భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 3
పోతనకు శబ్దాలంకార ప్రియుడని పేరు ఉంది. శబ్దాన్ని ఎలా వాడుకోవాలో తనకు బాగా తెలుసును. ఈ వ్యాసంలో “ణ” శబ్దాన్ని వాడతూ ద్వంద్వ శిల్పం నిర్మించారో చూద్దాం. “ణ”కారంలో ఒక సొగసు ఉంది. “గుడిలో గంటలు ఎలా మ్రోగుతాయి?” అని ఎవరైనా అడిగితే ఏం చెప్తాం? “ గణ గణ ” మ్రోగుతాయి అంటాం. వాటిని మంగళకరమైన శబ్దంగా భావిస్తాం. పోతన భాగవతం మొదలు పెట్టాడు. ఇష్టదేవతా స్తుతి చేసాడు. వ్రాయించేది శ్రీరాముడన్నాడు. కథ మొదవలబోతోంది. శౌనకాది మునులతో ఉత్సాహంగా “గంట” కొట్టించేడు - “ణ”కారంతో ఒక పద్యం వచ్చింది - భూషణములు, అఘపేషణములు, భీషణములు, తోషణములు, విశేషణములు అంటూ “గణగణ”లాడించాడు. దానికి తోడు శ్రీకృష్ణుడులో కూడా “ణ”కారం ఉన్నది కదా. 1-46-క . భూషణములు వాణికి నఘపేషణములు మృత్యుచిత్త భీషణములు హృ త్తోషణములు కల్యాణ విశేషణములు హరి గుణోపచితభాషణముల్. పోతన వ్రాస్తూపోతున్నాడు. తొమ్మిది స్కంధాలు అయిపోయాయి. దశమ స్కంధం మొదలయింది. దశమ స్కంధం, రెండు భాగాలు - పూర్వ భాగంలో శ్రీకృష్ణుడు బ్రహ్మచారి, ఉత్తరభాగంలో సంసారి. పూర్వభాగంలో శ్రీకృష్ణ జననం, మధుర లీలలు, కంస వధ అయిపోయినాయి. యవ్వన దశవచ్చింది. ఇంక “ రుక్మిణీకల్యాణం” ఘట్టం...