భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 22

ఈ భాగంలో పండుగ వాతావరణం చిత్రించిన రెండు పద్యాలు చూద్దాము. ముందుగా కథా సందర్భాలు.

మొదటిది. తొమ్మిదవ స్కంధంలోనిది. ఈ స్కంధంలో రామాయణాన్ని సుమారు వంద పద్య గద్యాలలో వర్ణించాడు పోతన. శ్రీరాముడు, లంక నుంచి తిరిగి అయోధ్యకు తిరిగి వస్తున్నాడు. ప్రజలు నగరమంతా అలంకరించారు. పండుగ వాతావరణం నెలకొని ఉంది.

రెండవది. దశమ స్కంధంలోని రుక్మిణీ కల్యాణ ఘట్టంలోనిది. రుక్మిణి సందేశము అందుకున్న శ్రీకృష్ణుడు, ఒక్క రాత్రిలో ద్వారక నుంచి విదర్భకు చేరుకున్నాడు. అక్కడ రుక్మిణికి వివాహ సన్నాహాలు చేస్తున్నారు. రెండు రోజులలో ముహూర్తం. అంతా పండుగ వాతావరణం నెలకొని ఉంది.
వీథులు చక్కఁ గావించి తోయంబులు; | చల్లి రంభా స్తంభచయము నిలిపి| 
పట్టుజీరలు చుట్టి బహుతోరణంబులుఁ; | గలువడంబులు మేలుకట్లుఁ గట్టి| 
వేదిక లలికించి వివిధరత్నంబుల; | మ్రుగ్గులు పలుచందములుగఁ బెట్టి| 
కలయ గోడల రామకథలెల్ల వ్రాయించి; | ప్రాసాదముల దేవభవనములను

గోపురంబుల బంగారు కుండ లెత్తి యెల్ల వాకిండ్ల గానిక లేర్పరించి 
జనులు గైచేసి తూర్యఘోషములతోడ నెదురు నడతెంచి రా రాఘవేంద్రుకడకు.
రచ్చలు గ్రంతలు రాజమార్గంబులు; | విపణిదేశంబులు విశదములుగఁ| 
జేసిరి; చందనసిక్త తోయంబులు; | గలయంగఁ జల్లిరి; కలువడములు| 
రమణీయ వివిధతోరణములుఁ గట్టిరి; | సకల గృహంబులు చక్కఁ జేసి; | 
కర్పూర కుంకు మాగరుధూపములు పెట్టి; | రతివలుఁ బురుషులు నన్ని యెడల

వివిధవస్త్రములను వివిధమాల్యాభర ణానులేపనముల నమరి యుండి 
రఖిల వాద్యములు మహాప్రీతి మ్రోయించి రుత్సవమున నగర మొప్పియుండె.

ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. రెండూ సీస పద్యాలు. పండుగ వాతావరణం. ఒకదానిలో శ్రీరాముడు, రెండవ దానిలో శ్రీకృష్ణుడు వస్తున్నారు. రెండవ దానిలో వివాహ మహోత్సవం కోసం సందడే అయినా, శ్రీకృష్ణుడు వస్తున్నందుకని సూచన.

ఇంక తక్కినదంతా ఉత్సాహమూ, సందడే. మొదటిదానిలో “వీథులు, తోయంబులు, స్తంభచయములు, పట్టుచీరలు, తోరణంబులు, వేదికలు...” ఇలా బహువచనంలోని “లు” శబ్దాన్ని అనుప్రాసగా వాడి సందడిని మనక కళ్లకు కడుతున్నాడు పోతన. రెండవ దానిలో కూడా అంతే - “రచ్చలు గ్రంతలు రాజమార్గంబులు, విపణిదేశంబులు, తోయంబులు, కలువడములు, తోరణంబులు...”. రెండూ పైకి చదువుకొని ఆనందినించ వలసి పద్యాలు.

బంధువులు వస్తున్నారన్నా, పండుగ వస్తోందన్నా, శుభకార్యం చేస్తున్నామన్నా - మనం ఇల్లు శుభ్రం చేసుకోవడం దగ్గర నుండీ రకరకాల పనులతో హడావుడి పడిపోతుంటాం. అటువంటిది - శ్రీరాముడు, శ్రీకృష్ణుడు - వస్తున్నారన్న ఉత్సవ సందడిని, ఉత్సాహాన్ని ఎంతో ఔచిత్యంతో చిత్రించాడు పోతన.

Comments