శా. రాజుల్మత్తులు - 100 పద్యాలు

 

శా. రాజుల్మత్తులు

రాజుల్మత్తులువారిసేవ నరకప్రాయంబువారిచ్చు నం
భోజాక్షీ చతురంతయాన తురగీ భూషాదు లాత్మవ్యథా
బీజంబుల్తదపేక్షచాలుఁ బరితృప్తింబొందితిన్ జ్ఞానల
క్ష్మీ జాగ్రత్పరిణామ మిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వరా! 

1.     రాజుల్మత్తులు

2.     వారిసేవ నరకప్రాయంబు

3.     వారిచ్చున్ 

4.     అంభోజాక్షీ 

5.     చతురంతయాన 

6.     తురగీ భూషాదులు 

7.     ఆత్మవ్యథా బీజంబుల్

8.    తదపేక్షచాలుఁన్ 

9.     పరితృప్తింబొందితిన్ 

10.  జ్ఞానలక్ష్మీ జాగ్రత్పరిణామ మిమ్ము 

11.   దయతో

12.  శ్రీకాళహస్తీశ్వరా! 

అర్థాలు

రాజుల్మత్తులు మహారాజులు గర్వము కలవారు; వారిసేవ వారిని సేవించడం; నరకప్రాయంబు = నరకంతో సమానం; వారిచ్చున్ వారిచ్చునటువంటి; అంభోజాక్షీ సేవక స్త్రీలు; చతురంతయాన పల్లకీలు;తురగీ గుర్రాలుభూషాదులు నగలు మొదలైనవి; ఆత్మవ్యథా మనసుకు కష్టకలిగించే; బీజంబుల్ = కారణాలు; తదపేక్షచాలుఁన్ తత్ అపేక్ష చాలున్ వాటి మీద కోరిక తీరినది; పరితృప్తింబొందితిన్ తృప్తి చెందాను; జ్ఞానలక్ష్మీ జ్ఞానమనే సంపదను; జాగ్రత్పరిణామ మిమ్ము = జాగ్రత్ పరిణామము ఇమ్ము వెలుగుఅనే ఫలమును ప్రసాదించు; దయతో = దయతో; శ్రీకాళహస్తీశ్వరా! = శ్రీకాళహస్తిలో నెలవున్న ఈశ్వరా!;

భావం: ఈ పద్యం దూర్జటి మహాకవి వ్రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోనిది.

 

ఓ శ్రీకాళహస్తీశ్వరా! రాజులు గర్వము అనే మత్తును కలవారు. వారి సేవించటం నరకముతో సమానం. వారి ఇచ్చే సేవకులు, పల్లకీలు, గుర్రాలు, నగలు మనసుకు వ్యథను కలిగించేవి. ఇంత కాలం అనుభవించినదానితో తృప్తి చెందాను. దయతో నాకు జ్ఞాన సంపద అనే వెలుగును ప్రసాదించు.

Comments