భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 32
ఈ భాగంలో ఎనిమిదవ స్కంధం నుంచి ఏనుగుల గూర్చిన మూడు పద్యాలను చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. మొదటిది. ఎనిమిదవ స్కంధంలోని మొదటి ఘట్టం, గజేంద్రమోక్షం లోనిది. గజేంద్రుడు మదంతో నిండి ఉన్నాడు. ఆ ధాటికి అన్ని దిక్కులు, లోకాలు దడదడ లాడుతున్నాయి. రెండవది. గజేంద్రుడు తన పరివారంతో కలసి సరస్సులోనికి దిగాడు. ఆ ఏనుగులన్నీ జలకాలాడుతూ గోలచేస్తున్నాయి. మూడవది. ఎనిమిదవ స్కంధంలోని రెండవ ఘట్టం, సముద్ర మథనం లోనిది. రాక్షసులు, దేవతలు సముద్రమధనం చేస్తున్నారు. ముందుగా హాలాహలం వచ్చింది. శివుడు దానిని భక్షించాడు. తురువాత ఐరావతం, కల్పవృక్షం వగైరా పుట్టాయి. లక్ష్మీదేవి కూడా ఆవిర్భవించింది. పండితులు వేదవచనాలు చదువుతుంటే, ఆమెకు ఏనుగులు మంగళ స్నానాలు చేయిస్తున్నాయి. ఇవిగో పద్యాలు. 8-36-క. (గజేంద్రుని మదం) తొండంబుల మదజలవృత గండంబుల కుంభములను ఘట్టన సేయం గొండలు దలక్రిందై పడు బెండుపడున్ దిశలు సూచి బెగడున్ జగముల్. 8-45-క. (గజేంద్రుని జలకాలాటలు) తొండంబులఁ బూరింపుచు గండంబులఁ జల్లుకొనుచు గళగళ రవముల్ మెండుకొన వలుదకడుపులు నిండన్ వేదండకోటి నీరుం ద్రావెన్. 8-270-క. (లక్ష్మీదేవి మంగళ స్నానాలు) పండితసూక్తుల తోడుతఁ దుండంబుల...