భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 38
ఒక ప్రశ్నకు బదులు చెప్పడం కన్నా జోడీ ఏముంటుంది? అది కూడా ఒక రకమైన ద్వంద్వమే. ఈ భాగంలో ఇటువంటి "ప్రశ్న-బదులు" చూద్దాం. ముందుగా కథా సందర్భం.
ఎనిమిదవ స్కంధంలోని వామన అవతార ఘట్టంలోనివి. శ్రీమహావిష్ణువు, కపట వడుగు వేషంలో బలి చక్రవర్తి దగ్గరకు వెళ్లాడు. బలి చక్రవర్తి ఏమి కావాలో కోరుకోమని తన దగ్గర సంపద చిట్టా చదివేడు. వామనుడు తనకు మూడు అడుగుల మేర చాలునని చెప్పాడు. "అంతేనా? ఇంకా ఏమైనా కోరుకో" అంటున్నాడు బలి చక్రవర్తి. "ఈ మాత్రం చాలు" అని బదులు ఇస్తున్నాడు వామనుడు.
ఇవిగో పద్యాలు.
"వసుధాఖండము వేఁడితో? గజములన్ వాంఛించితో? వాజులన్
వెసనూహించితొ? కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో?
పసి బాలుండవు; నేర వీ వడుగ; నీ భాగ్యంబు లీపాటి గా
కసురేంద్రుండు పదత్రయం బడుగ నీ యల్పంబు నీ నేర్చునే?"
8-572-మ. (వామనుడి బదులు)
గొడుగో, జన్నిదమో, కమండలువొ, నాకున్ ముంజియో, దండమో,
వడుఁ గే నెక్కడ భూము లెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె
క్కడ? నిత్యోచిత కర్మ మెక్కడ? మదాకాంక్షామితంబైన మూఁ
డడుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్.
ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. రెండూ మత్తేభ వృత్తాలు. మొదటి పద్యంలో "వసుధాఖండము, గజములన్, వాజులన్, యువతులన్" - కోరుకోమంటుంటే, రెండవ పద్యంలో "భూములు, కరుల్, వామాక్షుల్, అశ్వంబుల్" వద్దంటున్నాడు. మొదటి పద్యంలో, బలి చక్రవర్తి, కేవలం మూడు అడుగులేనా ("పదత్రయం బడుగ నీ యల్పంబు") అంటే, వామనుడు ఆ మూడడుగులే తనకు బ్రహ్మాండముతో సమానము అంటున్నాడు. ("మూడడుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు").
కేవలం వస్తువుల చిట్టానే కాకుండా మొదటి పద్యంలో గమనించ వలసిన పదాలు మరికొన్ని ఉన్నాయి - "వేడితో, వాంఛించితో, వెసనూహించితో, వీక్షించి కాంక్షించితో". మన మనసులోని విషయ వాంఛలు, వస్తు వాంఛలు, చూసినదల్లా కావాలనుకోవడం గురించిన సూచన. అందుకే, దానికి బదులుగా వామనుడు, కోరికల కన్నా మనము చేయవలసిన కర్మలే ముఖ్యము ("నిత్యోచిత కర్మము"), ఆ కర్మలకు తగిన చిన్న చిన్న వస్తువుల ద్వారా ("గొడుగు, జన్నిదము, కమండలము, ముంజియ, దండము"), ఉన్నదానితో తృప్తి చెందుటే ముఖ్యము అని చెప్తున్నాడు.
Comments
Post a Comment