భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 35

ఈ భాగంలో భగవంతుని మీద దృష్టి ఎలా పెట్టాలో చెప్పే పద్యాలు చూద్దాం. ముందుగా కథా సందర్భాలు.

మొదటిది. ప్రథమ స్కంధంలోనిది. మహాభారత యుద్ధం పూర్తయింది. శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్లిపోతూ అంపశయ్య మీద, ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచిచూస్తున్న భీష్ముడి దగ్గరకు వెళ్లాడు. ఆ భీష్ముడు అన్ని ఆలోచనలు మాని, ప్రశాంత చిత్తంతో భగవంతుడిని ధ్యానిస్తున్నాడు.

రెండవది. అష్టమ స్కంధంలోని గజేంద్రమోక్షం ఘట్టంలోనిది. తన సరస్సులోనికి వచ్చి అల్లరి చేస్తున్న గజేంద్రుడిని, మొసలి అదను చూసి, శబ్దంచేయకుండా, దృష్టి కేంద్రీకరించి ఒక యోగీంద్రుని వలెనే పట్టుకుంది.

ఇవిగో పద్యాలు.

1-217-శా. (భీష్ముడు)
ఆలాపంబులు మాని, చిత్తము మనీషాయత్తముం జేసి, దృ
గ్జాలంబున్ హరిమోముపైఁ బఱపి, తత్కారుణ్యదృష్టిన్ విని
ర్మూలీభూత శరవ్యధా నిచయుఁడై మోదించి, భీష్ముండు సం
శీలం బొప్ప నుతించెఁ గల్మషగజశ్రేణీహరిన్, శ్రీహరిన్.

8-65-శా (యోగీంద్రుని వంటి మొసలి)
పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియో
న్మాదంబుం బరిమార్చి బుద్ధిలతకున్ మాఱాకు హత్తించి ని
ష్ఖేదబ్రహ్మపదావలంబనరతిం గ్రీడించు యోగీంద్రు మ
ర్యాదన్నక్రము విక్రమించెఁ గరిపాదాక్రాంతనిర్వక్రమై.


ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. రెండూ శార్దూల పద్యాలు. ఏకాగ్రతతో చేసే పనులను వర్ణిస్తున్న ఘట్టాలు. భీష్ముడు మౌనం వహిస్తే ("ఆలాపంబులు మాని"), మొసలి ఊపిరి బిగపట్టి ("పవనున్ బంధించి") ఉన్నది. మొదటి దానిలో మనస్సును బంధిస్తే ("చిత్తము మనీషాయత్తము జేసి"), రెండవదానిలో ఇంద్రియాలను నిగ్రహించి ("పంచేంద్రియోన్మాదంబుం బరిమార్చి"). పోతన మొసలిని యోగీంద్రునితో ఎందుకు పోల్చారు?

ఇంతకు ముందు భాగాలలో చెప్పుకున్నట్టుగా, భాగవతంలోని మొదటి స్కంధం, తరువాత వచ్చే స్కంధాలలోని భాగవతుల కథలకు నాందీ స్కంధము వంటిది. ఆ దృష్టితో చూస్తే, సంసారమనే కాసారంలో, అహంకారంతో తిరుగాడుతున్న గజేంద్రుడిని నిగ్రహించాలంటే యోగీంద్రుడి వంటి మొసలితోనే సాధ్యము. తన అహంకారం తెలుసుకుని పశ్చాత్తాపం చెందిన గజేంద్రుడిని రక్షించాలన్నా, ఆ యోగీంద్రునికి మోక్షం ప్రసాదించాలన్నా శ్రీహరి వలననే సాధ్యము. మొదటి పద్యంలో "కల్మష గజశ్రేణీ హరిన్ శ్రీహరిన్" అనే పదబంధం తరువాత రాబోయే గజేంద్రమోక్ష ఘట్టానికి సూచన అని నా ఊహ.

రెండవ పద్యంలోని గమ్మత్తును శ్రీ చాగంటి కోటేశ్వరరావు, తన ప్రవచనాలలో ప్రస్తావిస్తూ ఉంటారు. ఆ పద్యంలోని చివరి పాదంలో "నక్రము - విక్రము - పాదాక్రాంత - నిర్వక్రమై" పదాలలోని "క్ర" అనే అక్షరం. దీనిలో క - ఏనుగు ఆకారాన్ని తలపిస్తుందని, ర - ఒత్తు నోరు తెరచిన మొసలిని తలపిస్తుందని చమత్కరిస్తుంటారు. వెరసి, "క్ర" - కరి-మకరి యొక్క రూపమని వారి భావన.

ముందరి భాగాలలో, మొదటి స్కంధం నాందీ స్కంధమయితే, ద్వితీయ స్కంధం ప్రస్తావన స్కంధమని చెప్పుకున్నాం. ద్వితీయ స్కంధంలోని ఈ పద్యం చూడండి. శుక మహర్షి, పరీక్షిత్తుకు భగవంతుని చేరుకునే ధారణ పద్ధతిని వివరిస్తున్నాడు.

2-15-ఆ.
పవనములు జయించి పరిహృతసంగుఁడై యింద్రియముల గర్వమెల్ల మాపి
హరి విశాలరూపమందుఁ జిత్తముఁ జేర్చి నిలుపవలయు బుద్ధి నెఱపి బుధుఁడు.

భావం - పండితుడైనవాడు శ్వాసవాయువులను జయించి, సంసారం తోడి తగులం వదలిపెట్టి, ఇంద్రియాల గర్వమంతా అణచి బుద్ధిబలంతో మనస్సును విష్ణుదేవుని విశాల స్వరూపం యందు స్థిరంగా నిలపాలి.

--
భగవంతుని యోగశాస్త్రాన్ని భాగవతుల కథల రూపంలో మనకు అందించిన విషయాన్ని గ్రహించలేక, "తన ఇంటిలోకి జొరబడ్డ ఏనుగును రక్షించి, మొసలిని చంపటం ఏమి న్యాయం?" అంటూ చొపద్దంటు ప్రశ్నలు వేసేవారికి ఏమి చెప్తాం?

Comments