భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 5

నాల్గవ భాగంలో వివరించిన, ఏడవ స్కంధంలోని ప్రహ్లాదచరితంలోని మరో ద్వంద్వం ఇప్పుడు చూద్దాం.

మొదటి పద్యం. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు, ఘోర తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమౌతాడు. పంచభూతాలో (గాలి, నేల, అగ్ని, నీరు, ఆకాశం), దిక్కులలో, రాత్రి, పగలు, చీకటి, వెలుగు, జంతువులు (ఉభయచర, నేల, నీరు, పాము), దేవతలు, నరులు, సమస్త అస్త్ర శస్త్రాలు వగైరా ద్వారా మృత్యువులేని జీవనము కావాలి అని వరము పొందుతాడు.

ఇక రెండవ పద్యం. హిరణ్యకశిపుని పుత్రుడు ప్రహ్లదుడు విష్ణుభక్తుడు. తండ్రి, కొడుకు యొక్క విష్ణుభక్తితో విసిగిపోయి, “ఎక్కడరా హరి?” అని అడుగుతాడు. విష్ణువు ఎక్కడ ఉన్నదీ తండ్రికి వివరిస్తాడు. పంచభూతాలలో, దిక్కులలో, పగలు, రాత్రులలో, సూర్యచంద్రులోలో,ఆత్మ, ఓంకారము, త్రిమూర్తులు, త్రిలింగవ్యక్తులు (ఆడ, మగ, నపుంసక) కలడు అని చెప్తాడు.

ఇవీ పద్యాలు:
7-90-శా. గాలిం, గుంభిని, నగ్ని, నంబువుల, నాకాశస్థలిన్, దిక్కులన్, రేలన్, ఘస్రములం, దమఃప్రభల, భూరిగ్రాహ, రక్షో, మృగ వ్యా ళాదిత్య, నరాది జంతు కలహవ్యాప్తిన్, సమస్తాస్త్ర శ స్త్రాళిన్, మృత్యువు లేని జీవనము లోకాధీశ! యిప్పింపవే.
7-274-మ. "కలఁ డంభోధిఁ, గలండు గాలిఁ, గలఁ డాకాశంబునం, గుంభినిం గలఁ, డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం గలఁ, డోంకారమునం ద్రిమూర్తులఁ ద్రిలింగవ్యక్తులం దంతటం గలఁ, డీశుండు గలండు, తండ్రి! వెదకంగా నేల యీ యా యెడన్. [పూర్తి అర్థాలకోసం లంకెలు నొక్కండి.]
ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. పోతన ఉద్దేశ్యం హిరణ్యకశిపుని వరాలకన్నా విష్ణువు గొప్పతనం చెప్పటం. అందుకని వరాల పద్యం శార్ధూలమయితే (పెద్దపులి), రెండవ పద్యం మత్తేభం (మదమెక్కిన ఏనుగు) వృత్తంలో వచ్చింది.
హిరణ్యకశిపుడు అడిగిన వరాల వరుస చూద్దాం. వరాలు పంచభూతాలు-దిక్కులు-రాత్రిపగలు-చీకటివెలుగు తో మొదలైతే రెండవ పద్యం కూడా పంచభూతాలు-దిశలు-పగలురాత్రి-సూర్యచంద్రులు తో మొదలైనది. తరువాత జంతువులు గురించి వరాలడిగితే రెండవదానిలో “ఆత్మ” అని చెప్పి సర్వచరాచర జంతువులలోనూ ఉన్నది విష్ణువేనని సూచన ఉన్నది. ప్రహ్లాదుడు ఇంకొక అడుగు ముందుకెళ్లి ఓంకారంలో కూడా భగవంతుడున్నాడంటాడు. తరువాత వరాలలో ఆదిత్య (దేవతలు), నరులు అంటే ప్రహ్లాదుడు కూడా త్రిమూర్తులు, త్రిలింగవ్యక్తులు అని, అసలు అంతాటా ఉన్నాడు అని పూర్తిచేస్తాడు.

ప్రహ్లాదునికి, తండ్రికి ఉన్న వరాలు తెలుసునని ఎక్కడా సూచన ఉండదు. కేవలం ఏదో విష్ణుభక్తి పరాయణుడు అన్నట్టుగానే చిత్రీకరణ ఉంటుంది. కానీ విష్ణువులేని చోటులేదనీ, హిరణ్యకశిపునికి చివరి సమయం దగ్గర పడిందనీ, ఆ వరాలను మనకు మరలా గుర్తుచేయటాని పోతన ఈ పద్యం వ్రాశాడని తెలిసిపోతోంది. అంతర్యామిగానే కాక సర్వాంతర్యామిగా విష్ణువు ఉన్నాడని నొక్కివక్కాణించడానికన్నట్టుగా, “కలడు” అంటూ మొదలుపెట్టి, అదే ప్రాసతో నడిపి, నాలుగు పాదాలోలో మొత్తం ఏడుసార్లు కలడు-కలడు-కలడు-... అని మనకు మనసులో నాటుకునేట్టుగా చెప్తాడు. ప్రహ్లాదునకు భక్తిభావం, హిరణ్యకశిపునకు భయం కలిగిందనుకోవాలి.

దీని వెంటనే వచ్చే పద్యం - “ఇందుగలడు అందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు. ఎందెందు వెదకి జూచిన అందందేగలడు, దానవాగ్రణి వింటే?”. అందరికీ పరిచయమైన పద్యము.
చివరగా, ఇక్కడ ఒక నాటకీయ ఫక్కీ కూడా మనం గమనించవచ్చు. ఇప్పటి తెలుగు సినిమాలతో పోల్చవచ్చు. ఒక చెడ్డ వ్యక్తి ప్రజలను హింస పెడుతూంటాడు. అప్పుడు ఆ ప్రజలచేత కష్టాలను తీర్చే వ్యక్తి వస్తాడనే ఆశాభావం చూపిస్తారు. “ఉందిలే మంచికాలము ముందునా” అనే భావం ప్రేక్షకులకు కలిగిస్తారు. విలను కళ్లల్లో భయం చూపిస్తారు.
మరో రోజు మరో ద్వంద్వంతో...

Comments