భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 32

ఈ భాగంలో ఎనిమిదవ స్కంధం నుంచి ఏనుగుల గూర్చిన మూడు పద్యాలను చూద్దాం. ముందుగా కథా సందర్భాలు.

మొదటిది. ఎనిమిదవ స్కంధంలోని మొదటి ఘట్టం, గజేంద్రమోక్షం లోనిది. గజేంద్రుడు మదంతో నిండి ఉన్నాడు. ఆ ధాటికి అన్ని దిక్కులు, లోకాలు దడదడ లాడుతున్నాయి.

రెండవది. గజేంద్రుడు తన పరివారంతో కలసి సరస్సులోనికి దిగాడు. ఆ ఏనుగులన్నీ జలకాలాడుతూ గోలచేస్తున్నాయి.

మూడవది. ఎనిమిదవ స్కంధంలోని రెండవ ఘట్టం, సముద్ర మథనం లోనిది. రాక్షసులు, దేవతలు సముద్రమధనం చేస్తున్నారు. ముందుగా హాలాహలం వచ్చింది. శివుడు దానిని భక్షించాడు. తురువాత ఐరావతం, కల్పవృక్షం వగైరా పుట్టాయి. లక్ష్మీదేవి కూడా ఆవిర్భవించింది. పండితులు వేదవచనాలు చదువుతుంటే, ఆమెకు ఏనుగులు మంగళ స్నానాలు చేయిస్తున్నాయి.

ఇవిగో పద్యాలు.

8-36-క. (గజేంద్రుని మదం)
తొండంబుల మదజలవృత గండంబుల కుంభములను ఘట్టన సేయం
గొండలు దలక్రిందై పడు బెండుపడున్‌ దిశలు సూచి బెగడున్‌ జగముల్‌.

8-45-క. (గజేంద్రుని జలకాలాటలు)
తొండంబులఁ బూరింపుచు గండంబులఁ జల్లుకొనుచు గళగళ రవముల్‌
మెండుకొన వలుదకడుపులు నిండన్‌ వేదండకోటి నీరుం ద్రావెన్‌.

8-270-క. (లక్ష్మీదేవి మంగళ స్నానాలు)
పండితసూక్తుల తోడుతఁ దుండంబులు సాఁచి తీర్థతోయములెల్ల\న్‌
గుండముల ముంచి దిగ్వే దండంబులు జలకమార్చెఁ దరుణీమణికిన్‌.

ఇప్పుడు ద్వంద్వశిల్పం చూద్దాం. మూడూ కంద పద్యాలు. మూడింటిలోనూ అనుస్వారపూర్వ డ-కారంతో ప్రాస నడుస్తోంది. మొదటిదానిలో "తొండం, గండం, కొండలు, బెండు"  అంటే, రెండవదానిలో దానిలో "తొండం, గండంబు, మెండు, నిండు, వేదండ", మూడవ దానిలో "పండిత, తుండంబులు, గుండములు, దండంబులు" అని ఉన్నది. 

ఈ శబ్దం ఎన్నుకోవటంలో పోతన చాతుర్యం కనబడుతోంది. ఏనుగులు వస్తుంటే లోకాలన్నీ గడగడ లాడుతూ దడదడలాడుతున్నాయని అతిశయోక్తి అలంకారం వాడితే, లక్ష్మీదేవి మంగళస్నాన ఘట్టంలో డాండాం అంటూ లోకాలు పిక్కటిల్లేలా దుందుభిలు మ్రోగించారు. ఆ ఘట్టంలోని ఈ వాక్యం చూడండి "(8-269-సీ. .....మొగిలుగములు పణవ గోముఖ కాహళ పటహ మురజ శంఖ వల్లకీ వేణు నిస్వనము లిచ్చెఁ.. "). ఆ శబ్దాలన్నీ పోతన మనకు వినిపిస్తున్నారు.

--
ఈ పద్యాలు చదువుతుంటే, రామదాసు వ్రాసిన దాశరథీ శతకంలోని "భండన భీముడు" అనే పద్యం గుర్తుకు వస్తుంది. ఆ పద్యం కూడా " ండ" కార ప్రాసతో నడుస్తుంది. దానిలోని "...భేరికా డాండ డడాండ డాండ నినదంబులు.." అనేది స్ఫురిస్తుంది.  ఇదిగో పూర్తి పద్యం. "బాలు"డి గొంతులో ఇక్కడ వినవచ్చు.

భండనభీముఁ డార్తజనబాంధవుఁ డుజ్జ్వలబాణతూణ కో
దండకలాప్రచండ భుజతాండవకీర్తికి రామమూర్తికిన్‌
రెండవసాటిదైవమిఁక లేఁడనుచున్‌ గడగట్టి భేరికా
డాండ డడాండడాండ నినదంబు లజాండము నిండ మత్తవే
దండము నెక్కిచాటెదను దాశరథీ! కరుణాపయోనిధీ!

దాశరథీ శతకం లో మరొక పద్యం ఇటువంటి ప్రాసతో ఉన్నది. ఔత్సాహికులకోసం.

దాశరథీ శతకం -  #19
"పండిత రక్షకుం డఖిల పాపవిమోచనుఁ డబ్జసంభవా
ఖండలపూజితుండు దశ కంఠవిలుంఠన చండకాండ కో
దండకళాప్రవీణుఁ"డను తావక కీర్తివధూటికిత్తు బూ
దండలుగాఁగ నా కవిత దాశరథీ! కరుణాపయోనిధీ!

Comments