భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 28

ఈ భాగంలో మూడు కంద పద్యాలు చూద్దాం. మూడూ ఒకటే సందర్భంలోనివి.భాగవతంలోని ఎనిమిదవ స్కంధంలోని మంధర పర్వతాన్ని కవ్వంగా చేసి సముద్రాన్ని చిలికే ఘట్టంలోనివి. 

మొదటి పద్యం. దేవతలు, రాక్షసులు కలసి మంధర పర్వతాన్ని పెకలించి తీసుకొని వచ్చి, సముద్రం మధ్యలో పెట్టారు. వాసుకిని బ్రతిమాలి తాడుగా చేసికొన్నారు. చిలకడం మొదలుపెట్టారు. అడుగుభాగం స్థిరంగా లేనందున పర్వతం అటూఇటూ ఊగుతున్నది. వాసుకి విడవండని పలికాడు. ఆ పర్వతం కాస్తా మునిగిపోయింది.

రెండవ,మూడవ పద్యాల సందర్భం. శ్రీమహావిష్ణువు కూర్మావతారం ధరించి ఆ పర్వతానికి నిలకడ కలిగించాడు. ఇప్పుడు ఆ సాగర మథనం నిరాఘాటంగా సాగుతున్నది. ఆ హడావిడికి భయపడి సముద్రంలోని జీవాలన్నీ ఎగసిపడుతున్నాయి.

ఇవిగో పద్యాలు. 

8-199-క. (మంధరగిరి ఒరిగిపోవుట)
విడు విడుఁ డని ఫణి పలుకఁగఁ గడుభరమున మొదలఁ గుదురు గలుగమి గెడఁవై
బుబుడ రవమున నఖిలము వవడ వడఁకఁగ మహాద్రి వనధి మునింగెన్.


8-211-క. (సాగరమథనం సాగుట)
మఁ గుడి మునుపు దిరుగుచు గుడి నెడమను వెనుకఁ దిరుగు కులగిరి గడలిం
లెడల సురలు నసురులుఁ దొడితొడి ఫణి ఫణము మొదలుఁ దుదియును దిగువన్.

8-212-క. (జీవాలు ఎగసి బయట పడుట)
డిగొని కులగిరిఁ దరువఁగ జనిధి ఖగ మకర కమఠ ఝష ఫణి గణముల్
సుడివడుఁ దడఁబడుఁ గెలఁకులఁ బడు భయపడి నెగసి బయలఁ బడు నురలిపడున్.

ఇప్పుడు ద్వంద్వశిల్పం చూద్దాం. మూడూ సర్వలఘువు కందాలు. మూడు పద్యాలూ డ-కార ప్రాసతో నడుస్తూన్నాయి. మంధర పర్వతాన్ని కవ్వంగా చేసికొని చిలుకుతుంటే ఆ మాత్రం డమడమ రవం ఉండాలకున్నాడు కాబోలు పోతన. 

ఒక విషయం గమనించాలి. కూర్మావతారంగా విష్ణువు అడుగు భాగాన ఉన్నప్పుడు వచ్చిన పద్యాలు పూర్తి సర్వలఘువు పద్యాలు. ఎటువంచి అడ్డులేకుండా, చక్కటి గతితో, కుడిఎడమలగా తిరుగుతున్న మంధరగిరి కనబడుతుంది. రెండవ పద్యంలోని ఈ జంట పదాలను, పదబంధాలను గమనించండి - "ఎడమఁ గుడి మునుపు దిరుగుచు" - "గుడి నెడమను వెనుకఁ దిరుగు", "సురలు  నసురులుఁ", "గడలిం గడ లెడల", "దొడితొడి", "ఫణి ఫణము" - అటూయిటూ తిరగుతున్న కవ్వమే స్ఫురిస్తుంది.

మొదటి పద్యంలో, మంధర పర్వతం ఒరిగినప్పుడు, చివరిలో - "మహాద్రి వనధి మునింగెన్" అంటూ సర్వలఘువు, గతి తప్పింది. పర్వతం ఒరగటం, పద్యం ఒరగటం ఒకటేసారి జరిగాయి. ఇది పోతన చమత్కారం.

ఆ పద్యాలు చదువుతుంటే, ఎనిమదవ స్కంధంలోనిదే, గజేంద్రమోక్షం ఘట్టంలోని "అడిగెదనని కడువడి జను" అనే పద్యం గుర్తుకురాక మానదు. (చూ. పదకొండవ భాగం). సర్వలఘువుల గురించి వ్రాసిన వ్యాసం - Gait of an Elephant.

Comments