ఛందస్సు పద్యాలు చదువుకోవడం ఎలా? - 2
ప్రస్తావన:
మొదటి భాగంలో చెప్పుకున్నట్టు, ఛందస్సు శబ్దప్రమాణము. పద్యాలలోని విరుపును ఎలా గుర్తించాలో చూసాము. పదబంధాలు (phrases) గురు శబ్దములతో మొదలు పెట్టి, లఘు శబ్దములతో ముగించాలని సూత్రీకరించాం.ఈ భాగంలో గురు, లఘు శబ్దాలతో నడక ఎలా వస్తుందో గమనిద్దాం. మరొక్కసారి గురు శబ్దము అంటే ఎక్కువ దమ్ము-కాలం, లఘు శబ్దము అంటే తక్కువ దమ్ము-కాలం అని గుర్తుచేసుకుందాం.
నడక అంటే ఏమిటి?
పద్యంలో లయ, నడక అంటూ ఉంటారు. ఈ నడక అంటే ఏమిటి? కాళ్లతో నడచే నడకకు, పద్యాలలో నడకకూ ఏమైనా సంబంధం ఉన్నదా? ఒక దాని ద్వారా ఇంకొకటి అర్ధం చేసుకోగలమా? “కాళ్ల నడక” అంటే కొంత సమయంలో, ఒకచోటి నుండి మరొక చోటికి (move in space over time) చేసే ప్రక్రియ. “పద్య నడక” అంటే కొంత సమయంలో, ఒక శబ్దం(స్వరం) నుంచి మరొక శబ్దం(స్వరం) కలుపుకుంటూ (movement in frequencies over time) చేసే ప్రక్రియ. “కాళ్ల నడక”లో - మామూలు నడక, కుంటి నడక, పరుగు, గెంత్తుట, కుప్పించి ఎగయుట, నాట్యం - ఇలా రకరకాలుగా విన్యాసాలు చేయవచ్చు. అలాగే నిర్దిష్టమైన రీతిలో (అదే ఛందస్సు) చేయగలిగితే పద్యాలలో కూడా మరిన్ని విన్యాసాలు వినవచ్చు. అందుకే పాదము (సంసృతంలో) అంటే “పద్యభాగము”, “నడిచే కాలు” అని రెండు అర్ధాలు. తెలుగులో కాలి నడక - పద్య నడక! ఆ నడక (movement) మరల మరల వస్తే, అదే లయ (Rhythm).నడక:
ఇప్పుడు కొన్ని మౌలికమైన "నడక"లు చూద్దాం.- లఘువు - 1 (అన్నీ చిన్న శబ్దములు) గురు శబ్దాలు లేకుండా కేవలం లఘు శబ్దాలు వాడితే ఎలా ఉంటుంది? ఇవి చూడండి. చిన్నచిన్న అడుగులు వడివడిగా పడినట్టు ఉంటుంది.
- జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన (1111 1111 1111 1111)(సినీ పాట)
- దివిని తిరుగు మెరుపు లలన (111 111 111 111) (సినీ పాట)
- అడిగెదనని కడు వడి జను (11111 11 11 11) (పోతన - భాగవతం)
- గురువు - U (అన్నీ పొడుగు/పెద్ద శబ్దములు) ఇది కష్టము. గురు శబ్దము కొరకు ఎక్కువ దమ్ము కావాలి. ఊపిరి బిగపట్ట వలసి వస్తుంది. కొన్ని మార్లు మూడు గురు శబ్దములు వరకూ వరుసగా ఉంటాయి. అంతకన్నా ఎక్కువ గురు శబ్దములు ఒకచోట రావటం అరుదు. ఇది ఒక రకంగా నడకలో long/triple jump వంటిది.
- శ్రీకైవల్య పదంబు (UUU1 1U1)
- ఒక గురువు- ఒక లఘువు - U1
కాళ్లు రెండూ ఒక గోతాంలో పెట్టి (sack race) గెంతుకుంటూ పోతే ఎలా ఉంటుందో ఇది అలా ఉంటుంది. - విశ్వ-దాభి-రామ (U1U1U1 - వేమన శతకం మకుటం)
- 3 లఘువులు (111) vs గురువు-లఘువు (U1) vs లఘువు-గురువు (1U)
లఘుశబ్దము అనుటకు పట్టిన కాలము కంటే గురుశబ్దమునకు రెండింతలు కావలసి ఉంటుంది. అంటే కొన్ని మార్లు ఒక గురువును, రెండు లఘువులుగా (U = 11) భావించవచ్చు. కానీ, మూడు లఘువులు ఉన్నప్పుడు మొదటి రెండు లఘువులను గురువుతో సమానంగా భావించవచ్చు. చివరి రెండు లఘువులను ఇలా భావించలేము. ఇది తెలుగు భాష తీరు వలన వచ్చినది. అందకే 111,U1 లకు జత కుదురుతుంది కానీ 111,1U లకు జత కుదరదు. క్రింది ఉదాహరణలు చూడండి. [ఈ జతకి సూర్యగణాలని పేరు. అది వేరే సంగతి.] - పలుకు (111) = పల్కు (U1), ములుకు=ముల్కు, చెరువు=చెర్వు, కలుగు = కల్గు, మొ.
- విశ్వ-దాభి-రామ-వినుర-వేమ (U1-U1-U1-111-U1)
- యతి
లఘువు, గురువు, లఘు-గురు/గురు-లఘు మౌలికమైనవి. వీటిని ఏర్చికూర్చి రకరకాలుగా నడకలు తయారుచేయవచ్చు. ఇలా పేర్చుకుంటూ పోతూ, ఎక్కడో ఒకచోట ఊపిరి ఆపి, మళ్లీ ఎత్తుకోవాలసి వస్తుంది. దానిని యతి స్థానము అంటారు. ఇలా ఎత్తుకునే సమయంలో దమ్ము ఉండటం చేత, సాధారణంగా ఆ స్ధానం గురు శబ్దమై ఉండును.
ఉదాహరణలు:
మొదటి నాలుగు ఉదాహరణలు గమనిస్తే, వ్రాసిన మూస (pattern) మరలమరల వ్రాసుకుంటూ వెడితే చాలు. సరదాగా ఉన్నా వైవిధ్యమైన విషయాలు పలికించలేము. ఏదో సైనిక కవాతు నడకలాగా ఒక మూసగా పోతుంటాయి. ఒకటి రెండు సార్లు వినటానికి బావుంటాయి. తరువాతి రెండూ, మన భాషా శబ్దాలలోని హొయలనూ, సొగసునూ, క్లిష్టతనీ, భావాలలోని రంగులనీ పట్టుకోవడానికి, నవ రసాలనూ పండించడానికి వీలుగా ఉంటాయి. ఏ గురువు దగ్గర ఎత్తుగడ ఉంటుంది అనే విషయం మీద నడక ఆధారపడి ఉంటుంది.- 1U1U1U1U1U1U1U1U - పంచచామరము
ఒక లఘువు, ఒక గురువు - ఇలా వరుసగా 8మార్లు పేర్చుకుంటూ పోతే దానిని “పంచచామరము” అంటారు. ఏదో సరదాకి కవులు కావ్యానికొకటి వ్రాస్తుంటారు. - పోతన - ఆంధ్ర మహాభాగవతం - 10.1-586 - ప్రసన్న పింఛ మాలికా - పద్యపరిమళం
- అల్లసాని పెద్దన - మనచరిత్ర - 4-98 - పలాశిడాసి రాజు జూచి - శ్రీ మేడసాని మోహన్ గాత్రం (సందర్భం - రాక్షసుడి మాటలు)
- U11U11U11U11U11U11U11U - మానిని వృత్తము
ఒక గురుశబ్దము, రెండు లఘు శబ్దములు వరుసగా 7మార్లు పేర్చుకుని చివరగా మరొగ గురుశబ్దము చేర్చితే దానిని మానిని అంటారు. ఇది వెనుక నుంచి చూసినా అదే వస్తుంది. - పోతన - ఆంధ్ర మహాభాగవతం - 10.1-214 - కాంచన కుండల కాంతులు - శ్రీ మేడసాని మోహన్ [పూతన బాలకృష్ణుని వద్దకు వచ్చినప్పుడు ప్రత్యేకంగా వాడిన ఛందస్సు. మానిని అంటే స్త్రీ అని అర్ధముకదా!]
- UU1 + UU1 + UU1 .... + U - దండకం
రెండు గురుశబ్దాలు, ఒక లఘువు వరుసగా పేర్చుకుంటూ (మన ఓపిక మేరకు) వెడితే అది దండకం. - ఆంజనేయ దండకం - “శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం....”
- కరోనా దండకం - 1, 2
- U1U11 U1U11 U1U11 U1U - మత్తకోకిల
- చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం
- మత్తకోకిల మత్తకోకిల మత్తకోకిల కోకిలా
- రెండు గురు శబ్దములు ప్రక్కప్రక్కన లేకుండా పేర్చుకుంటే, U11U1U111-U11U11U1U1U. దీనికి ఉత్పలమాల అని పేరు. గురువు తరువాత ఒకటి- రెండు-మూడు లఘువులు ఉండటం చేత రకరకాల నడకలను చేయవచ్చు.మొదటి గురువు (U) బదులుగా రెండు లఘువులు (11) వ్రాస్తే చంపకమాల వృత్తం. కావ్యాలను శుభప్రదమైన “శ్రీ” కారంతో మొదలు పెట్టడం ఆనవాయితీ. క్రింది ఉదాహరణలు ఆయా కావ్యాలలోని మొదటి పద్యాలు.
- శ్రీమదికిం బ్రియం బెసఁగఁ జేర్చిన యుయ్యెల లీల వైజయం - పారిజాతాపహరణం - ముక్కుతిమ్మన
- శ్రీ మహిమాభిరాముఁడు, వశిష్ఠ మహాముని పూజితుండు, సు - రామాయణము - ఆతుకూరి మొల్ల
- సంసృత ఛందస్సులలో “శార్దూలము” (UUU11U1U111 U-UU1UU1U) మూడు గురుశబ్దములతో మొదలవుతుంది. మధ్యలో కూడా మరో మూడు గురుశబ్దముల వరుస ఉంటుంది. కొంచెం ఉత్కంఠత వంటి (ఊపిరి బిగపట్టి) విషయం చెప్పవలెనన్న కవులు శార్దూలము ఎన్నుకుంటారు. కొన్ని కావ్యములు శార్దూలము మొదలు పెట్టడం చూస్తాం. కవి, గాట్టిగా ఊపిరి తీసుకొని, గంభీరముగా ఒక మహద్కార్యానికి ఉద్యుక్తుడవుతున్నారని అనుకోవచ్చు. శార్దూలములో కూడా గురువు తరువాత 1,2,3 లఘువులు వచ్చే అవకాశం ఉన్నది. అందుకనే, ఉత్పలమాల, శార్దూలములు వృత్తములలో ఎక్కువగా ఉపయోగించేవి అని నా ఆలోచన. మొదటి గురువు (U) బదులుగా రెండు లఘువులు (11) వ్రాస్తే మత్తేభమనే వృత్తం.
- శ్రీకైవల్య పదంబు చేరుకునై చింతించెదన్ లోకర (పోతన - ఆంధ్ర మహాభాగవతం - మొదటి పద్యం)
- శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు యే (నన్నయ - ఆంధ్రమహాభారతం - మొదటి శ్లోకం)
- శ్రీ వక్షోజ కురంగనాభ మెదపైఁ జెన్నొంద విశ్వంభరా - మనుచరిత్ర - అల్లసాని పెద్దన
ముగింపు
భైరవభట్ల కామేశ్వరరావు గారు ఛందస్సుతో నడక (1, 2, 3) మీద మూడు వ్యాసాలు వ్రాసియున్నారు. ఆ వ్యాసాలను నా మొదటి వ్యాసం వ్రాసిన తరువాత చూసాను. వాటి ప్రభావం ఉండకూడదని నేను చదువలేదు. కానీ వారు ఈమాట జాలపత్రికలో వ్రాసి నాకు నచ్చిన పద్యం శీర్షికతో వ్రాసినవి చదువుతుంటాను.20+ ఏండ్ల క్రితం, ఛందస్సు మీద, సంకా రామకృష్ణగారు వ్రాసిన వ్యాసాలు అప్పట్లో చాలా ఉత్సాహంగా చదివిన గుర్తు.
యమాతారాజభానసలగం - వీటి ఊసు ఎత్తకుండా ఛందస్సు గురించి వ్రాయాలని చేసిన ప్రయత్నం. స్వస్తి.
Comments
Post a Comment