భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 21

ఈ భాగంలో “కర్మ” గురించిన పద్యాలు చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. రెండూ దశమ స్కంధంలోనివి.

మొదటిది. ఆకాశవాణి మాటవిని కంసుడు, తన చెల్లెలు దేవకి మీదకి కత్తి దూసాడు. వసుదేవుడు తనలో తాను తర్కించుకున్నాడు. కేవలం ఆలోచనతో సమయం వృధా చేయకుండా ఏదైనా చేసి కంసుడిని ఆపాలని నిర్ణయించుకున్నాడు. ఏంతో కష్టం వచ్చి మీద పడుతుంటే చేతలుడిగి కూర్చోకుండా ఏదో ఒక ప్రయత్నం చేయాలని తలచుకొని, కంసుడికి ధర్మ బోధ చేస్తున్నాడు. 

రెండవది. నందుడు ఇంద్రయాగం చేయాలని నిర్ణయించుకున్నాడు. కృష్ణుడు, “ఈ యాగం ఎందుకు చేస్తున్నార“ని అడిగాడు. నందుడు ఇంద్రుని వలన వానలు, వానల వలన పశుగ్రాసము, దాని వలన పశుసంపద వృద్ధి చెందుతుందన్నాడు. కృష్ణుడు కనిపించని ఇంద్రుడి కన్నా, ఎదురుగానున్న ప్రకృతిని, పశుపక్షాదులను ఆరాధించడం మేలని చెప్తున్నాడు

ఇవిగో పద్యాలు. 

10.1-32-క. (కంసునితో వసుదేవుడు) 
కర్మములు మేలు నిచ్చును; గర్మంబులు గీడు నిచ్చుఁ; గర్తలు దనకుం 
గర్మములు బ్రహ్మ కైనను; గర్మగుఁ డై పరులఁ దడవఁగా నేమిటికిన్?

10.1-885-క.(నందునితో శ్రీకృష్ణుడు)
"కర్మమునఁ బుట్టు జంతువు కర్మమునను వృద్ధి బొందుఁ 
గర్మమునఁ జెడుం గర్మమె జనులకు దేవత కర్మమె సుఖదుఃఖములకుఁ గారణ మధిపా! 

ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. రెండు సందర్భాలలోను కంద పద్యాలు. రెండు పద్యాలలోనూ “కర్మ” అనే ప్రాస. రెండూ బోధ చేసే సందర్భాలు. కాబోయే వాటిని తప్పించుకోవడానికి అధర్మమార్గం పట్టవద్దనే ధర్మబోధ.
మొదటి బోధలో, వసుదేవుడు - ఎవరో చెప్పిన మాటలు విని ఆవేశానికి లోనై ఆలోచన లేని పనిచేస్తున్నావు, మన మంచి చెడ్డలు (“మేలు నిచ్చు”, “గీడు నిచ్చు”) మనము చేసే కర్మల వలన మాత్రమే కలుగుతాయ - ని అంటున్నాడు. జరగబోయే దానికి ఇతరులను నిందిస్తూ (“పరులఁ దడవగా నేమిటికిన”) తప్పు చేయవద్దని వారిస్తున్నాడు. 

రెండవ సందర్భంలో కృష్ణుడు, సమస్త జీవాలకూ, తాము చేసే కర్మల బట్టీ మన సుఖదుఃఖాలు (“సుఖదుఃఖములకు గారణమధిపా”) ఉంటాయని చెప్తున్నాడు. అటువంటి వారికే ఈశ్వరుని కృప అని బోధ చేస్తున్నాడు. 

కర్మ అంటే “నుదుటి వ్రాత” అనుకుంటూ నిర్లిప్తంగా జీవించడం కాదని, నిష్కామకర్మగా వీలున్నంతలో ప్రయత్నలోపం లేకుండగ పనిచేస్తూ ముందుకు సాగిపోవడమని, భగవద్గీతలో భగవానుడు చెప్పినది గుర్తుకు రాకమానదు. 

చివరిగా, రెండవ సందర్భంలో “కర్మ” ప్రాసతో రెండు కంద పద్యాలు ఉన్నాయి. రెండవ పద్యం ఇదిగో. కర్మ చేసేవానినే ఈశ్వరుడు చూస్తాడని అని అర్ధం.

10.1-886-క. (నందునితో శ్రీకృష్ణుడు) 
కర్మములకుఁ దగు ఫలములు కర్ములకు నిడంగ రాజు గాని సదా ని
ష్కర్ముఁ డగు నీశ్వరుండును గర్మవిహీనునికి రాజు గాఁడు మహాత్మా!

Comments