భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 15
ఈ భాగంలో బ్రహ్మ దేవుని గురించిన పద్యాలు చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. మొదటిది. పోతన భాగవత రచన చేయటం మొదలుపెట్టి, దేవతాస్తుతి చేస్తున్నాడు. మొట్టమొదటిది సంకల్పం / భగవంతుని తత్వం / శ్రీకృష్ణుని స్తుతి . రెండవది శివ స్తుతి. మూడవ పద్యం బ్రహ్మ దేవుని స్తుతి. రెండవది. వ్యాస మహర్షి ఆలోచనలో పడ్డాడు. పండితుల కొరకు వేదాలను విభజించాడు. పామరుల కొరకు వేదసారమైన మహాభారతం రచించాడు. అయినా ఆ మహర్షిలో ఒకరకమైన వెలితి. భగవంతుని గురించిన రచన చేయలేక పోయానే అనే చింత. ఇంతలో నారదుడు వచ్చి వేదవ్యాసుడిని పొగుడుతున్నాడు. అపర బ్రహ్మవి అంటున్నాడు. ఇవిగో పద్యాలు. 1-3-ఉ. (బ్రహ్మదేవుని స్తుతి) ఆతతసేవ సేసెద సమస్తచరాచర భూతసృష్టివి జ్ఞాతకు భారతీహృదయసౌఖ్యవిధాతకు వేదరాశి ని ర్ణేతకు దేవతానికరనేతకుఁ గల్మషజేతకున్ నత త్రాతకు ధాతకున్ నిఖిలతాపసలోక శుభప్రదాతకున్. 1-89-ఉ. (వ్యాసదేవుని స్తుతి) ధాతవు భారతశ్రుతివిధాతవు వేదపదార్థజాత వి జ్ఞాతవు గామముఖ్యరిపుషట్కవిజేతవు బ్రహ్మతత్త్వ ని ర్ణేతవు యోగినేతవు వినేతవు నీవు చలించి చెల్లరే కాతరు కైవడిన్ వగవఁ గారణమేమి పరాశరాత్మజా? ఇప్పుడు ద్వంద...