భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 24

16వ భాగంలో భాగంలో చెప్పుకున్న (“కమలాక్షు నర్చించు కరములు కరములు”) ద్వంద్వ శిల్పాన్ని గుర్తుచేసుకుంటే, దానిలో విష్ణుభక్తి పరాయణుల గురించిన పొగడ్త ఉన్నది. ఈ భాగంలో విష్ణుభక్తిని కాదనే వారిని తిరస్కరించే పద్యాలు చూద్దాం. ముందుగా కథా సందర్భాలు.

మొదటిది, రెండవ స్కంధంలోనిది. భాగవతంలో మొదటి స్కంధం నాంది అనుకుంటే, రెండవది ప్రస్తావన. శుకమహర్షి విష్ణువంటే ఏమిటో, అవతారాల ప్రసక్తి, భక్తి అంటే ఏమిటో, భక్తులు/భాగవతులు ఎలా ఉంటారో చెప్తున్నాడు. దీనిలో భాగంగానే విష్ణుచింతన చేయని వారిని తిరస్కరిస్తున్నాడు.

రెండవది. ఏడవ స్కంధంలోని ప్రహ్లాద చరిత్రలోనిది. హిరణ్యకశిపుడు, తన కొడుకైన ప్రహ్లాదునికి హరిభక్తి వలదని చెప్పి గురువులతో మరల పంపించినాడు. తిరిగి వచ్చిన కొడుకును ప్రేమగా దగ్గరకు తీసుకుని, “ఏదైనా ఒక్క పద్యం, తాత్పర్యము చెప్పు కన్నతండ్రీ!” అన్నాడు. ప్రహ్లాదుడు మళ్లీ హరిభక్తి చిట్టా విప్పాడు. హరి స్మరణచేసే చేతులే చేతులు, మాటే మాట, శ్రవణమే శ్రవణం అన్నాడు. అలా హరి సేవ చేయని శరీరము, ఒక శరీరమే కాదంటున్నాడు. 

ఇవిగో పద్యాలు.

2-50-సీ. (శుకమహర్షి) 
విష్ణుకీర్తనములు వినని కర్ణంబులు కొండల బిలములు కువలయేశ! 
చక్రిపద్యంబులఁ జదువని జిహ్వలు గప్పల జిహ్వలు కౌరవేంద్ర! 
శ్రీమనోనాథు నీక్షింపని కన్నులు కేకిపింఛాక్షులు కీర్తిదయిత! 
కమలాక్షు పూజకుఁ గాని హస్తంబులు శవము హస్తంబులు సత్యవచన!

హరిపద తులసీ దళామోద రతి లేని ముక్కు పందిముక్కు మునిచరిత్ర! 
గరుడగమను భజనగతి లేని పదములు పాదపముల పాదపటల మనఘ!

7-170-సీ (ప్రహ్లాదుని మాట) 
కంజాక్షునకుఁ గాని కాయంబు కాయమే పవన గుంఫిత చర్మభస్త్రి గాక; 
వైకుంఠుఁ బొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమ ధ్వనితోడి ఢక్క గాక 
హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్వి గాక 
కమలేశుఁ జూడని కన్నులు కన్నులే తనుకుడ్యజాల రంధ్రములు గాక; 

చక్రిచింత లేని జన్మంబు జన్మమే? తరళ సలిల బుద్బుదంబు గాక; 
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుఁడే? పాదయుగముతోడి పశువు గాక.

ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. రెండూ సీస పద్యాలు. రెండింటిలోనూ విష్ణుచింతన చేయని ఇంద్రియాల యొక్క తిరస్కారమున్నది. ఒక్కొక్క ఇంద్రియమే తీసుకుని దానికి ఒక ఉపమానము చూపిస్తూ నడిపించడమే రెండింటికీ ఉన్న పోలిక. ఒకదానిలో విష్ణుని చూడని కన్నులు నెమలి పింఛంలోని కన్నుల వంటివి (“కేకి పింఛాక్షులు”) అంటే, ఇంకొక దానిలో శరీరమనే గోడకు పెట్టిన కన్నాలు (“తను కుడ్య జాల రంధ్రములు”) అంటున్నాడు. ఒకదానిలో హరిని పూజించని చేతులు శవానికున్న చేతులు వంటివి (“శవము హస్తంబులు”) అంటే, రెండవదానిలో చెక్కతో చేసిన తెడ్డువంటివి (“తరుశాఖ నిర్మిత దర్వి”).

మనకు ఐదు కర్మేంద్రియాలు (మాట, చేతులు, కాళ్లు, పాయువు, ఉపస్థ), ఐదు జ్ఞానేంద్రియాలు (చర్మం, కన్ను, నాలుక, చెవి, ముక్కు) ఉన్నవి. కర్మేంద్రియముల ద్వారా పనులు చేస్తే (outward - action), జ్ఞానేంద్రియముల ద్వారా ఉన్న వాటిని అర్ధము చేసుకొనవచ్చు (inward - perception). ఈ పది ఇంద్రియములతో పాటుగా మనస్సు, బుద్ధి రెండింటిని జతచేసి చెప్తుంటారు. మొదటి పద్యంలో నాలుక, కన్నులు, ముక్కు, చెవులు (4 - జ్ఞాన.) చేతులు, కాళ్లు (2 - కర్మ.). రెండవ పద్యంలో కాయంబు, వక్త్రము (2 - జ్ఞాన.), హస్తంబు, కన్నులు (2 - కర్మ.) ప్రస్తావన ఉన్నది. ప్రహ్లాదుని పద్యంలో “జన్మంబు జన్మమే” అనటంలో ఉపస్ధ (జననమునకు కారణమగు) కర్మేంద్రియము యొక్క సూచన, “బుద్బుదంబు”, “విబుధుండు” అనే శబ్దాల ద్వారా బుద్ధి గురించిన సూచన ధ్వనిస్తోంది, ఒక భక్తుడు తాను చేసే బాహ్య కర్మలలోనూ, అంతఃకరణంలోనూ కూడా పరమాత్మ గురించిన స్పృహ ఉండాలని, దానితోనే జన్మధన్యత సాధ్యమని పోతన సూచిస్తున్నాడు. 

ఇలాగ ఇంద్రియాల ప్రస్తావన, వేరువేరు సందర్భాలలో భాగవతంలో కనబడుతుంది. ఆ పద్యాల నిర్మాణం కాస్త వేరుగా ఆయా వ్యక్తుల స్వభావాలను అనుసరించి ఉంటుంది. తరువాత భాగాలలో చూద్దాం.

Comments