భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 39
ఈ భాగంలో పంచభూతాలకు అధిపతి అయిన భగవంతుని గురించిన రెండు పద్యాలను చూద్దాం. రెండూ ఎనిమిదవ స్కంధంలోనివి. ముందుగా కథా సందర్భాలు. మొదటిది. ఎనిమిదవ స్కంధంలోని రెండవ ఘట్టం, సముద్ర మథనం లోనిది. దేవతలు, రాక్షసులు మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని సముద్రాన్ని చిలుకుతున్నారు. మొదట హాలాహలం పుట్టింది. అందరూ వెళ్లి, "పంచభూతాలకూ అధిపతివి నీవే" అని శివుడిని శరణుకోరుతున్నారు. రెండవది. ఎనిమిదవ స్కంధంలోని మూడవ ఘట్టం. వామన చరిత్రలోనిది. శ్రీమహావిష్ణువు, వామన అవతారమెత్తి బలి చక్రవర్తిని మూడు అడుగులు అడిగాడు. బలి తాను ఇచ్చిన మాట ప్రకారం దానం చేసాడు. వామనుడు, భూమి, ఆకాశాన్ని ఆక్రమించి మూడవ అడుగుతో బలి "తల"ను తొక్కివేసి, బంధించాడు. బ్రహ్మదేవుడు వచ్చి, "పంచభూతాలకూ అధిపతివి నీవే! అంతటి దానపరుడుని బంధించడం న్యాయమా!" అని అడుగుతున్నాడు. 8-222-సీ. (శివునితో బ్రహ్మాది దేవతలు) భూతాత్మ! భూతేశ! భూత భావనరూప! దేవ! మహాదేవ! దేవవంద్య! యీ లోకముల కెల్ల నీశ్వరుండవు నీవ; బంధమోక్షములకుఁ బ్రభుఁడ వీవ; యార్త శరణ్యుండ వగు గురుండవు నిన్నుఁ; గోరి భజింతురు కుశలమతులు; సకల సృష్టిస్థితిసంహారకర్తవై; బ్రహ్మ ...