భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 2

పోతన (1450 - 1510) భాగవతంలోని ద్వంద్వ శిల్పం గురించి ముందు పోస్టులో ప్రస్తావించాను. ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాం. 

మొదటి కథ. రుక్మిణీకల్యాణం ఘట్టంలోనిది. శ్రీకృష్ణుడు అప్పటికింకా బ్రహ్మచారి. రుక్మిణి, శ్రీకృష్ణుడిని ఎప్పుడూ చూసినది కాదు. కానీ, వచ్చి పెళ్లిచేసుకోమని లేఖ వ్రాసింది. శ్రీకృష్ణుడు రానేవచ్చాడు. అప్పుడే మొదటి సారి చూసింది.

రెండవ కథ. శ్రీకృష్ణుడు-రుక్మిణికి మగ సంతానం కలిగింది. ప్రద్యుమ్నుడు పుట్టాడు. కిడ్నాప్ నకు గురైనాడు. శత్రువు ఇంటిలోనే పెరిగి పెద్దవాడైనాడు. పెద్దవాడై ఆ శత్రవును అంతం చేసి, నిజం తెలుసుకొని రుక్మిణి మందిరానికి వచ్చాడు. చెలికత్తెలు అతడిని మొదట చూసారు. ఏమరపాటుతో, కృష్ణుడే అనుకొని పక్కకు తప్పుకున్నారు.

పోతన ఈ రెండు సంఘటనలను ఎలా చెప్పాడో చూద్దాం. ఈ రెండు సందర్భాలలోనూ ఎదుటనున్న మనోహరమైన వ్యక్తిని వర్ణించాలి. అందునా, ప్రద్యమ్నుడు అచ్చుగుద్దినట్టు (యవ్వనంలో ఉన్న) శ్రీకృష్ణుడులాగానే ఉన్నాడట. రుక్మిణి మొదటిసారి చూసినప్పుడు కృష్ణుడు ఎలా ఉన్నాడో, ఇప్పుడు ప్రద్యుమ్నుడు కూడా అలాగే ఉన్నాడట. అందుకనే పోతన రెండు పద్యాలను ఒకటే (మత్తేభ) వృత్తంలోనే నడిపించారు. పోలికలు కూడా యదాతథంగా దించేసారు. రెండు పద్యాలలోనూ ఆఖరులో మటుకూ ఆయా సందర్భానికి తగ్గట్టుగా మార్చారు (అక్షరాలు bold చేసినవి).

10.1-1750-మ. (రుక్మిణీ కల్యాణం) 
కనియెన్ రుక్మిణి చంద్రమండలముఖుం, గంఠీరవేంద్రావల 
గ్ను,నవాంభోజదళాక్షుఁ, జారుతరవక్షున్, మేఘసంకాశదే 
హు, నగారాతి గజేంద్రహస్త నిభ బాహుం, జక్రిఁ, బీతాంబరున్, 
ఘనభూషాన్వితుఁ గంబుకంఠు, విజయోత్కంఠున్ జగన్మోహనున్.

10.2-26-మ. (ప్రద్యుమ్న ఆగమనం) 
జలదశ్యాముఁ బ్రలంబబాహుయుగళుం జంద్రాననున్ 
నీల సంకులవక్రాలకుఁ బీతవాసు ఘనవక్షున్ సింహమధ్యున్మహో 
త్పలపత్త్రేక్షణు మందహాసలలితుం బంచాయుధున్ నీరజా 
క్షులు దారేమఱుపాటఁ జూచి హరి యంచుం డాఁగి రయ్యైయెడన్.

పూర్తి అర్ధాలకోసం ఆయా లంకెలు నొక్కండి.

క్రింద చూడండి, ఎందుకు ఈ రెండు పద్యాలు, ద్వంద్వ శిల్పానికి ఉదాహరణో వివరంగా తెలుస్తుంది. ఇక్కడ ఈ ద్వంద్వ శిల్పం కొంత శబ్దం, కొంత భావం. శబ్దం యధాతధంగా ఉండదు. భావం మటుకూ ఒకటే. మొదటి పద్యం లోని పోలిక - రెండవ పద్యంలోని పోలిక మరియు వాటి సమానార్ధం ఉన్నాయి.
  • చంద్రమండలముఖుం = జంద్రాననున్ = చంద్రమండలం లాంటి మోము 
  • గంఠీరవేంద్రావలగ్ను = సింహమధ్యున్ = సింహం లాంటి సన్నని నడుము 
  • నవాంభోజదళాక్షుఁ = మహోత్పలపత్త్రేక్షణు = పద్మదళాల్లాంటి కన్నులు 
  • జారుతరవక్షున్ = ఘనవక్షున్ = విశాలమైన వక్షస్థలము 
  • మేఘసంకాశదేహు = జలదశ్యాముఁ = మేఘం లాంటి శరీరవర్ణం 
  • నగారాతి గజేంద్రహస్త నిభ బాహుం = బ్రలంబబాహుయుగళుం = ఆజాను బాహువులు 
  • బీతాంబరున్ = బీతవాసు = పీతాంబరాలు

మరొక విషయం గమనించాలి. అర్థాలు ఒకటే అయినా, శ్రీకృష్ణుని వర్ణించడానికి వాడిన పదాలతో పోలిస్తే ప్రద్యుమ్నుడిని పోల్చడానికి వాడిన పదాలు చిన్నవి. వయసులో చిన్నవాడని సూచించడానికి, పోతన అలా కావాలని వ్రాసాడని నా ఊహ. ప్రద్యమ్నుడిని చూసి చెలికత్తెలు, తల్లి రుక్మిణి ఆశ్చర్యపోతున్న విషయం, చనిపోయాడనుకున్న తనయుడు, “కలసివచ్చిన కాలానికి నడిచొచ్చే కొడుకుగా” రావటం చాలా చక్కగా పోతన కళ్లఎదుట నిలబెడతారు. ఈ ఘట్టంలో 10.2-27-క. నుంచి 10.2-39-క., కేవలం పద్యాలకు అర్ధాలు చదువుకున్నా చాలు.

-- 
చివరిగా మరొక్క మాట, మన తెలుగు సినిమాలలో తండ్రీకొడుకుల పాత్రలను ఒకే వ్యక్తి వేయటం, కొడుకు వేరుగా మరో చోట పెరగటం, తిరిగిరావటం, ఇద్దరిని మార్చిమార్చి చూపించి, “అరే ఎంత పోలిక” అని మనకు అనిపింపజేయటం, తల్లి ఆతృత, ఆనందంతో కూడిన మానసిక స్ధితి - ఒక చితక్కొట్టేసిన ఫార్ములా. ఈ మధ్యన వచ్చిన బాహుబలి సినిమాలో కూడా ఎంచక్కా వాడేసుకున్నారు. అంతా శ్రీకృష్ణుని లీలామహత్యం. పోతన వర్ణనా ఫలితం. మరొక ఉదాహరణతో త్వరలో..

Comments