భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 27
ఈ భాగంలో, భాగవతంలోని, చాలా ప్రాచుర్యంలో ఉన్న రెండు పద్యాలు ద్వంద్వ శిల్పం దృష్టితో చూద్దాం. ముందుగా కథా సందర్భం.
భాగవతంలోని అష్టమ స్కంధంలోని గజేంద్రమోక్షం ఘట్టంలోనివి. గజేంద్రుడు అడవిలోని సరస్సును చెల్లాచెదరు చేస్తూ మొసలి బారిన పడ్డాడు. ఆ మొసలితో పోరాడిపోరాడి డస్సిపోయాడు. నీవే దిక్కని పరమాత్మకు మొక్కాడు. "అల వైకుంఠపురంబు"లోని విష్ణువు, లక్ష్మీదేవితో పరాచికాలాడుతూ పట్టుకున్న కొంగును కూడా విడవకుండా హుటాహుటిన బయలుదేరాడు. ఆయన వెనకాలనే లక్ష్మీదేవి, పరివారంతో సహా కూడా నడచి వస్తోంది.
ఇవిగో పద్యాలు.
పరివారంబునుఁ జీరఁ; డభ్రగపతిం బన్నింపఁ; డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోత్థితశ్రీకుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.
న్కనుఁ బక్షీంద్రుఁడు; వాని పొంతను ధనుఃకౌమోదకీ, శంఖ, చ
క్రనికాయంబును; నారదుండు; ధ్వజినీకాంతుండు రా వచ్చి రొ
య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్.
ఇప్పుడు ద్వంద్వశిల్పం చూద్దాం. రెండూ మత్తేభవృత్తాలు. గజేంద్రుని రక్షించడానికి విష్ణుమూర్తి వస్తున్న సన్నివేశంలో మత్తేభాలు రావడం సమంజసం. రెండు పద్యాల ఎత్తుగడ లక్ష్మీదేవితో మొదలు - మొదటి దానిలో "సిరికిం జెప్పడు" అంటే, రెండవదానిలో "తనవెంటన్ సిరి". మొదటి దానిలో "శంఖ చక్ర యుగముం" తీసుకోలేదంటే, రెండవ దానిలో "ధనుఃకౌమోదకీ, శంఖ, చక్రనికాయంబును" వెంట వచ్చాయట. మొదటి దానిలో "అభ్రగపతిం బన్నింపడు" అంటే, రెండవదానిలో "పక్షీంద్రుడు", "నారదుండు, ధ్వజినీకాంతుండు" వెనుకనే వచ్చారట. అలాగే "ఏ పరివారంబును జీరడు" అంటే రెండవదానిలో "ఆబాలగోపాలమున్" వచ్చారట!
ఆ సన్నివేశంలోని ఆరు మత్తేభాలు, విష్ణుని రాక తెలియజేస్తాయి. (#95-అలవైకుంఠపురంబు, #96-సిరికిం జెప్పుడు, #98-తనవెంటన్ సిరి, #100-తన వేంచేయు పదంబు, #105-వినువీథిన్, #107-చనుదెంచెన్).
మధ్యలో వచ్చే లక్ష్మీదేవిని వర్ణించే పద్యాలు మాత్రం #102-ఒక శార్దూలం, #103-ఒక కందం, #104-ఒక సీసం. తక్కినవన్నీ వచనాలు. ఇది పోతన రచనా శిల్పానికి ఒక మచ్చుతునక.
--
ఈ రెండు పద్యాలకూ, బాపు వేసిన రెండు అద్భుత చిత్రాలు, ఈ క్రిందన. ఆ పద్యాలు చదువుకున్నపుడు ఈ చిత్రాలు మనసులో మెదులుతుంటాయి. రెండు చిత్రాలు, మేనబావ, కీ.శే. వెంకటా మాజేటి సౌజన్యంతో.
Comments
Post a Comment