భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 29

ఈ భాగంలో భగవంతుడు "కలడు" అనే పద్యాలు రెండు చూద్దాం. రెండూ పక్కపక్క ఘట్టాలలోనివి.  ముందుగా కథా సందర్భాలు.

మొదటిది. ఎనిమిదవ స్కంధంలోని మొదటి ఘట్టం, గజేంద్రమోక్షంలోనిది. సరస్సులోనికి దిగి, మొసలి బారిన పడిన గజేంద్రుడు  తన శక్తి కొలదీ పోరాటం చేసాడు. డస్సిపోయాడు. చివరికి ఈశ్వరుడిని శరణు వేడుకున్నాడు. అంతలోనే ఉన్నాడో లేడో అనే సందేహం వచ్చింది.

రెండవది. ఎనిమిదవ స్కంధంలోని రెండవ ఘట్టం, సముద్ర మథనం లోనిది. దేవతలు, రాక్షసులు మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని సముద్రాన్ని చిలుకుతున్నారు. మొదట హాలాహలం పుట్టింది. అందరూ  వెళ్లి శివుడిని శరణుకోరుతున్నారు. "కొందరు నీవు ఉన్నావో లేవో అనుకుంటారు", అంటున్నారు.

ఇవిగో పద్యాలు.

8-86-క.
కలఁ డందురు దీనుల యెడఁ, గలఁ డందురు పరమయోగి గణముల పాలం,
గలఁ డందు రన్నిదిశలను, గలఁడు కలం డనెడి వాఁడు గలఁడో లేఁడో?

8-225-క.
కొందఱు గలఁ డందురు నినుఁ; గొందఱు లేఁ డందు; రతఁడు గుణి గాఁ డనుచుం
గొందఱు; గలఁ డని లేఁ డని కొందల మందుదురు నిన్నుఁ గూర్చి మహేశా!

ఇప్పుడు ద్వంద్వంశిల్పం చూద్దాం. రెండూ కందపద్యాలు. రెండింటిలోనూ కష్టాలలో ఉన్న జీవులు ఈశ్వరునికి మొరపెట్టుకుంటున్న సందర్భం. మొదటి సందర్భంలో విష్ణువు వచ్చి రక్షిస్తే, రెండవ సందర్భంలో శివుడు వచ్చి రక్షిస్తున్నాడు. ఇద్దరూ పరమేశ్వరులే. ఈ రెండు ఘట్టాలు శివకేశవుల అభేదము తెలియజేయటానికని భాగవత కర్త యొక్క సూచన అని తెలిసిపోతోంది.

మొదటి సందర్భంలో "కలడో లేడో" అంటుంటే, రెండవదానిలో "కొందరు గలడందురు", "కొందరు లేడందురు" అని శివుని ఎదురుగా నిలబడి అంటున్నారు.

ఈ రెండు పద్యాలు, ఎనిమిదవ స్కంధంలో వ్రాయడాని మరొక కారణం కనబడుతోంది. ఏడవ స్కంధంలోని ప్రహ్లాద చరిత్రలో "కలడంబోధి కలండు గాలి..." (చూ. ద్వంద్వశిల్పం - 5) అనే పద్యంలో  "కలడు..కలడు..కలడు..కలడు.." అని నరసింహావతారం ద్వారా నిరూపణచేసి, ఆ పరమేశ్వరుడే, విష్ణువూ, శివుడూ అని ఎనిమవ స్కంధంలో వ్రాసినాడని ఊహించవచ్చు. 

--
మొదటి పద్యాన్ని, విశ్వనాథ దర్శకత్వంలో వచ్చిన, సిరిసిరిమువ్వ సినిమాలో వాడుకున్నారు.

Comments