భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 47

ఈ భాగంలో కూడా రాక్షసుల దూకుడు వ్యవహారం చిత్రించే పద్యాలు చూద్దాం. గత రెండు భాగాల లాగానే పక్కపక్క పద్యాలు. ముందుగా కథా సందర్భం.

సప్తమ స్కంధలోని ప్రహ్లాద చరిత్రలోనివి. ప్రహ్లాదుడు జన్మించక ముందు జరిగినది. హిరణ్యాక్షుడిని శ్రీమహావిష్ణువు వరాహవతారం ధరించి సంహరించాడు. అతడి అన్న, హిరణ్యకశిపుడు విష్ణువు ఉన్న చోట్లను, తన అనుచరులతో, నాశనం చేయించాడు. మృత్యువును, దేవతలను, విష్ణువును జయించాలని తీవ్రమైన తపస్సు చేసి, బ్రహ్మదేవుడి నుంచి వరాలను సంపాదించాడు. ఆ వరాల గర్వంతో, తన సోదరుడిని చంపారన్న పగతో, ముల్లోకాలనూ తానే స్వయంగా నాశనం చేస్తున్నాడు. అతడి అనుచర గణం కూడా అందరినీ గద్దిస్తూ బెదిరిస్తున్నారు.

ఇవిగో పద్యాలు.

7-95-సీ. (హిరణ్యకశిపుడు నాశనం చేయుట)
సీ. ఒకనాఁడు గంధర్వ యూధంబుఁ బరిమార్చు దివిజుల నొకనాఁడు దెరలఁ దోలు
భుజగుల నొకనాఁడు భోగంబులకుఁ బాపు గ్రహముల నొకనాఁడు గట్టివైచు
నొకనాఁడు యక్షుల నుగ్రత దండించు నొకనాఁడు విహగుల నొడిసిపట్టు
నొకనాఁడు సిద్ధుల నోడించి బంధించు మనుజుల నొకనాఁడు మదము లడఁచు

తే. కడిమి నొకనాఁడు కిన్నర ఖచర సాధ్య చారన ప్రేత భూత పిశాచ వన్య
సత్త్వ విద్యాధరాదుల సంహరించి దితితనూజుండు దుస్సహతేజుఁ డగుచు.


7-101-సీ.(అనుచర గణం బెదిరింపులు)
సీ. కోలాహలము మాని కొలువుఁడు సురలార! తలఁగి దీవింపుఁడు తపసులార!
ఫణ లెత్తకుఁడు నిక్కి పన్న గేంద్రములార! ప్రణతు లై చనుఁడు దిక్పాలురార!
గానంబు సేయుఁడు గంధర్వవరులార! సందడిఁ బడకుఁడు సాధ్యులార!
ఆడుఁడు నృత్యంబు లప్సరోజనులార! చేరిక మ్రొక్కుఁడు సిద్ధులార!

తే. శుద్ధ కర్పూర వాసిత సురభి మధుర భవ్య నూతన మైరేయ పానజనిత
సుఖవిలీనత నమరారి సొక్కిఁనాఁడు శాంతి లేదండ్రు నిచ్చలుఁ జారు లధిప!

ఇప్పుడు ద్వంద్వశిల్పం చూద్దాం. రెండూ సీస పద్యాలు. మొదటి పద్యంలో హిరణ్యకశిపుడు విష్ణువు ఉండే చోట్లను నాశనం చేస్తుంటే, రెండవ పద్యంలో అనుచర గణం వారిని బెదిరిస్తున్నారు. 

మొదటి పద్యంలో "గంధర్వ యూధంబు", "దివిజులు", "భుజగులు", "గ్రహములు", "యక్షులు", "విహగులు", "సిద్ధులు", "మనుజులు" - అందరిని "దండించి", "కట్టి", "ఒడిసిపట్టి", "బంధించి", "మదములడచి" చేస్తున్నాడు. రెండవ పద్యంలో రాక్షసులు  - "సురలు", "తపసులు", "పన్నగేంద్రములు", "దిక్పాలురు", "గంధర్వులు", "సాధ్యులు", "అప్సర", "సిద్దులు", హిరణ్యకశిపుడిని "కొలువుడు", "దీవింపుడు", "ప్రణతులై చనుడు", "గానంబు సేయుడు", "సందడి బడకుడు", "ఆడుడు", "మ్రొక్కుడు" అంటూ గద్దిస్తూ, హిరణ్యకశిపుని ఆధీనంలో ఉంచుతున్నారు. 

రెండు పద్యాలలోనూ ఒక రకమైన తూగు ఉన్నాది. ఒక పద్ధతి ప్రకారం నాశనం చేస్తున్నారు. మొదటి పద్యంలో "ఒకనాడు...ఒకనాడు..ఒకనాడు.." అంటూ తూగు ఉంటే,  రెండవదానిలో "సురలార, తపసులార..లార.. లార.." అంటూ తూగు వచ్చింది.  సీసపద్యం తరువాత వచ్చే ఎత్తుగీతులు కూడా చిన్నచిన్న పదాలతో ఒకే విధంగా వచ్చాయి.

పోతన ఈ రెండు పద్యాలనూ ఇలా నడిపించి, జరుగుతున్న బీభత్సాన్ని మన కళ్లకు కడుతున్నాడు. 


Comments