భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 33

31వ భాగంలో శరణాగతి చేస్తూ భగవంతుడిని "ఓ"యని పిలచిన పద్యాలు చూసాం. ఈ భాగంలో అగ్ని ద్వారా బాధపడుతున్న భక్తుల ఆర్తి చూద్దాం. ముందుగా కథా సందర్భాలు.

మొదటిది, ప్రధమ స్కంధంలోనిది. కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది. తొడలు విరిగి పడివున్న దుర్యోధనుడికి,  "పాండవులకి వారసులు లేకుండా చేస్తా"నని, అశ్వద్ధామ మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం నిద్రపోతున్న ఉపపాండవులని రాత్రిపూట చంపివేశాడు. ఉత్తర గర్భంలో ఉన్న శిశువును సంహరించాలని బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. ఆ బాణాగ్ని ధాటికి విలవిల్లాడుతున్న ఉత్తర రక్షించమని శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తున్నది.

రెండవది. దశమ స్కంధం పూర్వ భాగంలోనిది. బాలకృష్ణుడు, అడవిలోని కాళింది మడుగులో కాళీయ మర్దన చేసాడు. ఆ మడుగు చూట్టూ గోపికలు, గోపబాలురందరూ చేరారు. చీకటి పడిపోయిందని అక్కడ ఆ రాత్రి గడిపారు. ఇంతలో ఆ అడవిలో కార్చిచ్చు బయలుదేరింది. అందరూ బలరామకృష్ణులను ప్రార్థిస్తున్నారు. 

ఇవిగో పద్యాలు.

1-179-మ. (ఉత్తర ప్రార్ధన)
"ఇదె కాలానల తుల్యమైన విశిఖం బేతెంచె దేవేశ! నేఁ|
డుదరాంతర్గత గర్భ దాహమునకై యుగ్రప్రభన్ వచ్చుచు|
న్నది దుర్లోక్యము మానుపన్ శరణ మన్యం బేమియున్ లేదు నీ|
పదపద్మంబులె కాని యొండెఱుఁగ నీ బాణాగ్ని వారింపవే.


10.1-714-మ.  (గోపికా గోపాలుర ప్రార్ధన)
"అదె వచ్చెన్ దవవహ్ని ధూమకణ కీలాభీల దుర్వారమై|
యిదె కప్పెన్ మము నెల్లవారి నిట మీఁ దేలాగు రక్షింపు; నీ|
పదపద్మంబులకాని యొండెఱుఁగ; మో పద్మాక్ష! యో కృష్ణ! మ్రొ|
క్కెద మో! రామ! మహాపరాక్రమ! దవాగ్నిన్ వేగ వారింపవే.


ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. రెండూ మత్తేభ వృత్తాలు. రెండూ అగ్ని కీలలనుండి రక్షించమని ఆర్తి. ఒకటి "ఇదె" అంటూ ఎత్తుకుంటే, రెండవది "అదె" అంటూ ఎత్తుగడ. ముగింపు కూడా "బాణాగ్ని వారింపవే" అంటే, రెండవది "దవాగ్నిన్ వేగ వారింపవే". రెండింటిలోనూ "పదపద్మంబులె కాని యొండెఱుఁగ" అని శరణాగతి ఉన్నది. 

శ్రీకృష్ణుడు, గదా ధరుడై, అంగుష్ఠ మాత్రుడై ఆ లోపలి అగ్నిని ఎదిరించి ఆదుకున్నాడు (చూ. ద్వంద్వశిల్పం #14), ఆ బయటి అగ్నిని ఒక్క ఉదుటున "తాగేసాడు". ఈ తాపము అనేది లోపలిదా, బయటదా మనము ఆలోచించుకోవలసి విషయం. మన తాపత్రయాలను హరింపచేయగలిగిన వాడు హరి మాత్రమే అని భాగవత కర్త సూచన. అందుకే పోతన రెండింటినీ ఒకే విధంగా నడిపించినాడు.

Comments