భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 24
16వ భాగంలో భాగంలో చెప్పుకున్న (“కమలాక్షు నర్చించు కరములు కరములు”) ద్వంద్వ శిల్పాన్ని గుర్తుచేసుకుంటే, దానిలో విష్ణుభక్తి పరాయణుల గురించిన పొగడ్త ఉన్నది. ఈ భాగంలో విష్ణుభక్తిని కాదనే వారిని తిరస్కరించే పద్యాలు చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. మొదటిది, రెండవ స్కంధంలోనిది. భాగవతంలో మొదటి స్కంధం నాంది అనుకుంటే, రెండవది ప్రస్తావన. శుకమహర్షి విష్ణువంటే ఏమిటో, అవతారాల ప్రసక్తి, భక్తి అంటే ఏమిటో, భక్తులు/భాగవతులు ఎలా ఉంటారో చెప్తున్నాడు. దీనిలో భాగంగానే విష్ణుచింతన చేయని వారిని తిరస్కరిస్తున్నాడు. రెండవది. ఏడవ స్కంధంలోని ప్రహ్లాద చరిత్రలోనిది. హిరణ్యకశిపుడు, తన కొడుకైన ప్రహ్లాదునికి హరిభక్తి వలదని చెప్పి గురువులతో మరల పంపించినాడు. తిరిగి వచ్చిన కొడుకును ప్రేమగా దగ్గరకు తీసుకుని, “ఏదైనా ఒక్క పద్యం, తాత్పర్యము చెప్పు కన్నతండ్రీ!” అన్నాడు. ప్రహ్లాదుడు మళ్లీ హరిభక్తి చిట్టా విప్పాడు. హరి స్మరణచేసే చేతులే చేతులు, మాటే మాట, శ్రవణమే శ్రవణం అన్నాడు. అలా హరి సేవ చేయని శరీరము, ఒక శరీరమే కాదంటున్నాడు. ఇవిగో పద్యాలు. 2-50-సీ. (శుకమహర్షి) విష్ణుకీర్తనములు వినని కర్ణంబులు కొండల బిలములు కువలయేశ!...