భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 46

గత భాగంలాగానే, ఈ భాగంలో కూడా రాక్షసుల అత్యుత్సాహాన్ని తెలియజేసే పద్యాలు చూద్దాం. ముందుగా కథా సందర్భం.

సప్తమ స్కంధంలోని ప్రహ్లాదచరిత్రలోని పద్యాలు. ప్రహ్లాదుడు జన్మించడానికి ముందు జరిగిన విషయం. ప్రహ్లాదునికి తండ్రి హిరణ్యకశిపుడు, పినతండ్రి హిరణ్యాక్షుడు. శ్రీమహావిష్ణువు వరాహ అవతారం ధరించి, హిరణ్యాక్షుడిని సంహరించాడు. ఆ విషయం తెలుసుకున్న హిరణ్యకశిపుడు, తన తమ్ముని చావుకు ప్రతీకారంగా,  తన రాక్షస గణాలను ప్రేరేపిస్తున్నాడు.

ఇవిగో పద్యాలు.

7-34-సీ. (హిరణ్యకశిపుడు రాక్షసులను ప్రేరేపించుట)
సీ. పొండు దానవులార! భూసురక్షేత్ర సంగత యైన భూమికి గములు గట్టి
మఖతప స్స్వాధ్యాయ మౌనవ్రతస్థుల వెదకి ఖండింపుఁడు విష్ణుఁ డనఁగ
నన్యుఁ డొక్కఁడు లేఁడు యజ్ఞంబు వేదంబు నతఁడె భూదేవ క్రియాది మూల
మతఁడె దేవర్షి పిత్రాది లోకములకు ధర్మాదులకు మహాధార మతఁడె 
 
గీ. యే స్థలంబున గో భూసురేంద్ర వేద వర్ణ ధర్మాశ్రమంబులు వరుస నుండు
నా స్థలంబుల కెల్ల నీ రరగి చెఱిచి దగ్ధములు సేసి రండు మీ దర్ప మొప్ప.

7-36-సీ. (రాక్షసులు నాశనం చేయుట)
సీ. గ్రామ పురక్షేత్ర ఖర్వట ఖేట ఘో షారామ నగరాశ్ర మాదికములు
గాలిచి కొలఁకులు గలఁచి ప్రాకార గోపుర సేతువులు ద్రవ్వి పుణ్యభూజ
చయముల ఖండించి సౌధ ప్రపా గేహ పర్ణశాలాదులు పాడుచేసి
సాధు గో బ్రాహ్మణ సంఘంబులకు హింస గావించి వేదమార్గములు చెఱచి 
 
ఆ. కుతలమెల్ల నిట్లు కోలాహలంబుగా దైత్యు లాచరింపఁ దల్లడిల్లి
నష్టమూర్తు లగుచు నాకలోకము మాని యడవులందుఁ జొచ్చి రమరవరులు.


ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. రెండూ సీసపద్యాలు. మొదటి పద్యంలో విష్ణువు ఎక్కడెక్కడ ఉంటాడో అని హిరణ్యకశిపుడు ఏకరువుపెడుతుంటే, రెండవ పద్యంలో రాక్షసులు ఆయా ప్రదేశాలను నాశనం చేస్తున్నారు.

మొదటి పద్యంలో గుంపులుగా పోయి ("గములు గట్టి"), భూములను, ఋషులను, వేదం చదివేవారిని, మునులను ("మఖ, తప, స్వాధ్యాయ మౌనవ్రతస్థుల") ఖండించడానికి, "పొండు దానవులారా" అంటున్నాడు.  ఆదేశం అందుకున్న రాక్షసులు, రెండవ పద్యంలో రకరకాల వాటిని "గాలిచి", "కలచి", "ద్రవ్వి", "ఖండించి", "పాడుచేసి", "హింస గావించి", "చెఱచి" - కోలాహలం చేస్తున్నారు.

హిరణ్యకశిపుడు చెప్పిన దానిలో ఒకటి గమనించాలి. విష్ణువు అంటే ఒక వ్యక్తి కాదని, "విష్ణుఁ డనఁగ
నన్యుఁ డొక్కఁడు లేఁడు" అని చెప్పకనే చెప్తున్నాడు. విష్ణువు అంటే నిరాకార బ్రహ్మమని, భగవంతుడని సూచన. 

Comments