భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 43
ఈ భాగంలో శ్రీమహావిష్ణువు యొక్క సుదర్శన చక్రాన్ని వర్ణించే పద్యాలు చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. మొదటిది. ప్రధమ స్కంధంలోనిది. ఉపపాండవులను చంపిన అశ్వత్థామను చంపకుండా, పాండవులు, కేవలం తలలోని మణిని పెరికి విడిచిపెట్టేసారు. అశ్వత్థామ, ఉత్తర కడుపులోనున్న బిడ్డ మీదకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆమె వచ్చి శ్రీకృష్ణునికి మొర పెట్టుకుంది. అంగుష్ఠమాత్రుడై, భగవంతుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. రెండవది. అష్టమ స్కంధంలోని గజేంద్ర మోక్షం ఘట్టంలోనిది. మొసలితో పోరాడుతూ గజేంద్రుడు అలసిపోయాడు. భగవంతునికి శరణాగతి చేసాడు. వైకుంఠపురములోనున్న శ్రీహరి హుటాహుటిన వచ్చి, తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఇవిగో పద్యాలు. 1-184-మ. (ఉత్తర గర్భాన్ని రక్షించుట) తన సేవారతిచింత గాని పరచింతాలేశమున్ లేని స జ్జనులం బాండుతనూజులన్ మనుచు వాత్సల్యంబుతో ద్రోణనం దను బ్రహ్మాస్త్రము నడ్డుపెట్టఁ బనిచెన్ దైత్యారి సర్వారి సా ధన నిర్వక్రము, రక్షితాఖిల సుధాంధశ్చక్రముం, జక్రమున్ 8-109-మ. (గజేంద్రుడిని రక్షించుట) కరుణాసింధుఁడు శౌరి వారిచరమున్ ఖండింపఁగాఁ బంపె స త్త్వరితాకంపిత భూమిచక్రము, మహోద్యద్విస్ఫులింగచ్ఛటా పర...