ఛందస్సు పద్యాలు చదవుకోవడం ఎలా?

ప్రస్తావన:
“పద్యాలు రాగయుక్తంగా పాడితే బాగుంటుంది” అంటారు ఘంటసాల భక్తులు. “కాదు, కాదు. అసలు నాటకీయ ఫక్కీలో చెప్తేనే బాగుంటుంది ” అంటూ పద్యనాటక ప్రియులు, “జెండాపై కపిరాజు..”, గుర్తుచేసుకుంటారు. “కాదండీ! ముందుగా నడక, విరుపు పట్టుకోవాలి “ అంటారు విజ్ఞులు. అన్నింటిలోనూ నిజముంది. మరి ఆ పట్టు ఎలా సాధించాలి? మనంతట మనము కొంచెం చదువుకోగలిగితే, ఎవరి శక్తిని బట్టీ వారు తరువాత పద్ధతి (పాట, నాటకీయత వగైరా) మార్చుకోవచ్చు. అసలు చిక్కంతా ఒక పద్యం తీసి మనమే ఎలా చదువుకోవాలి అని.

“చక్కగా గద్యంలో ఉన్నట్టుగా, చుక్కలు-కామాలు-ప్రశ్నార్ధకాలు వంటి “దృశ్య చిహ్నాలు” (visual cues) ఉంటే పద్యాలన్నీ ఎంచక్కా చదివేసుకోవచ్చు” - అని నాకు ఒక ఆలోచన ఉండేది. ఎక్కడ ఆపాలో, ఎక్కడ నెమ్మదించాలో తెలిసేది కదా అనుకునేవాడిని. కూడబలుక్కుని చదువగా చదువగా, అటువంటి “చిహ్నాలు” భాషలోనే “శబ్ద చిహ్నాలు”గా (audio cues) - పాయసంలో పంచదారలాగా - కలసిపోయి ఉన్నాయని తెలిసింది. మరి వాటిని గుర్తించడం ఎలా? ఆ తీయదనం ఆస్వాదించి అనుభవించి తెలుసుకోవాలి.

సూత్రములు:
ఈ వ్యాసంలో ఛందోబద్దమైన పద్యాన్ని చదువుకోవడం, “విరుపు”, ఎలాగో కొన్ని మార్గదర్శ సూత్రీకరణలు (guidelines) ప్రతిపాదిస్తున్నాను. నిర్ధిష్టమైన సూత్రాలు కాదు (not definite rules). ఇవి క్రొత్త విషయాలు కూడా కావు. గురుముఖత నేర్చుకునే వీలులేని ఏకలవ్యులకు తోటి ఏకలవ్యుడి ప్రతిపాదన మాత్రమే. కొందరికైనా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. 

  1. శబ్ద సూత్రములు
    1. ఛందస్సు శబ్ద ప్రధానము.
    2. శబ్దము నిశ్వాస వలన కలుగును. Sound is produced while expiration of breath 
    3. శబ్దమునకు హ్రస్వము, దీర్ఘము ఉండును. కాల ప్రమాణము. ఉదా: అఆ, ఇఈ, ఉఊ. Sound has time dimension. A short form and long form. 
    4. శబ్దములో ఆరోహణ, అవరోహణ ఉండును. స్వర ప్రమాణము - ఆరోహణ (increasing frequency), అవరోహణ (decreasing frequency). Sound has frequency dimension. 
    5. నిశ్వాస మొదట్లో (దమ్ము ఉన్నప్పుడు) ఆరోహణ వీలగును. దమ్ము తగ్గిపోతున్నప్పుడు అవరోహణ. 
    6. నిశ్వాస చివరిలో విశ్రాంతి ఉండును. pauses between exhale/inhale is a break, visually represented by comma, period. 
  2. ఈ స్వర/కాల కోణాలలో (frequency/time dimensions) శబ్దాలను, గురువు (ఎక్కువ దమ్ము, కాలము) లఘువు(తక్కువ దమ్ము, కాలము)లుగా విభజించుకోవచ్చును. క్రింది పటము చూడుము. ఎక్కువ దమ్ము ఉన్నప్పుడు గురువు (U లేదా 11) వీలగును, తక్కువ ఉన్నప్పుడు లఘువు (1) వీలగును.
  3. పదబంధము (phrase) మొదలు సూత్రములు / గురు సూత్రములు / ఎత్తుగడ సూత్రములు:
    1. పదబంధము మొదటిలో గురువు వచ్చును. దమ్ము ఎక్కువున్న కారణముగా, ఇది సాధ్యము. ఉదా: శ్రీకైవల్య పదంబు, చేరుటకునై, చింతించెదన్, లోకరక్షైకారంభకు
    2. పదబంధము మొదటిలో లఘువులు ఉంచవలసిన యెడల అది తరువాత వచ్చే గురువుకు (ఆరోహణ క్రమములో) సహాయ పడవలెను. సంగీతములో దీనికి స్ఫురిత (jump) గమకము అని పేరు. ఉదా: తనవెంటన్ సిరి, కలయో వైష్ణవ మాయయో, 
  4. పదబంధము తుది సూత్రములు / లఘు సూత్రములు / విశ్రాంతి సూత్రములు:
    1. పదబంధము లఘువులతో పూర్తికావలెను. మాటచివరిలో దమ్ము తగ్గిపోతుంది కావున ఇది సామాన్యము. ఉదా: శ్రీకైవల్య పదంబు, తనవెంటన్ సిరి, కలడందురు
    2. పదబంధము చివరిలో లఘువు లేని యెడల పొల్లు/అనుస్వరంతో (న్,మ్ మొ.) ఆపవచ్చును. ఇది నిజానికి లఘువు అక్షర రూపాంతరమే. [ఉదా: చేయుచును - చేయుచున్], ఉదా: చింతించెదన్, భక్తపాలన కళాసంరంభకున్, 
    3. కొండొకచో పదబంధము గురువుతో ఆపిన యెడల దానికి కొనసాగింపుగా తరువాతి పదబంధముండును. తెలుగులో దీర్ఘాంత క్రియాపదములు, ఆంగ్లములోని -ing ను పోలి ఉంటాయి (చేస్తూ, చేయునో, చేస్తే). ఉదా: “చేరుటకునై చింతించెదన్”, 
  5. పదబంధము మధ్యలో గురువులు, లఘువులు రావచ్చును. ఇక్కడే పదజ్ఞానము (vocabulary) అక్కరకు వస్తుంది. పదబంధ నిర్మాణ చాతుర్యము తెలుస్తుంది. 
    1. ఇక్కడ కూడా కొన్ని మార్గదర్శక సూత్రాలు చెప్పుకోవచ్చు. వీలయితే, మరో వ్యాసంలో.
  6. గురువులు లేకుండా సర్వ లఘువులతో పద్యములు అల్లవచ్చు. ఇది సాధారణ సూత్రములకు అతీతము. ప్రత్యేక సందర్భముల కొరకు మాత్రమే వాడబడును. (exceptions) 

ఉదాహరణ:
తొమ్మిదవ తరగతిలో పద్యభాగంలో ప్రాయోపవేశము అనే పాఠంలో చదువుకున్న పువ్వుగుర్తు పద్యం తీసుకుంటాను. ఆంధ్రమహాభారతంలో ఎర్రన రచించిన, అరణ్యపర్వంలోని ఆరవ ఆశ్వాసంలోని 17వ పద్యం. అడవిలో నున్న పాండవులను అవమానించడానికి ఘోషయాత్ర చేసి, మధ్యలో గంధర్వుల చేత పట్టుబడి, తిరిగి పాండవుల సహాయంతో బయటపడిన దుర్యోధనుడు, తాను అవమానంతో కృంగిపోతున్న సన్నివేశం.

అక్కట! యమ్మహారణమునందు వియచ్చరకోటితోడఁ బే 
రుక్కునఁ బోరి యేను మృతి నొందఁగ నేరన; యట్టు లైన నీ 
తక్కువపాటు లేక ప్రమదంబున దేవపదంబు నొందుదున్‌; 
మిక్కిలి యైన కీర్తియును మేదినియందు వెలుంగు నిత్యమై.

గమనించండి, ఒక్కటీరెండు మినహాయించి అన్ని పద/పదబంధ విరుపులూ, గురువుతో మొదలై, లఘువుతో ముగుస్తున్నాయి. 
అక్కట! = U11 = అయ్యో 
యమ్మహారణమునందు = U1U111U1 = ఆ మహాయుద్ధములో 
వియచ్చరకోటితోడఁ = 1U11U1U1 = శత్రుకోటితో 
బే రుక్కునఁ = UU11 = పొరపాటున 
బోరి యేను = U1U1 = పోరు చేసాను 
మృతి నొందఁగ నేరన; = U1U11U11 = ఎందుకు చనిపోలేదు 
యట్టు లైన = U1U1 = అట్లు జరిగితే 
నీ తక్కువపాటు లేక = UU11U1U1 = ఈ అవమానము లేక 
ప్రమదంబున = 11U11 = సంతోషముగా 
*దేవపదంబు నొందుదున్‌; = U11U1U1U = స్వర్గప్రాప్తి జరిగేది 
మిక్కిలి యైన కీర్తియును = U11 U1 U111 = చక్కటి కీర్తి కూడా 
మేదినియందు = U11U1 = భూమిమీద 
*వెలుంగు = 1U1 = ప్రకాశించేది 
*నిత్యమై. = U1U = నిత్యమూ

Edit: “ఎలా ఉందమ్మా ఈ వ్యాసం?” అమ్మకి ఫోను చేసాను. “ఐదు మార్కుల ప్రశ్నకు జవాబులా ఉంది” అన్నది. “అది సరే కానీ ఈ ‘ఏకలవ్యుడి’ సంగతేంటిరా?” అని తిరుగు ప్రశ్న. నాలిక్కరుచుకున్నా. “ఏదో ఆవేశంలో అలా...” అని తప్పుకున్నా. ఇంక నిజం ఒప్పుకోక తప్పదు. తను నాకు 7,9,10 తరగతులలో తెలుగు చెప్పిన టీచరు కదా మరి. పైన ఉదహరించిన “అక్కట!” పద్యం, తను నేర్పినదే. నాన్నేమో ఇంటరులో ఫిజిక్సు లెక్చరరు. వారిద్దరినీ స్మరించకుండా అంతా నా స్వంత ప్రతిభాపాటవాలని అర్ధం వచ్చేటట్లు, వ్రాయడం నా పొరపాటే. అంత పునాది, సాయం ఉన్నా, భాగవతంలోని “రుక్మిణీ కల్యాణం” ఘట్టం కూడబలుక్కుని చదువుకోవడానికి నాకు మూడేళ్లు పట్టింది. అది మటుకూ అంతా నా స్వంత తెలివి చలవే.
ఛందస్సు గడి


Comments