భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 1

పోతన (1450 - 1510) భాగవతం గత 15 ఏళ్లగా అడపా దడపా చదువూతూనే ఉన్నాను. చాలా వరకూ రుక్మిణీ కల్యాణం, గజేంద్రమోక్షం ఘట్టాల వరకే పరిమితమై ఉన్నాను. గత ఏడాది పోతన భాగవతం ఆండ్రాయిడ్ యాప్ చేసినప్పటినుండి, మరికొన్ని ఘట్టాలు (ప్రహ్లాదచరితం, వామనావతారం మొ.) తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నంలో భక్తి భావం అట్లా ఉంచితే పోతన వాడిన భాష, రచనా శైలి నన్ను ఆలోచింప చేస్తున్నాయి. 

ఇంకో విషయం. ఉద్యోగరిత్యా, గత పది ఏళ్లగా, ఒక పని తరచూ ఎదురవుతోంది. ఇంగ్లీషులో, రెండు పదాలు/వాక్యాలు ఎంత దగ్గరగా ఉన్నాయి, అని తెలుసుకోవటానికి కంప్యూటరు ప్రోగ్రాములు రాయవలసిన అవసరం వచ్చింది. ఉదాహరణకి John/Johnson, Rob/Robert మొదలైనవి. వీటికి ఆంగ్లంతో Dice Coefficient వంటి పద్ధతులు ఉపయోగించి పదాలు ఎంత “దగ్గరగా” ఉన్నాయో తెలుసుకోవచ్చు. 

ఈ “శబ్ద/పద సామీప్యం” దృష్టి ఉండేసరికి, మొబైల్ యాప్ తయారు చేస్తున్నప్పుడు, నన్ను రెండు పద్యాలు ఆకర్షించాయి. రెండు పద్యాలు వేరువేరు స్కందాలలోనివి. ఒకటి రాముని గురించి, మరొకటి కృష్ణుని గురించి. రెంటి ఎత్తుగడ ఒకే లాగా ఉన్నాయి. రెండు పద్యాలూ, “నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు” అంటూ మొదలవుతాయి. క్రింద చూడండి. 9-361-ఉ రాముని గురించి, 10.1-1012-ఉ కృష్ణుని గురించి.

9-361-ఉ. (రాముడు) 
నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు మహాశుగంబులున్ 
విల్లును దాల్చువాఁడు గడు విప్పగు వక్షమువాఁడు మేలు పైఁ 
జల్లెడువాఁడు నిక్కిన భుజంబులవాఁడు యశంబు దిక్కులం
జల్లెడువాఁడు నైన రఘుసత్తముఁ డిచ్చుత మా కభీష్టముల్ 

10.1-1012-ఉ. (కృష్ణుడు) 
నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు గృపారసంబు పైఁ 
జల్లెడువాఁడుమౌళిపరిసర్పిత పింఛమువాఁడు నవ్వు రా 
జిల్లెడు మోమువాఁ డొకఁడు చెల్వల మానధనంబుఁ దెచ్చె నో! 
మల్లియలార! మీ పొదలమాటున లేఁడు గదమ్మ! చెప్పరే! 

(అర్ధాలకోసం పద్యాల లంకెలు నొక్కండి.)

ఇలాగ రెండు పద్యాలనూ ఒక్కటే ఎత్తుగడతో పోతన ఎందుకు నడిపించాడు? కేవలం ప్రాసకోసమే “ మేలు/కృపారసంబు జల్లెడువాడు” అనే పదబంధం వాడినాడా? నాకు తోచిన సమాధానం - రెండూ విష్ణువు యొక్క అవతారాలు కాబట్టి, రెంటికీ సామీప్యం తెలియజేయటానికి అలా “శబ్దసామీప్యంతో అర్థసామీప్యం తద్వారా పరమార్థ ఏకత్వం” స్ఫురింపజేయడానికి పోతన రచించాడని చెప్పుకున్నాను. ఇది కావాలని, ప్రయత్న పూర్వకంగా పోతన చేసిన ప్రయోగం.

అప్పటి నుండీ పోతన భాగవతంలో ఇటువంటి భాష సామీప్యం లేదా భావ (అర్ధ) సామీప్యం ఉన్న జంట పద్యాల గురించి వెతుకుతున్నాను. కొన్ని కనిపించాయి. 

ఓపికగా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పే భాగవతం 40 భాగాలు (ఒక్కొక్క నిడివి - 1:30 గం) వింటున్నాను. ఆయన చెప్పేదానిలో భక్తి:అన్వయం:భాష, 40:50:10 నిష్పత్తిలో ఉంటే, నా వినికిడి పద్ధతి 15:15:70గా ఉండవచ్చు. పోతన భాగవతంలో సుమారు తొమ్మిదివేల పై చిలుకు పద్యాలున్నాయి. రకరకాల ఘట్టాలు/కథలు, రకరకాల భావనలు, పోలికలు. వేరువేరు ఘట్టలలో ఒకే రకమైన భావనను తెలియజెప్పటానికి పోతన ఎన్నుకున్న తీరు, కథ నడిపిన చందం అబ్బురపరుస్తుంది. కావాలనే పోతన ఎన్నుకున్నాడా లేక పొరపాటున పునరుక్తి దోషమా అంటే చాలా వరకూ కావాలనే వ్రాశారనిపిస్తుంది. దీనికే “ద్వంద్వ శిల్పం” అని పేరు పెట్టాను. దీనికి వేరే పదం ఉండొచ్చు గాక.

నాకు తోచిన ఇతర ద్వంద్వ శిల్పంతో కూడిన పద్యాలను ఇక్కడ పంచుకుంటాను.

Comments

  1. శత కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete

Post a Comment