మ. తన వెంటన్ సిరి - 100 పద్యాలు

 

మ. తన వెంటన్ సిరి

తన వెంటన్ సిరి లచ్చి వెంటనవరోధవ్రాతమున్ దాని వె
న్కను పక్షీంద్రుడు వాని పొంతను ధనుఃకౌమోదకీ శంఖ చ
క్రనికాయంబును నారదుండు ధ్వజినీకాంతుండు రావొచ్చిరొ
య్యన వైకుంఠపురంబునం గలుగు వారాబాల గోపాలమున్

1.     తన వెంటన్ సిరి 

2.    లచ్చి వెంటన్

3.    అవరోధవ్రాతమున్ 

4.    దాని వెన్కను పక్షీంద్రుడు 

5.    వాని పొంతను 

6.    ధనుఃకౌమోదకీ శంఖ చక్ర

7.     నికాయంబును  

8.    నారదుండు ధ్వజినీకాంతుండు రా

9.    వొచ్చిరి ఒయ్యన 

10. వైకుంఠపురంబునం గలుగు 

11.  వారాబాల గోపాలమున్

అర్థం: 

సిరి = లక్ష్మీదేవి; లచ్చి = లక్ష్మీదేని; వెంటన్ = వెనుక; అవరోధ = అంతఃపుర స్త్రీలు; వ్రాతమున్ = సమూహమును; దాని = వాని; వెన్కనున్ = వెనుక; పక్షీంద్రుడు = గరుత్మంతుడు; పొంతను = పక్కనే; ధనుస్ = విల్లు; కౌమోదకీ = కౌమోదకి అనే గద; శంఖ = శంఖము; చక్ర = చక్రము; నికాయంబునున్ = సమూహము; నారదుండు = నారదుడు; ధ్వజినీకాంతుండు = విష్వక్సేనుడు; రాన్ = రాగా; వచ్చిరి = వచ్చితిరి; ఒయ్యన = గబగబా; వైకుంఠ = వైకుంఠ; పురంబునన్ = పట్టణము లోని; కలుగు = గల; వారు = వారు; ఆబాలగోపాలమున్ = అందరు

భావం: ఈ పద్యం పోతన వ్రాసిన భాగవతం లోనిది. గజేంద్ర మోక్షం ఘట్టంలోనిది.

 

గజరాజు ప్రాణాలను కాపాడాలన్న తొందరలో ఉన్న శ్రీహరి వెంట వైకుంఠంలోని ఆబాల గోపాలము వస్తున్నారు. ముందుగా లక్ష్మీదేవి, ఆమె వెనుకనే అంతఃపుర స్త్రీలు, వారి వెంటనే ధనస్సు, గద, శంఖము, చక్రముల సమూహము, నారదుడు, సేనానాయకుడైన విశ్వక్సేనుడు రాగా, వైకుంఠపురములో ఉన్న అందరూ వస్తున్నారు.

Comments