భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 19

విశ్వమంతటా నిండి ఉన్నవాడే విష్ణువని తెలిపే రెండు చిన్న పద్యాలు చూద్దాం. ఇలాంటి అర్ధం వచ్చే పద్యాలు చాలా ఉన్నా, ఈ భాగంలోని రెండింటికీ చాలా సామ్యమున్నది. ముందుగా కథా సందర్భాలు.

మొదటిది. రెండవ స్కంధంలో శుకమహర్షి పరీక్షిత్తు మహారాజునకు విష్ణువు యొక్క తత్వము వివరిస్తున్నాడు. విష్ణువు యొక్క విరాట స్వరూపం వివరించి తరువాత “విష్ణువు అంతటా ఉన్నాడు” అని చెప్తున్నాడు. మొదటి స్కంధమంతా ఉపోద్ఘాతమైతే, రెండవ స్కంధములోనే అసలు విషయము మొదలవుతుంది.

రెండవది. ఏడవ స్కంధంలోని ప్రహ్లాద చరిత్రలోనిది. కొడుకు విష్ణుభక్తితో విసిగి పోయిన హిరణ్యకశిపుడు, “హరి ఎక్కడ కలడు?” అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ప్రహ్లాదుడు చెప్పిన సమాధానం. 

ఇవిగో పద్యాలు.

2-17-క. (శుకమహర్షి మాట) 
హరిమయము విశ్వమంతయు 
హరి విశ్వమయుండు సంశయము పనిలే దా 
హరిమయము గాని ద్రవ్యము 
పరమాణువు లేదు వంశపావన! వింటే. 

7-275-క. (ప్రహ్లాదుని సమాధానం) 
ఇందు గలఁ డందు లేఁ డని 
సందేహము వలదు చక్రి సర్వోపగతుం 
డెం దెందు వెదకి చూచిన 
నందందే కలఁడు దానవాగ్రణి! వింటే."

ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. రెండూ కంద పద్యాలు. మొదటి దానిలో “సంశయము పనిలేదు” అంటే, రెండవదానిలో “సందేహము వలదు” అంటున్నాడు. రెండు పద్యాలూ, “వింటున్నావా?” అనే అర్ధం వచ్చే “వింటే” అనే మాటతో ముగుస్తున్నాయి.

రెండు పద్యాలకూ ముందు వచ్చే వాటిలో కంటికి కనిపించే పంచభూతాలలోనూ, జగత్తు సమస్తంలోనూ హరి ఉన్నాడు అని వివరణ ఉంటుంది. అందుకని మొదటిదానిలో హరిలేని “పరమాణువు లేదు” అంటే, రెండవదానిలో “వెదకి చూచిన” అంటూ, కంటికి కనబడని వస్తువు గురించిన సూచన ఉన్నది.

చివరిగా, ఈ రెండూ కూడా విష్ణుసహస్రనామాలలోని మొదలు “విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభుః” తలపిస్తే ఆశ్చర్యంలేదు. స్ధలకాలమానాలకు (space and time) మూలమే విష్ణువు కదా.

-- 
రెండవ పద్యంలో ఒక చమత్కారము తోస్తున్నది. సాధారణంగా “సర్వోపగతుండు + ఎందు + ఎందు + వెదకి” అని విరుపు, కానీ దానిని “సర్వోపగతున్ + డెంద + ఎందు + వెదకి” అనుకుంటే (డెంద) మనసులో వెదకి చూడవలెను అని అర్ధం చెప్పుకోవచ్చును.

Comments