భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 40

ఈ భాగంలో బాలకృష్ణుడి మీద రెండు పద్యాలు చూద్దాం. రెండూ దశమస్కంధం పూర్వభాగంలోనివి. ముందుగా కథా సందర్భాలు.

మొదటిది. బాలకృష్ణుడికి సుమారు మూడు నెలల వయసు. ఒత్తిగిల్ల పడుతున్నాడని, యశోద నలుగురినీ పిలిచి పేరంటం చేసింది. ఆ హడావుడి అయినాక పిల్లవాడిని పడుకోపెట్టింది. ఆ పడుకొన్న పిల్లవాడికి ఆకలివేసింది. అటూఇటూ కదులుతూ, కాళ్లూచేతులు ఆడిస్తూ ఒక బండిని తన్నాడు. ఆ బండిరూపంలో ఉన్న మాయా రాక్షసుడు ఆకాశంమీదకు ఎగిరి క్రిందపడి చనిపోయాడు. పక్కనే ఉన్న పిల్లలు బాలకృష్ణుడే తన్నాడని చెప్పారు. "పిల్లవాడేమిటి బండిని తన్నటమేమిటి" అంటూ గోపగోపికలు ఆశ్చర్యపోతున్నారు.

రెండవది. కృష్ణుడికి ఏడు సంవత్సరాల వయస్సు. తనకి పూజచేయడం లేదని, ఇంద్రుడు గొప్ప గాలివాన కురిపించాడు. అందరిని రక్షించేందుకు, బాలకృష్ణుడు, చిటికెన వ్రేలిపైన గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. దాని క్రిందకు చేరడానికి కొందరు సందేహిస్తున్నారు. "ఇతడు పిల్లవాడు, అంత పెద్దకొండని ఎత్తి ఉంచగలడా అని సందేహించకండి" అంటూ వారికి కృష్ణుడు చెప్తున్నాడు.

ఇవిగో పద్యాలు.

10.1-257-శా.
"బాలుం డెక్కడ? బండి యెక్కడ? నభోభాగంబుపైఁ జేడ్పడం
గాలం దన్నుట యెక్క? డేల పడుచుల్ గల్లాడి? రీ జడ్డు ప
ల్కే లోకంబున నైనఁ జెప్పఁబడునే? యే చందమో కాక" యం
చాలాపించుచుఁ బ్రేలు వ్రేతలు ప్రభూతాశ్చర్యలై రంతటన్.

10.1-921-శా.
బాలుం డీతఁడు; కొండ దొడ్డది; మహాభారంబు సైరింపఁగాఁ
జాలండో; యని దీని క్రింద నిలువన్ శంకింపఁగా బోల; దీ
శైలాంభోనిధి జంతు సంయుత ధరాచక్రంబు పైఁబడ్డ నా
కే లల్లాడదు; బంధులార! నిలుఁ డీ క్రిందం బ్రమోదంబునన్. "

ఇప్పుడు ద్వంద్వశిల్పం చూద్దాం. రెండూ శార్దూల వృత్తాలు. రెండింటిలోనూ "బాలుండు" అంటూ ఎత్తుగడ. "చిన్నవాడు" అంటూ, గోపగోపికల మనసులలో, మొదటి పద్యంలో ఉన్న సంశయాలను,  బాలకృష్ణుడు రెండవ పద్యంలో జవాబు చెప్తునట్టుగా ఉన్నది.

పద్యనిర్మాణం చూసుకుంటే, రెండు పద్యాలలోని మొదటి పాదాలలోని నడక, విరుపులు ఒకేలాగా ఉంటాయి. మొదటి పద్యంలో బండిని ఆకాశంలోనికి ("నభోభాగంబుపై") తన్నితే, రెండవ దానిలో భూమిఅంతా ("ధరాచక్రంబుపై బడ్డ") మీద పడ్డా వేలు చలించదు అంటున్నాడు. విశేషార్ధం చూసుకున్నా, మొదటి పద్యంలో "బండి" అంటే, బ్రతుకుబండి అని, దానిలోని వస్తువులు అంటే, మనము కూడగట్టుకునే వస్తువాంఛలని అర్ధమట. అందుకే ఒకరిని రక్షించాలన్నా బాలకృష్ణుడే, సకల ప్రాణులకు ("ఈ శైలాంభోనిది జంతు సంయుత ధరాచక్రంబు") శ్రీకృష్ణుడే దిక్కు. కాలితో మన భారాన్ని ఆకాశం మీదకు తన్నాలన్నా, చిటికెన వ్రేలితో భారాన్ని మోయాలన్నా కృష్ణుడే. 

పోతన ఈ పద్యాలను, "బాలుండు" అని ఎత్తుకోవడానికి ఒక కారణం కనిపిస్తోంది. పూతన సంహారం తరువాత, పరీక్షిత్తు, శుక మహర్షిని ఇలా అడిగాడు - "బాల-కృష్ణుడిని స్మరించుకుంటే సంసార సాగరం దాటగలం, పాపాలు తొలగిపోతాయి, సుఖము-ముక్తి కలగుతాయి. మరిన్ని విషయాలు చెప్పండి". పూతన సంహారం తరువాత ఘట్టం నుంచి గోవర్ధన పర్వత ఘట్టం వరకూ, "బాలుండు" అనే ఎత్తుగడతో 6-7 పద్యాలు ఉంటాయి. ఒక విధంగా చూస్తే బాలకృష్ణుని లీలలు, గోవర్ధన గిరి ఘట్టంతో ముగుస్తాయి. దాని తరువాత గోపికల విరహము, కంస వధ, రుక్మిణీ కల్యాణము ఘట్టాలు. ఇదిగో పరీక్షిత్తు, బాలకృష్ణుడిని తలచుకొనే పద్యం. 

10.1-246-క.
ఉరుసంసారపయోనిధి తరణంబులు, పాపపుంజ దళనంబులు, శ్రీ
కరణంబులు, ముక్తి సమాచరణంబులు, బాలకృష్ణు సంస్మరణంబుల్.

భావం: బాలకృష్ణుని గొప్ప పనుల స్మరణలు సంసారమనే మహా సముద్రాన్ని దాటించే నావలు. అవి పాపాల సమూహాలను పార తోలుతాయి, సకల సంపదలు సమకూరుస్తాయి, మోక్ష పదానికి మంచి మార్గాలు.

Comments