భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 41

ఈ భాగంలో భాగవతంలోని కథా ప్రారంభంలోని పద్యాలు రెండు చూద్దాం.

మొదటిది. శౌనకాది మహామునులు, నైమిశారణ్యంలో ఉన్న సూతుని దగ్గరకు వచ్చారు. భగవంతుని గురించి చెప్పమని అడిగారు. సూతుడు భాగవతం చెప్పటానికి నిర్ణయించుకుని, "ఈ భాగవతాన్ని వ్యాసుడు, తన కుమారుడైన శుక మహర్షికి చెప్పాడు. ఆ శుక మహర్షి, గంగానదిలో ప్రాణం విడవబోతున్న పరీక్షిత్తు మహారాజుకు చెప్పాడు" - అంటూ మొదలుపెట్టాడు. "అదేమిటీ అత్యంత బలము, సంపద, వంశము కలిగిన పరీక్షిత్తు అన్నీ వదులుకొని ప్రాణాలు విడవటమేమిటి. వివరంగా చెప్పండి" అంటూ కథలో లీనమవుతున్నారు శౌనకాది మునులు.

రెండవది. సూతుడు కథ మొదలు పెడుతున్నాడు. మహాభారత యుద్ధము పూర్తయింది. శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వెడుతున్నాడు. కుంతీదేవి శ్రీకృష్ణుడిని చూడటానికి వచ్చింది. ఇంత కాలం తననూ, తన సంతానాన్ని కాపాడిన శ్రీకృష్ణుడికి నమస్కృతులు తెలియచేసుకుంటోంది.

1-79-సీ. (శౌనకాదుల ప్రశ్న) 
పాండవ వంశంబు బలము మానంబును వర్ధిల్లఁ గడిమి నెవ్వాఁడు మనియెఁ
బరిపంథిరాజులు భర్మాదిధనముల నర్చింతు రెవ్వని యంఘ్రియుగముఁ
గుంభజకర్ణాది కురుభటవ్యూహంబు సొచ్చి చెండాడె నే శూరుతండ్రి
గాంగేయసైనికాక్రాంత గోవర్గంబు విడిపించి తెచ్చె నే వీరుతాత

యట్టి గాఢకీర్తి యగు పరీక్షన్మహారాజు విడువఁదగని రాజ్యలక్ష్మిఁ
బరిహరించి గంగఁబ్రాయోపవిష్టుఁడై యసువులుండ నేల యడఁగియుండె.

1-189-సీ. (కుంతీ స్తుతి)
తనయులతోడనే దహ్యమానంబగు జతుగృహంబందును జావకుండఁ
గురురాజు వెట్టించు ఘోరవిషంబుల మారుత పుత్రుండు మడియకుండ
ధార్తరాష్ట్రుఁడు సముద్ధతిఁ జీరలొలువంగ ద్రౌపదిమానంబు దలఁగకుండ
గాంగేయ కుంభజ కర్ణాది ఘనులచే నా బిడ్డ లనిలోన నలఁగకుండ

విరటుపుత్రిక కడుపులో వెలయు చూలు ద్రోణనందన శరవహ్నిఁ ద్రుంగకుండ 
మఱియు రక్షించితివి పెక్కుమార్గములను నిన్ను నేమని వర్ణింతు నీరజాక్ష!

ఇప్పుడు ద్వంద్వశిల్పం చూద్దాం. రెండూ సీస పద్యాలు. మొదటి పద్యంలో శౌనకాది మునులు పాండవ వంశాన్ని కీర్తిస్తుంటే, రెండవ పద్యంలో కుంతీదేవి పాండు వంశాన్ని అనునిత్యం కాపాడినది శ్రీకృష్ణుడేనని చెబుతున్నది.  మొదటిదానిలో పరీక్షిత్తు పాండవ వంశానికి బలము, మానము వర్ధిల్లటానికి కారణమయ్యాడు అంటే, రెండవదానిలో  లక్క ఇంటి నుండి రక్షించినది, బలవంతుడైన భీముడిని అనునిత్యం కాపాడినది, ద్రౌపది మానంబు తలగకుండా చేసినది, శ్రీకృష్ణుడే అని సూచన. మొదటి దానిలో అభిమన్యుడు కురువీరులతో వీరోచితంగా పోరాడాడు, అర్జునుడు భీష్ముడితో పోరాడి గోగ్రహణము నుంచి కాపాడాడు అంటే, రెండవ దానిలో భీష్మ,ద్రోణ,కర్ణాది కురువీరుల నుండి పాండవులను కాపాడినది శ్రీకృష్ణుడే అని సూచన. రెండవ పద్యంలో, అసలు పరీక్షిత్తును కూడా రక్షించినది శ్రీకృష్ణుడే కదా అంటూ ముగింపు.

గమనిస్తే, మొదటిదానిలో శౌనకాది మునులు, వ్యక్తుల శౌర్యం, ధనం, వంశం మీద దృష్టి ఉంటే, రెండవ దానిలో కుంతీదేవి దృష్టి భగవంతుని మీద నిలుపుతోంది. మొదటిది కథనానికి నాంది అయితే, రెండవది మన దృష్టి భగవంతుని మీదకు మరల్చడానికి భాగవతకర్త చేసిన ప్రయత్నంగా తోస్తున్నది. రెండింటినీ పోతన అద్భుతంగా మనకు తెలియచేస్తున్నాడు.

Comments