భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 23
ఈ భాగంలో, కాస్త పక్కపక్కనే ఉన్న రెండు పద్యాలు చూద్దాం. ముందుగా కథా సందర్భం.
ఏడవ స్కంధంలోని ప్రహ్లాద చరిత్రలోని ఉపోద్ఘాతంలోని పద్యాలు. శుకమహర్షి ఇలా చెప్తున్నాడు. అప్పుడే రాజసూయ యాగం ముగిసింది. నూరు తప్పులు చేసిన శిశుపాలుని వెలుగు శ్రీకృష్ణునిలో ఐక్యమయింది. ధర్మరాజు ఆశ్చర్యపోయాడు. “అటువంటి ధూర్తుని ఆత్మ భగవంతునిలో ఎలా కలసిపోయింది?” అని పక్కనే ఉన్నటువంటి నారదుడిని ప్రశ్నించాడు. నారదుడు జవాబు ఇస్తున్నాడు.
ఇవిగో పద్యాలు.
ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. రెండూ వేరువేరు పద్యరీతులు. శిల్పమంతా మొదటి పద్యాన్ని పెంచి రెండవదానిని వ్రాయడంలో ఉన్నది. దీనికి “దృష్టాంత ద్వంద్వం” అని పేరు పెట్టుకోవచ్చు. అసలు విషయం ఒక చిన్న ఆటవెలదిలో చెప్పి దానిని వెనువెంటనే, సోదాహరణముగా, ఒక పెద్దపద్యం, ఇక్కడ శార్దూలంలో, విశదపరచడము.
మొదటి పద్యంలో అలుక, చెలిమి, కామము, బాంధవము, భీతి - ఈ ఐదు రకములుగా తలచుకున్నా సరే, శ్రీహరిని చేరవచ్చు అని అర్ధం అంటూ మొదలు పెట్టి, ఈ ఐదు రకాలూ రెండవ పద్యంలో వివరిస్తున్నాడు నారదుడు - శిశుపాలుడు (“వైరిక్రియా సామాగ్రిన్”), పాండవులు (“ప్రేమన్”), గోపికలు (“కామోత్కంఠన్”), యాదవులు (“సంబంధులై”), కంసుండు (“భయమునం”) - ఇవన్నీ గాక మేమందరం భక్తితో (“భక్తి నేము”).
మొదటి దానిలో “హరి జేరవచ్చు” అంటే, రెండవ దానిలో “హరి జెందన్ వచ్చు” అంటూ ముగిస్తున్నాడు. అలాగే నారదుడు, ధర్మరాజుకు శ్రీకృష్ణుడి చిన్ననాటి విషయాలు (గోపికలు, కంసుడు) గుర్తుచేస్తున్నాడు. దీని వలన తరువాత దశమ స్కంధంలో వచ్చే విషయాల సూచన ఉన్నది. ఈ ఉదాహరణలు,శుకమహర్షి పరీక్షిత్తునకు చెప్పడం కన్నా, నారదుడు చేత ధర్మరాజుకు చెప్పించటం, కథనా పరంగా సముచితంగా ఉన్నది.
ఒక్కోసారి పోతన, చూచాయగా చెప్తే పాఠకలోకానికి అర్ధం కాదేమోనని రెండు మార్కుల కురచ పద్యం, వెను వెంటనే పదిమార్కులకు సరిపడా పొడుగు సోదాహరణ వివరణ కూడా వ్రాస్తాడు. మన అదృష్టము.
--

అలుక నైనఁ జెలిమి నైనఁ గామంబున
నైన బాంధవమున నైన భీతి
నైనఁ దగిలి తలఁప నఖిలాత్ముఁ డగు హరిఁ
జేర వచ్చు వేఱు జేయఁ డతఁడు.
కామోత్కంఠత గోపికల్, భయమునం గంసుండు, వైరక్రియా
సామాగ్రిన్ శిశుపాలముఖ్య నృపతుల్, సంబంధులై వృష్ణులున్,
బ్రేమన్ మీరలు, భక్తి నేము, నిదె చక్రింగంటి; మెట్లైన ను
ద్ధామధ్యానగరిష్ఠుఁ డైన హరిఁ జెందన్ వచ్చు ధాత్రీశ్వరా!
ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. రెండూ వేరువేరు పద్యరీతులు. శిల్పమంతా మొదటి పద్యాన్ని పెంచి రెండవదానిని వ్రాయడంలో ఉన్నది. దీనికి “దృష్టాంత ద్వంద్వం” అని పేరు పెట్టుకోవచ్చు. అసలు విషయం ఒక చిన్న ఆటవెలదిలో చెప్పి దానిని వెనువెంటనే, సోదాహరణముగా, ఒక పెద్దపద్యం, ఇక్కడ శార్దూలంలో, విశదపరచడము.
మొదటి పద్యంలో అలుక, చెలిమి, కామము, బాంధవము, భీతి - ఈ ఐదు రకములుగా తలచుకున్నా సరే, శ్రీహరిని చేరవచ్చు అని అర్ధం అంటూ మొదలు పెట్టి, ఈ ఐదు రకాలూ రెండవ పద్యంలో వివరిస్తున్నాడు నారదుడు - శిశుపాలుడు (“వైరిక్రియా సామాగ్రిన్”), పాండవులు (“ప్రేమన్”), గోపికలు (“కామోత్కంఠన్”), యాదవులు (“సంబంధులై”), కంసుండు (“భయమునం”) - ఇవన్నీ గాక మేమందరం భక్తితో (“భక్తి నేము”).
మొదటి దానిలో “హరి జేరవచ్చు” అంటే, రెండవ దానిలో “హరి జెందన్ వచ్చు” అంటూ ముగిస్తున్నాడు. అలాగే నారదుడు, ధర్మరాజుకు శ్రీకృష్ణుడి చిన్ననాటి విషయాలు (గోపికలు, కంసుడు) గుర్తుచేస్తున్నాడు. దీని వలన తరువాత దశమ స్కంధంలో వచ్చే విషయాల సూచన ఉన్నది. ఈ ఉదాహరణలు,శుకమహర్షి పరీక్షిత్తునకు చెప్పడం కన్నా, నారదుడు చేత ధర్మరాజుకు చెప్పించటం, కథనా పరంగా సముచితంగా ఉన్నది.
ఒక్కోసారి పోతన, చూచాయగా చెప్తే పాఠకలోకానికి అర్ధం కాదేమోనని రెండు మార్కుల కురచ పద్యం, వెను వెంటనే పదిమార్కులకు సరిపడా పొడుగు సోదాహరణ వివరణ కూడా వ్రాస్తాడు. మన అదృష్టము.
--
ఈ రెండు పద్యాలు గతవారం ప్రముఖ నేపథ్య గాయకుడు పార్థసారధి నేమాని, అమెరికాలోని పిల్లలకు భాగవత పద్యాల క్లాసులో చెప్పినవి. మా అబ్బాయి నేర్చుకుంటుంటే, పక్కన నుంచి విని, ఠక్కున, “మామా! ట్యూనొచ్చేసింది!!” అనుకున్నా. :)
Comments
Post a Comment