ఛందస్సు పద్యాలు చదువుకోవడం ఎలా - 3?

 మొదటి భాగంలో లఘువులు, గురువుల ద్వారా పదాల కూర్పును చూసాం. గురువులు పద్యాల ఎత్తుగడకు ఉపయోగపడతాయి. లఘువులు దమ్ము తక్కువగా ఉన్నప్పుడు వాడతారు. రెండవ భాగంలో ఆ లఘువులు, గురువులగు అమర్చుకోవడం ద్వారా నడకలు ఎలా ఏర్పాడతాయో చూసాం. ఈ భాగంలో ఈ లఘువులు, గురువుల అమరికను రసపోషణకు ఎలా వాడతారో చూద్దాం. 

రసపోషణ - పద్యనిర్మాణం

ఊపిరి/దమ్ము ఎక్కువగా ఉన్నప్పుడు, గురువు ఎత్తుకోవడానికి అనువు అని మొదటి భాగంలో చెప్పుకున్నాం. మన మనస్సులో ఏ భావం ఉన్నప్పుడు ఊపిరి బిగపడతాం? ఆ భావం వ్యక్తపరచడానికి గురువులు ఎక్కువగా ఉన్న పద్యం ఎత్తుకుంటారా? ఉదాహరణకు ఏదైనా ఉద్వేగం, ఉత్కంఠం అయిన సన్నివేశం చెప్పాలంటే గురువులు ఎక్కువగా ఉన్న పద్యం వ్రాస్తారా?

మరి పద్యంలో లఘువులు ఎక్కువగా ఉంటే ఏ భావం పలుకుతుంది? ఏదైన కరుణ రసం పలికించాలంటేనో లేదా నీతి బోధ వంటివి చేయాలంటేనో ఎక్కువగా లఘువులు ఉన్న పద్యం ఎత్తుకోవాల్సిందేనా?  

లఘువులు, గురువులు కాస్త అటూ ఇటూగా సమానంగా ఉంటే సాధారణ వర్ణనకు అనుకూలం. గురువులు ఒక రవ్వ ఎక్కువగా ఉంటే గాంభీర్యానికి అనుకూలం. 

పట్టిక

వృత్త పద్యాలను పూర్వభాగం (మొదటి అక్షరం నుండి యతి వరకు), ఉత్తర భాగం (యతి నుండి చివరి అక్షరం వరకు) గా విభజించుకోవచ్చు. మనకు ఎక్కువగా కనిపించే నాలుగు వృత్తాలను - చంపకమాల, ఉత్పలమాల, మత్తేభం, శార్దూలం తీసుకుందాం. ఈ వృత్తాలలో పూర్వ, ఉత్తర భాగాలలో లఘువులు, గురువుల నిష్పత్తి చూద్దాం. ఈ పట్టిక చూడండి. 



పట్టికలోని మొదటి నిలువరుస గమనించండి. చంపకమాల వృత్తంలోని పూర్వభాగంలో, 2 గురువులు, 8 లఘువులు అంటే గురులఘువుల నిష్పత్తి - 0.25. శాంత రసభరితమైన సన్నివేశం చిత్రించాలంటే ఈ వృత్తము చాలా అనువైనది. అదే చివరి నిలువరుస చూడండి. శార్దూల వృత్తంలోని పూర్వభాగం గమనిస్తే గురులఘువు నిష్పత్తి - 1.0 (6 గురు, 6 లఘు) - అందుకే శార్దూలము ఉద్విగ్న భరితమైన సన్నివేశాలను చిత్రించడాని చాలా అనువు. 

ఉదాహరణలు

పోతన భాగవతంలోని కొన్ని సన్నివేశాలు వాటికి ఆయన ఎంచుకున్న వృత్తరీతులు ఈ క్రింద చూడండి.

1-156-చ - అశ్వత్థామను చంపవద్దని శ్రీకృష్ణుడు అర్జునునికి బోధ చేయుట - "వెఱచినవాని " (శాంత రసం). వెనువెంటనే,  అశ్వత్ధామ చేసిన తప్పులకు అధోలోకాలకు పోతాడు అని ఉద్వేగంగా చెప్పినది శార్దూలము (1-157-శా - స్వప్రాణంబుల నెవ్వడేని)

8-622-శా - వామనుడు బలి చక్రవర్తి దగ్గర మూడు అడుగులు తీసుకుని శరీరాని పెంచుతున్నాడు. అద్భుత రసం. "ఇంతింతై వటుడింతయై...." (శార్దూలం)

10.1-338-శా - శ్రీకృష్ణుడు మన్ను తిని తల్లి యశోదతో తినలేదని చెప్తున్నాడు. ఉద్విగ్నము. "అమ్మా మన్ను తినంగ..."(శార్దూలం)

నిడివి పెరిగిపోతున్నందున ఉత్పలమాల, మత్తేభాల ఉదాహరణలు వ్రాయటం లేదు. పోతన భాగవతంలో పైన నాలుగు వృత్తాలలో మత్తేభానికే పెద్దపీట వేశాడు.

ముగింపు

చివరిగా, ఆదికవి నన్నయను తలచుకొని ముగిద్దాం. మహాభారతం సభాపర్వంలోని పద్యం. ద్రౌపదిని సభకు ఈడ్చుకొచ్చారు. దుర్యోధనుడు ద్రౌపది వంక చూసి తొడకొట్టాడు. భీముడు కోపంతో ఊగిపోతున్నాడు. ఆ తొడలను యద్ధంలో భగ్నంచేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. కోపంతో చేప్పే ఆ పద్యం "2-249-ఉ ధారుణి రాజ్యసంపద..." (ఘంటసాల గొంతులో) నన్నయ ఉత్పలమాలలో చెప్పాడు. మరి పైన చెప్పుకున్న రసపోషణ ప్రకారం, అంత కోపంతో రగిలిపోతున్న ఆవేశపరుడు ఎత్తుకోవాల్సినది శార్దూలము కదా. అయితే పైన చెప్పుకున్న రసపోషణ పట్టిక తప్పా? నాకు తోచిన ఊహ. ఎంత కోపంతో రగిలిపోతున్నా కూడా, అన్నగారైన ధర్మరాజుకు తలఒగ్గి కేవలం సంభాషణకు, ప్రతిజ్ఞలకే పరిమితమైనాడు కాబట్టి ఉత్పలమాలలో చెప్పటమే సరైన రసపోషణ. 

శాస్త్రీయ సంగీతంలో ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క రాగాన్ని ఎంచుకున్నట్లే, పద్యాలలో కూడా ఒక్కొక్క రసపోషణకు ఒక్కొక్క పద్యరీతులను ఎన్నకోవటం జరుగుతుంది. ఆ పద్యరీతులను గమనించుకుంటూ, కవి మన ముందు ఆవిష్కరిస్తున్న సన్నివేశాన్ని చదువుకుంటే, కావ్యాలతో, పురాణాలతో, ఇతిహాసాలతో మరింతగా తన్మయత్వం చెందవచ్చు.


Comments