భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 34

33వ31వ భాగాలలో శరణాగతి చేస్తూ భగవంతుడిని "ఓ"యని పిలచిన పద్యాలు చూసాం. మరి ఆ పిలుపు ఒక మధ్యవర్తి ద్వారా, లేఖ రూపేణా పంపితే భగవంతుండు ఎలా స్పందిస్తాడో ఇప్పుడు చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. రెండూ దశమ స్కంధం పూర్వభాగంలోని రుక్మిణీకల్యాణ ఘట్టం లోనివి.

మొదటిది.  రుక్మిణీదేవికి ఇష్టంలేని పెళ్లి నిర్ణయించారు. రుక్మిణీదేవి, అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుని ద్వారా శ్రీకృష్ణునికి లేఖ పంపించింది. ఆ సందేశం విన్న శ్రీకృష్ణుడు, "నేను వస్తున్నాను!" అంటూ భరోసా ఇస్తున్నాడు.

రెండవది. ఇచ్చినమాట ప్రకారం శ్రీకృష్ణుడు బయలుదేరి ఒక్క రాత్రిలో విదర్భకు చేరుకున్నాడు. బలరాముడు, ఎందుకైనా మంచిదని, వెనుకనే యదువీరులని తీసుకుని బయలుదేరాడు. శ్రీకృష్ణుడు, రుక్మిణిని తీసుకుని వెళ్లిపోతున్నాడు. రుక్మిణి అన్న రుక్మి, ఇతర వీరులు వెంబడిస్తున్నారు. శ్రీకృష్ణుడు, రుక్మిణికి ధైర్యం చెప్తూ భరోసా ఇస్తున్నాడు.

ఇవిగో పద్యాలు.

10.1-1717-క (అగ్నిద్యోతనుతో మాటలు)
వచ్చెద విదర్భభూమికిఁ; జొచ్చెద భీష్మకుని పురము; సురుచిరలీలన్
దెచ్చెద బాలన్ వ్రేల్మిడి వ్రచ్చెద నడ్డంబు రిపులు వచ్చినఁ బోరన్."


10.1-1756-క.  (రుక్మిణితో మాటలు)
"వచ్చెద రదె యదువీరులు వ్రచ్చెద రరిసేన నెల్ల వైరులు పెలుచన్
 నొచ్చెదరును విచ్చెదరును జచ్చెదరును నేఁడు చూడు జలజాతాక్షీ!"

ఇప్పుడు ద్వంద్వశిల్పం చూద్దాం. రెండూ కంద పద్యాలు, "చ్చె"-కార ప్రాసతో ఉన్నాయి. మొదటి పద్యంలో "వచ్చెద, జొచ్చెద, దెచ్చెద, వ్రచ్చెద" అంటే, రెండవ పద్యంలో "వచ్చెదరు, వ్రచ్చెదరు, నొచ్చెదరు, విచ్చెదరు, జచ్చెదరు" అంటూ ప్రాస. మొదటి పద్యంలో, శ్రీకృష్ణుడు, తాను వస్తాను అని మాట ఇస్తుంటే, రెండవ దానిలో తన పరివారమంతా కూడా సిద్ధంగా ఉన్నారంటున్నాడు.

ఇప్పుడు ఈ చిన్న పద్యాలలోని పోతన చమత్కారం, శబ్దపోషణ చూద్దాం.

తెలుగులో "చెచ్చెర" అంటే శ్రీఘ్రముగా, సంరంభముతో అని అర్ధము. ఈ పద్యాలలోని "చ్చె.ర..చ్చె.రు...చ్చె. రరి..." అంటూ వినిపించే శబ్దముతో, భగవంతుడు త్వరితగతిని భక్తులను రక్షించుటకు వస్తాడని, ఇంతకు ముందు చెప్పుకున్న 12వ భాగం ("సంరంభము")గుర్తుకు వస్తుంది. అలాగే 18వ భాగంలో చెప్పుకున్నట్టుగా భక్తితో ప్రార్ధిస్తే "జెచ్చెర నీశుండు చిక్కుఁ గాక" అని చూసాము కదా. అలాంటిది, రుక్మిణీదేవి లేఖ వ్రాస్తే సంరంభముతో రావాలి కదా! అది కూడా ముందుగా తను ఒంటరిగా వచ్చినా, వెనుకనే తన పరివారమంతా వస్తుంది. ఇది 27వ భాగంలో ని గజేంద్రమోక్షం ఘట్టం గుర్తుచేస్తుంది.



Comments