సీ. ధర్మతత్వజ్ఞులు - 100 పద్యాలు

 

సీ. ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రం బని

ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రంబని,  యధ్యాత్మవిదులు వేదాంతమనియు 
నీతివిచక్షణుల్ నీతిశాస్త్రంబని, కవివృషభులు మహాకావ్యమనియు 
లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని, యైతిహాసికు లితిహాస మనియుఁ 
బరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్ఛ, యంబని మహిఁ గొనియాడుచుండ


వివిధవేదతత్త్వవేది వేదవ్యాసుఁ డాదిముని పరాశరాత్మజుండు 
విష్ణుసన్నిభుండు విశ్వజనీన మై పరఁగుచుండఁ జేసె భారతంబు. 

1.      ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రంబని, 

2.      అధ్యాత్మవిదులు వేదాంతమనియు 

3.      నీతివిచక్షణుల్ నీతిశాస్త్రంబని,

4.      కవివృషభులు మహాకావ్యమనియు 

5.      లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని

6.      ఐతిహాసికు లితిహాస మనియుఁ

7.      పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్ఛయంబని 

8.     మహిఁ గొనియాడుచుండ

9.      వివిధవేదతత్త్వవేది 

10.    వేదవ్యాసుఁ డాదిముని

11.    పరాశరాత్మజుండు 

12.    విష్ణుసన్నిభుండు 

13.    విశ్వజనీన మై 

14.    పరఁగుచుండఁ జేసె 

15.    భారతంబు. 

 

అర్ధాలు: 

తత్త్వజ్ఞులు = తత్వం తెలిసినవారు; శాస్త్రంబని = గ్రంథము అని;  అధ్యాత్మ = పరమాత్మ సంబంధించిన; విదులు = పండితులు; వేదాంత = వేదాలు, ఉపనిషత్తులు మొదలైన; నీతి విచక్షణుల్ = నీతి శాస్త్రము తెలిసినవారు;  కవివృషభులు = గొప్ప కవులు; లాక్షణికులు = వ్యాకరణం తెలిసినవారు ; సర్వలక్ష్య = అని సూత్రముల యొక్క; సంగ్రహమని = సంహితమని ; ఐతిహాసికులు = ఇతిహాసము తెలిసినవారు; పరమ పౌరాణికుల్ =పురాణములు బాగా తెలిసిన వారు; సముచ్ఛ = కుప్ప; మహిఁన్ = భూమి యందు ; కొనియాడుచుండ = పొగడే విధంగా; వివిధవేద = అన్ని వేదాల యొక్క; తత్త్వవేది = రహస్యాలు తెలిసిన ; వేదవ్యాసుఁ = వ్యాస మహర్షి ; ఆదిముని = మహర్షి; పరాశరాత్మజుండు = పరాశర+ అత్మజుండు = పరాశర మహర్షి కుమారుడు; విష్ణుసన్నిభుండు = విష్ణువు అంతటి వాడు; విశ్వజనీనమై = అందరికీ మంచి జరుగునట్లు ; పరఁగుచుండఁ = విధముగా ; జేసె =చేసెను, వ్రాసెను ; భారతంబు = మహాభారతము ; 

భావం:

మహాభారతం, ధర్మం తెలిసిన వారికి ధర్మశాస్త్రంగా కనిపిస్తుంది. ఆధ్యాత్మక తత్త్వం తెలిసినవారికి వేదాంతం లాగా, నీతివేత్తలకు నీతి శాస్త్రం లాగా, కవులకు మహాకావ్యం లాగా, వ్యాకరణకర్తలకు గొప్ప వ్యాకరణగ్రంధం లాగా, చరిత్రకారులకు చారిత్రాత్మక గ్రంధం లాగా, పురాణాలు చెప్పేవారికి పురాణం లాగా ఉంటుంది. ఈ విధంగా పరాశర మహర్షి కొడుకు, విష్ణు సమానుడు అయిన వేదవ్యాసుడు భారతాన్ని అందరూ ప్రశంసించేలా రచించారు. 

Comments