భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 45

ఈ భాగంలో రాక్షసుల అత్యుత్సాహాన్ని చూపించే పద్యాలు చూద్దాం. రెండూ వరుస పద్యాలు. ముందుగా కథా సందర్భం.

దశమ స్కంధం పూర్వభాగం లోనివి. వసుదేవుడు శ్రీకృష్ణుడుని రేపల్లెలో యశోదానందుల ఇంటిలో ఉంచి అక్కడ పుట్టిన యోగమాయను తీసుకొని వచ్చాడు. కంసుడు ఆ ఆడపిల్లను చంపబోతే, ఆమె ఆకాశానికి ఎగిరిపోయి కంసుడిని, "నిన్ను సంహరించే వాడు వేరే చోట పెరుగుతున్నాడు" అంటూ హెచ్చరించింది. కంసుడు తన మంత్రులందరినీ సమావేశ పరిచాడు. అసలు విష్ణువు ఎక్కడ ఉంటాడో, ఆయా స్థలాలను, వస్తువులను ముందుగా నాశనం చేసేస్తే మంచిది అంటూ ముందుగా వారి నుంచి ఒక సలహా వచ్చింది.

ఇవిగో పద్యాలు.

10.1-168-మ. (విష్ణువు ఉండే చోట్లు)
అమరశ్రేణికి నెల్లఁ జక్రి ముఖరుం డా చక్రి యేధర్మమం
దమరున్; గోవులు భూమిదేవులు దితిక్షామ్నాయ కారుణ్య స
త్యములున్ యాగ తపోదమంబులును శ్రద్ధాశాంతులున్ విష్ణుదే
హము లిన్నింటిని సంహరించిన నతం డంతంబునుం బొందెడిన్.

10.1-170-ఉ. (నాశనం చేయుటకు ఉత్సాహం)
చంపుదుమే నిలింపులను? జంకెల ఱంకెలఁ దాపసావళిం
బంపుదుమే కృతాంతకుని పాలికిఁ? గ్రేపులతోడ గోవులం
ద్రుంపుదుమే? ధరామరులఁ దోలుదుమే? నిగమంబులన్ విదా
రింపుదుమే? వసుంధర హరింపుదు మే? జననాథ! పంపుమా. 

ఇప్పుడు ద్వంద్వశిల్పం చూద్దాం. మొదటి పద్యంలో శ్రీహరి ఎక్కడెక్కడ ఉంటాడో ("చక్రి యే ధర్మమందమరున్") అని ఊహిస్తున్నారు - ఆవులు ("గోవులు"), బ్రాహ్మణులు  ("భూమిదేవులు"), కారుణ్యము, సత్యము, యాగము, తపము ("కారుణ్య సత్యములున్ యాగ తపోదమంబులును") వంటి వాటిలో ఉంటాడు అని ఊహించి, అవి ఉన్నవాటిని సంహరిస్తే, ఇంక శ్రీహరి అంతమైపోతాడు కదా ("సంహరించిన మతం డంతంబునుం బొందెడిన్") అంటున్నారు. 

రెండవ పద్యంలో రెట్టించిన ఉత్సాహంతో ఆయావాటిని దేవతలను "చంపుదుమే", మునులను "పంపుదుమే కృతాంతకుని పాలికి", ఆవులను దూడలను "ద్రుంపుదుమే", బ్రాహ్మణులను "దోలుదుమే", వేదాలను "విదారింపుదుమే", భూములను "హరింపుదుమే" - "జననాథా! పంపుమా" అంటూ సంసిద్ధమవుతున్నారు. 

గమనిస్తే, రెండూ వేరువేరు వృత్తాలు. మొదటిది మత్తేభం, రెండవది ఉత్పలమాల. రెండింటిలోనూ ఉన్న వస్తువులు ఒకటే అయినా, స్వరంలో తేడా ఉన్నది. మొదటి పద్యంలో, రాక్షసులు కాస్త సందిగ్ధంలో గంభీరంగా ఉన్నారు - విష్ణువు ఎక్కడెక్కడ ఉన్నాడా అన్నది ఏకరువుపెడుతున్నారు. ఇక తెలిసి పోయిందని, రెండవ పద్యంలో ఉత్సాహంలో ఉన్నారు. విష్ణువు ఉండే స్థలాలను నాశనం చేయడమే తమ తక్షణ కర్తవ్యం అని సిద్ధమవుతున్నారు. మొదట ఉన్న సందిగ్ధం పోయి ఒక స్పష్టత, ప్రణాళిక వచ్చింది కాబట్టి  రెండవ పద్యంలో ఒక తూగు ఉన్నది. ఈ తేడా సూచించేందుకే పద్యాలు, నడక వేరువేరుగా వచ్చాయి.

సందిగ్ధ పరిస్థితి, ఆ వెంటనే సంసిద్ధత, స్పష్టత అద్భుతంగా చిత్రించాడు పోతన.

--
సప్తమ స్కంధం, ప్రహ్లాద చరిత్రలోని ఈ పద్యం చూడండి. హిరణ్యకశిపుని హింసకు తట్టుకోలేక, తనను ప్రార్ధించిన వారికి, శ్రీహరి ప్రత్యక్షమై ఈ విధంగా అంటున్నాడు. 

శుద్ధ సాధులందు సురలందు శ్రుతులందు గోవులందు విప్రకోటియందు
ధర్మపదవియందుఁ దలిగి నాయందు వాఁడెన్నఁ డలుగు నాఁడె హింసఁ జెందు.

భావం: కపటములేని సాధుజనులు తోను, దేవతల తోను, వేదాల తోను, గోవుల తోను, బ్రాహ్మణుల తోను, ధర్మముతోను, నాతోను ఎప్పుడైతే పట్టుబట్టి శత్రుత్వం వహిస్తాడో అప్పుడే వాడు చస్తాడు.


Comments