఁడ
నీరజాక్షుండు చాల మన్నించు నట్టి శస్త్రముఖ్యమ! కావవే చాలు మునిని.
10.1-405-సీ. (సిద్ధుల ద్వారా బాలకృష్ణుని స్తుతి)
ఎల్లభూతంబుల కింద్రియాహంకృతి-ప్రాణంబులకు నధిపతివి నీవ;
ప్రకృతియుఁ బ్రకృతిసంభవమహత్తును నీవ-వీని కన్నిటికిని విభుఁడ వీవ;
ప్రాకృతగుణవికారములఁ బొందక పూర్వ-సిద్దుఁడ వగు నిన్నుఁ జింత జేయ
గుణయుతుం డోపునే? గుణహీన! నీ యంద-కల గుణంబుల నీవ కప్పఁబడుదు;
మొదల నెవ్వని యవతారములు శరీరులందు సరిదొడ్డు లేని వీర్యముల దనువు
లడర జన్మించి వారల యందుఁ జిక్క; వట్టి పరమేశ! మ్రొక్కెద మయ్య! నీకు.
ఇప్పుడు ద్వంద్వశిల్పం చూద్దాం. రెండూ సీస పద్యాలు. రెండూ స్తుతి చేస్తున్న పద్యాలు. రెండింటిలోనూ "నీవ..నీవ..నీవ" అంటూ నడక.
మొదటి పద్యం సుదర్శన చక్రమును స్తుతిస్తున్న పద్యమైనా, చివరకు "నీరజాక్షుండు చాల మన్నించు నట్టి శస్త్రముఖ్యమ" అన్నాడు. ముందుగా, సూర్యచంద్రులు, పంచభూతాలు మొదలైన వన్నీ సుదర్శన చక్ర రూపమని చెప్పి, ఆ సుదర్శన చక్రం విష్ణువు శస్త్రమని మనకు చెప్తున్నాడు పోతన. "అస్త్రము" అంటే బాణము, ఈటె వంటి - దూరం నుంచి వాడేవి అని, "శస్త్రము" అంటే చేతితో పట్టుకుని వాడే కత్తి, బాకు వంటివని - ఎక్కడో గరికపాటి వారి ప్రవచనంలో విన్నాను. అలా ఆలోచిస్తే మన కంటికి కనపడేవన్నీ ఆ శ్రీహరి ద్వారా చేయపడుతున్న లీల అని అర్ధం.
రెండవ పద్యం, బాలకృష్ణుని యొక్క స్తుతి. మనకు కనిపించే వాటికి మూలము, వాటికి అధిపతి ఆ శ్రీకృష్ణుడేనని సూచన. కానీ ఆ గుణహీనమైన మూల పదార్ధము, మన గుణములచే కప్పబడి ఉన్నదని, సకల జీవులలోను ఉన్నది ఆ పరమేశుడేనని చెప్పున్నారు.
వెరసి, అన్నింటినీ చేయించేది, అన్నింటిలోనూ ఉన్నది, అతంటా ఆ భగవంతుడేనని భావం.
--
మొదటి పద్యం చదివిన తరువాత, దానిలోని నీవ..నీవ.. అనే నడక నన్ను ఆకట్టుకుంది. అటువంటి పద్యం మరేదైనా ఉన్నదేమోనని వెతుకుతుంటే, పెద్దన వ్రాసిన, మనుచరిత్రలోని ఈ క్రింది సీస పద్యం కనిపించింది.
అవ్యయానంత విశ్వాత్మక విశ్వేశ, బ్రహ్మవు నీవ కపర్ది వీవ
యింద్రుండ వీవ వహ్నివి యనిలుఁడ వీవ, వరుణుండ వీవ భాస్కరుఁడ వీవ
యముఁడ వీవ వసూత్కరము నీవ రుద్రులు, నీవ యాదిత్యులు నీవ విశ్వు
లీవ మరుత్తులు నీవ మంత్రములు నోం, కృతి వషట్కృతి శ్రుతి స్మృతులు నీవ
వేద్య మీవ యీవచ్చిన విబుధగణము- సర్వమును నీవ యెట్లన్న సర్వగతుఁడ
వగుట మఱి నీవు గానివాఁడనఁగ నెవ్వఁ-డరయఁగను శేషభూతసమస్త! శేషి!
యింద్రుండ వీవ వహ్నివి యనిలుఁడ వీవ, వరుణుండ వీవ భాస్కరుఁడ వీవ
యముఁడ వీవ వసూత్కరము నీవ రుద్రులు, నీవ యాదిత్యులు నీవ విశ్వు
లీవ మరుత్తులు నీవ మంత్రములు నోం, కృతి వషట్కృతి శ్రుతి స్మృతులు నీవ
వేద్య మీవ యీవచ్చిన విబుధగణము- సర్వమును నీవ యెట్లన్న సర్వగతుఁడ
వగుట మఱి నీవు గానివాఁడనఁగ నెవ్వఁ-డరయఁగను శేషభూతసమస్త! శేషి!
Comments
Post a Comment