భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 31

ఈ భాగంలో ఏడవ స్కంధంలోని ప్రహ్లాద చరిత్ర, ఎనిమదవ స్కంధంలోని గజేంద్రమోక్ష ఘట్టంలోని మరో రండు పద్యాలను చూద్దాం. ముందుగా కథా సందర్భాలు.

మొదటిది. హిరణ్యకశిపుడు తన మాటవినని ప్రహ్లాదుడిని దండించాలనుకున్నాడు. భటులు ప్రహాదుడిని తీసుకువెళ్లి కొండల మీద నుంచి త్రోసారు, నిప్పుల మీద పడేసారు, నీళ్లలోకి తోసారు, ఏనుగులతో తొక్కించారు - ఇలా ఎన్నో బాధలకు గురిచేసారు. కానీ ఆశ్చర్యం! ప్రహ్లాదునికి చిన్న గాయమైనా కాలేదు. నిరంతరం హరినామ జపం చేస్తూ ఉన్నాడు.

రెండవది. గజేంద్రుడు, మొసలిబారిన పడి పోరాడి అలసిపోయాడు. భక్తులు పిలవగానే "ఓయ్" యంటూ వచ్చే భగవంతుడిని, గజేంద్రుడు "ఓ" అంటూ శరణాగతి చేస్తున్నాడు.

ఇవిగో పద్యాలు.

7-193-ఉ. (ప్రహ్లాదుని ప్రార్ధన)
తన్ను నిశాచరుల్ వొడువ దైత్యకుమారుఁడు మాటిమాటి కో
పన్నగశాయి! యో దనుజభంజన! యో జగదీశ! యో మహా
పన్న శరణ్య! యో నిఖిలపావన! యంచు నుతించుఁ గాని తాఁ
గన్నుల నీరుదేఁడు భయకంప సమేతుఁడు గాఁడు భూవరా!


8-92-ఉ. (గజేంద్రుని శరణాగతి)
ఓ కమలాప్త! యో వరద! యో ప్రతిపక్ష విపక్షదూర! కు
య్యో! కవి యోగి వంద్య! సుగుణోత్తమ! యో శరణాగతామరా
నోకహ! యో మునీశ్వర మనోహర! యో విపులప్రభావ! రా
వే, కరుణింపవే, తలఁపవే, శరణార్థిని నన్నుఁ గావవే

ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. రెండూ ఉత్పలమాలలు, భక్తులు శరణాగతి చేస్తున్న సందర్భంలోనివి. "ఓ..ఓ..ఓ..ఓ" అంటూ మరల మరల శబ్దం వినిపిస్తుంది. పై రెండు పద్యాలలోని పిలుపులకు కొంచెం తేడా ఉన్నది. గజేంద్రుడు అలసిపోయి పిలుస్తుంటే, ప్రహ్లాదుడు నిశ్చలంగా తలచుకొంటున్నాడు. మరి రెండింటికీ "ఓ" అనే పిలుపెందుకు వాడాడు పోతన? ఈ "ఓ" శబ్దంలో గమ్మత్తు ఉంది. 

  1. ఒకటి పైకి వినిపించే సంబోధన ప్రధమా విభక్తి. (ఓ, ఓయి, ఓరి, ఓసి అని బడిలో నేర్చుకున్నది). భగవంతుడిని పిలిస్తున్నాడు కదా. 
  2. రెండవది, తెలుగులో బాధని వ్యక్త పరిచే పదాలు గమనిస్తే, "అయ్యో, నాయనో, కుయ్యో, మొఱ్ఱో" - వంటివి, వీటిలో కూడా "ఓ" కారముంది. ఈ పద్యాలు చదువుతుంటే బాధతో కూడిన సంబోధన వినిపిస్తుంది. ఇది గజేంద్రుని పిలుపు. అందుకే గజేంద్రుని పద్యంలో "కుయ్యో, కవి యోగి వంద్య, సుగుణోత్తమా" - అంటూ ఓ-కారము ఉన్న పదాలు వచ్చాయి.
  3. మూడవది, ఈ తెలుగు ఓ-కారానికి, మనకు జపాలలో వినిపించే ఓం-కారాని ఉన్న శబ్ద సామీప్యము. ఈ దృష్టితో చూస్తే "ఓం పన్నగశాయి", "ఓం దనుజభంజన", "ఓం జగదీశ"... ఇలా భగవన్నామ జపం చేస్తున్న భక్తులు దర్శనమిస్తారు. ఇది ప్రహ్లాదుని పిలుపు.
ఆ మధ్యన, శ్రీ యల్లంరాజు శ్రీనివాసరావుగారు చేసిన భాగవతం-భగవద్గీత సమన్వయం ప్రసంగాలు విన్నాను. ఆయన పైన చెప్పిన రెండవ పద్యంలోని "ఓ ప్రతిపక్ష విపక్ష దూర" అనే పిలుపు గురించి చెప్పినది నాకు నచ్చింది. "ప్రతిపక్ష"-"విపక్ష" అని చదువకూడదు. ప్రతి "పక్ష-విపక్ష" అని చదువుకోవాలని చెప్పారు. భగవంతుడు ఇటు వైపు-అటు వైపు అని తేడా చూపించడు. కోరిన వారందరినీ ఆదరిస్తాడు. 



Comments