భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 39

ఈ భాగంలో పంచభూతాలకు అధిపతి అయిన భగవంతుని గురించిన రెండు పద్యాలను చూద్దాం. రెండూ ఎనిమిదవ స్కంధంలోనివి. ముందుగా కథా సందర్భాలు.

మొదటిది. ఎనిమిదవ స్కంధంలోని రెండవ ఘట్టం, సముద్ర మథనం లోనిది. దేవతలు, రాక్షసులు మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని సముద్రాన్ని చిలుకుతున్నారు. మొదట హాలాహలం పుట్టింది. అందరూ వెళ్లి, "పంచభూతాలకూ అధిపతివి నీవే" అని శివుడిని శరణుకోరుతున్నారు. 

రెండవది. ఎనిమిదవ స్కంధంలోని మూడవ ఘట్టం. వామన చరిత్రలోనిది. శ్రీమహావిష్ణువు, వామన అవతారమెత్తి బలి చక్రవర్తిని మూడు అడుగులు అడిగాడు. బలి తాను ఇచ్చిన మాట ప్రకారం దానం చేసాడు. వామనుడు, భూమి, ఆకాశాన్ని ఆక్రమించి మూడవ అడుగుతో బలి "తల"ను తొక్కివేసి, బంధించాడు. బ్రహ్మదేవుడు వచ్చి, "పంచభూతాలకూ అధిపతివి నీవే! అంతటి దానపరుడుని బంధించడం న్యాయమా!" అని అడుగుతున్నాడు.

8-222-సీ.  (శివునితో బ్రహ్మాది దేవతలు)
భూతాత్మ! భూతేశ! భూత భావనరూప! దేవ! మహాదేవ! దేవవంద్య!
యీ లోకముల కెల్ల నీశ్వరుండవు నీవ; బంధమోక్షములకుఁ బ్రభుఁడ వీవ;
యార్త శరణ్యుండ వగు గురుండవు నిన్నుఁ; గోరి భజింతురు కుశలమతులు;
సకల సృష్టిస్థితిసంహారకర్తవై; బ్రహ్మ విష్ణు శివాఖ్యఁ బరఁగు దీవ;

పరమ గుహ్య మయిన బ్రహ్మంబు సదసత్త మంబు నీవ శక్తిమయుఁడ వీవ;
శబ్దయోని వీవ; జగదంతరాత్మవు నీవ; ప్రాణ మరయ నిఖిలమునకు.


8-659-సీ. (వామనుడితో బ్రహ్మ పలుకులు)
భూతలోకేశ్వర! భూతభావన! దేవదేవ! జగన్నాథ! దేవవంద్య!
తనసొమ్ము సకలంబు దప్పక నీ కిచ్చె దండయోగ్యుఁడు గాఁడు దానపరుఁడు
కరుణింప నర్హుండు కమలలోచన! నీకు విడిపింపు మీతని వెఱపుఁ దీర్చి
తోయపూరము చల్లి దూర్వాంకురంబులఁ జేరి నీ పదము లర్చించునట్టి

భక్తియుక్తుఁడు లోకేశపదము నందు నీవు ప్రత్యక్షముగ వచ్చి నేఁడు వేఁడ
నెఱిఁగి తనరాజ్యమంతయు నిచ్చినట్టి బలికిఁ దగునయ్య దృఢ పాశబంధనంబు.

ఇప్పుడు ద్వంద్వశిల్పం చూద్దాం. రెండూ సీసపద్యాలు. రెండింటికీ సామ్యమంతా మొదటి పాదంలో ఉన్నది. మొదటి దానిలో శివుడిని "భూతాత్మ! భూతేశ!", "భూతభావనరూప", "మహాదేవ" "దేవవంద్య" అని సంబోధిస్తే, రెండవ దానిలో విష్ణువుని "భూతలోకేశ్వర", "భూతభావన", "దేవదేవ", "దేవవంద్య"  అంటూ సంబోధన.  ఈ సంబోధనలు ప్రకారం పోతన హరిహరులకు అభేదం ప్రకటిస్తున్నాడని తెలిసిపోతోంది. 

రెండవ పద్యంలోని మొదటి పాదం ఎందుకని పోతన అలా ఎత్తుకున్నాడు? అది కూడా ఎనిమిదవ స్కంధంలోనే.  కేవలం హరిహరులకు అభేదం సూచించడానికేనా? నాకు తోచిన సమాధానం. మొదటి పద్యంలోని భగవంతుని తత్వం, వామనావతారానకి కూడా ఆపాదిస్తూ, మనకు గుర్తుచేస్తున్నాడు. మొదటి దానిలో "లోకముల కెల్ల నీశ్వరుండవు" అంటే వామనుడు త్రివిక్రముడై ముల్లోకాలనూ ఆక్రమించాడు కదా, "బంధమోక్షములకుఁ బ్రభుఁడ" అంటే బంధించినా, మోక్షం ప్రసాదించినా వామనుడే చేయాలి, "యార్త శరణ్యుండ" అంటే బలి చక్రవర్తికి శరణు ప్రసాదించాల్సిన వాడు వామనుడే. 

చివరిగా, 19వ భాగంలో, విష్ణుసహస్రనామాలలోని మొదటి శ్లోకంలోని మొదటి పాదం చూసాం. స్థలకాలమానాలకు మూలమే విష్ణువు అని చెప్పుకున్నాం. ఈ భాగంలోని పద్యాలు చదువుతుంటే, దానిలోని రెండవ పాదం - "భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః" గుర్తుకురాక మానదు.




Comments