భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 14

పన్నెండవ భాగంలో, పోతన మొదటి పద్యాన్ని ప్రతిపాదనా పద్యంగా వ్రాసినాడని చెప్పుకున్నాం. ఆ పద్యంలోని “సంరంభం” అనే పదం ఎలా వాడబడినదో చూసాం. అలాగే 3, 6, 13వ భాగాలలో మొదటి స్కంధానికీ, దశమ స్కంధంలోని రుక్మిణీకల్యాణ ఘట్టానికీ ముడిపెట్టాం. చూడగా చూడగా గ్రహింపుకొస్తున్న విషయం ఏమిటంటే, భాగవత కర్త మొదటి స్కంధాన్ని “నాంది” (introduction) స్కంధంగా మలిచారు.
ఈ భాగంలో మొదటి స్కంధలో నుండి రెండు పద్యాలు తీసుకుందాం. ముందుగా కథా సందర్భం.

మొదటిది. కురుక్షేత్ర యుద్ధానంతరం ద్వారకకు తిరిగి వెడుతూ కృష్ణుడు, మృత్యువు కోసం వేచిచూస్తున్న భీష్ముని వద్దకు వెళ్లాడు. భీష్ముడు కృష్ణుని చూసి, ఆనాడు యుద్ధభూమిలో తన మీదకు చక్రంతో దూసుకు వచ్చిన రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ప్రస్తుతిస్తున్నాడు.

రెండవది. కురుక్షేత్ర యుద్ధానంతరం, అశ్వద్ధామ ఉత్తర గర్భంలోనున్న పరీక్షిత్తు మీదకు బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే దాని నుంచి ఆ గర్భస్థ బాలుడిని రక్షించడానికి గదా ధరుడై వచ్చిన రూపాన్ని వర్ణిస్తున్నాడు.

1-223-సీ. (యుద్ధభూమిలో) 
కుప్పించి యెగసినఁ గుండలంబుల కాంతి; గగనభాగం బెల్లఁ గప్పికొనఁగ; 
నుఱికిన నోర్వక యుదరంబులో నున్న; జగముల వ్రేఁగున జగతి గదలఁ; 
జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ; బైనున్న పచ్చనిపటము జాఱ; 
నమ్మితి నాలావు నగుఁబాటు సేయక; మన్నింపు మని క్రీడి మరలఁ దిగువఁ;

గరికి లంఘించు సింహంబుకరణి మెఱసి నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు 
విడువు మర్జున యనుచు మద్విశిఖ వృష్టిఁ దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు.

1-286-సీ. (ఉత్తర గర్భంలో) 
మేఘంబుమీఁది క్రొమ్మెఱుఁగుకైవడి మేని; పై నున్న పచ్చని పటమువాఁడు; 
గండభాగంబులఁ గాంచన మణి మయ; మకరకుండలకాంతి మలయువాఁడు; 
శరవహ్ని నడఁగించు సంరంభమునఁ జేసి; కన్నుల నునుఁ గెంపు కలుగువాఁడు; 
బాలార్కమండల ప్రతిమాన రత్న హా;టక విరాజిత కిరీటంబువాఁడు;

కంకణాంగద వనమాలికా విరాజమానుఁ డసమానుఁ డంగుష్ఠమాత్రదేహుఁ 
డొక్క గదఁ జేతఁ దాల్చి నేత్రోత్సవముగ విష్ణుఁ డావిర్భవించె నవ్వేళ యందు.

ఇప్పుడు ద్వంద్వం శిల్పం చూద్దాం. రెండూ సీసపద్యాలు. రెండింటిలోనూ “కుండలంబుల కాంతి”, “పైనున్న పచ్చనిపటము” ధరించిన రూపాన్ని వర్ణిస్తున్నాడు. మొదటి దానిలో “చక్రంబు జేపట్టి” వస్తుంటే, రెండవదానిలో “గద జేత దాల్చి” వస్తున్నాడు. మొదటిదానిలో భీష్ముడు వేస్తున్న బాణ పరంపరను లెక్క చేయకుండా (“మద్విశిఖ వృష్టి దెరలి”) వస్తుంటే, రెండవదానిలో చిచ్చురగుల్చుతున్న అశ్వద్ధామ బాణాన్ని ఆపటానికి (“శరవహ్ని నడగించు సంరంభమున”) వస్తున్నాడు.

అయినా పోతన ఎందుకు ఈ రెండు దృశ్యాలనూ ఎంచుకున్నాడు. అది కూడా మొదటి స్కంధంలో? క్రితం వ్యాసంలో చెప్పుకున్నట్టు భాగవతంలో ఒక ఉద్దేశ్యం, నిరాకారమైన భగవంతుని సాకారరూపేణా వివరించడం. ఈ సాకారరూపం అనంతమైనదా లేక అంగుష్ఠ మాత్రమైనదా? భగవంతుడంటే పరమాత్మా లేక అంతరాత్మా? రెండూనా? రెండూ ఒకటేనా? మనకు తెలియకుండానే ఈ ప్రశ్నలు మన మనస్సులో నాటటం పోతన ఉద్దేశ్యమా? మొదటి పద్యంలో “గగనభాగం బెల్ల”, “ఉదరంబులోనున్న జగములు” అంటూ ఒక విరాట స్వరూపాన్ని పరిచయం చేస్తే, రెండవ దానిలో మానవ ఉదరంబులోనున్న “అంగుష్ఠ మాత్రదేహు”గా మనలోనే ఉన్నాడని చెప్తున్నాడు. అన్నీ తనలో ఉన్నాయా లేక అన్నిటిలో తను ఉన్నాడా? మొదటి దానిలో “దేవుండు” అంటే, రెండవ దానిలో “విష్ణుండు” అన్నాడు. ఈ రెండూ కృష్ణుడే అని చెప్పకనే చెప్తున్నాడు.

Comments