భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 26

 24, 25వ భాగాలలో చూసిన కర్మ, జ్ఞానేంద్రియాల ద్వారా భగవంతుని స్పృహ గురించిన మరొక రెండు పద్యాలు చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. రెండూ దశమ స్కంధం పూర్వ భాగంలోనివి.

మొదటిది. దశమ స్కంధంలోని మొదటి ఘట్టం, శ్రీకృష్ణజననం. దేవకి, కంసుని చెరలో ఉన్నది. అష్టమ గర్భం ధరించింది. నెలలు నిండాయి. కాన్పు ఇవాళో రేపో అన్నట్టుగా ఉంది. కంసుడు ప్రతిదానికీ ఉలికి ఉలికి పడుతున్నాడు.

రెండవది. దశమ స్కంధంలోని చివరి ఘట్టం, రుక్మిణీకల్యాణం. రుక్మిణికి ఇష్టంలేని పెళ్లి నిర్ణయించారు. శ్రీకృష్ణుడికి సందేశం పంపించినది.

ఇవిగో పద్యాలు.

10.1-87-సీ. (కంసుని మానసిక స్థితి)
శ్రవణరంధ్రముల నే బ్దంబు వినఁబడు ది హరిరవ మని యాలకించు;
క్షిమార్గమున నెయ్యది చూడఁబడు నది రిమూర్తి గానోపు నంచుఁ జూచుఁ;
దిరుగుచో దేహంబు తృణమైన సోఁకిన రికరాఘాతమో నుచుఁ నులుకు;
గంధంబు లేమైన ఘ్రాణంబు సోఁకిన రిమాలికాగంధ నుచు నదరుఁ;

లుకు లెవ్వియైనఁ లుకుచో హరిపేరు లుకఁబడియె ననుచు బ్రమసి పలుకుఁ;
లఁపు లెట్టివైనఁ లఁచి యా తలఁపులు రితలంపు లనుచు లుఁగఁ దలఁచు.


10.1-1711-సీ (రుక్మిణి లేఖ)
ప్రాణేశ! నీ మంజు భాషలు వినలేని ర్ణరంధ్రంబుల లిమి యేల?
పురుషరత్నమ! నీవు భోగింపఁగా లేని నులతవలని సౌంర్య మేల
భువనమోహన! నిన్నుఁ బొడగానఁగా లేని క్షురింద్రియముల త్వ మేల?
యిత! నీ యధరామృతం బానఁగా లేని జిహ్వకు ఫలరససిద్ధి యేల?

నీరజాతనయన! నీ వనమాలికా గంధ మబ్బలేని ఘ్రాణ మేల?
న్యచరిత! నీకు దాస్యంబు జేయని న్మ మేల? యెన్ని న్మములకు.

ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. రెండూ సీసపద్యాలు. మొదటి దానిలో కంసుడు ఏ శబ్దం వినబడినా అది విష్ణువు పలుకు (“హరి రవము”) అనుకుంటుంటే, రెండవ దానిలో రుక్మిణి, కృష్ణుని మాటలు వినలేని చెవులకు ఆ వినికిడి శక్తి (“ర్ణరంధ్రంబుల లిమి యేల”) ఎందుకంటోంది. మొదటి దానిలో గడ్డిపోచ తగిలినా అది విష్ణువు చేతిదెబ్బ (“తృణమైన సోఁకిన హరి కరాఘాతమో”) అన్నట్టుగా ఉలిక్కి పడుతుంటే, రుక్మిణీదేవి, శ్రీకృష్ణుడు ముట్టని శరీరమెందుకు (“తను లత వలని సౌందర్యమేల”) అంటోంది. ఏ వాసన తగిలినా అది విష్ణువు మెడలోని మాలిక వాసనేమోనని (“హరి మాలికా గంధ యనుచు నదరు”) కంసుడు అదిరి పోతుంటే, రుక్మిణి అటువంటి వాసన చుడలేని ఘ్రాణశక్తి ఎందుకంటోంది (“నీ వనమాలికా గంధ మబ్బలేని ఘ్రాణమేల”).

మొదటి పద్యంలో మరొక గమ్మత్తు ఉంది. “హరి” అంటే సింహం అనే అర్ధముంది. “హరి రవము” అంటే సింహనాదమని, “హరి మూర్తి” అంటే నరసింహ మూర్తి అని, “హరి కరా ఘాతము” అంటే సింహం పంజా దెబ్బ అని అర్ధం చెప్పుకోవచ్చు. ఆ పద్యంలో అందుకనేమో హరి శబ్దాన్ని ప్రతి పాదంలోనూ పలికించాడు పోతన.

రెండూ తరచి తరచి చదువుకుంటూ, దశమ స్కంధంలోని మొదటి-ఆఖరి ఘట్టాలను ముడి పెట్టిన, పోతన పద్య శిల్పచాతుర్యానికి మనము ముగ్ధులమవక మానము. కంసునిలోని భయం నుంచి రుక్మిణిలోని భక్తివరకు, శ్రీకృష్ణుని శైశవ దశనుంచి యౌవ్వన దశ వరకూ అంతా లీలామృతమే. అంతలోనే ఆలోచనలు హరి మీదనే ఉంచాలన్న సూచన (“యా తలపులు హరి తలంపులనుచు”) , ఆజన్మాంతమూ హరినామ దాస్యము చేయాలనే సూచన (“నీకు దాస్యంబు జేయని జన్మ మేల”) కనిపిస్తాయి.

Comments