ఎక్కడదీ పద్యం - జయ జయ దానవదారణకారణ?
ఆదిత్య 369 సినిమాలోని ఒక ఘట్టం. శ్రీకృష్ణదేవరాయలు పాత్ర కార్తీక పౌర్ణమి నాడు విష్ణుమూర్తి విగ్రహానికి పూజ చేస్తూ జయజయ అంటూ పద్యం గానం చేస్తుంది. ఈ పద్యం, చారిత్రక రాయలు వ్రాసిన "ఆముక్తమాల్యద" కావ్యంలోనిది.
క్లుప్తంగా కథ. విలుబుత్తూరు అనే ఊరిలో విష్ణుచిత్తుడు అనే గొప్ప విష్ణుభక్తుడు ఉన్నాడు. నిత్యమూ విష్ణుభక్తి పరాయణుడై ఉండేవాడు. అతడు ఒకానొక నాడు శ్రీమహావిష్ణువును స్తుతించే సందర్భంలోనిది ఈ పద్యం.
చతుర్థాశ్వాసంలోనిది పద్యం.
పూర్తి పద్యం, ఆముక్తమాల్యద - కవిరాజ విరాజితము - 4-16
జయ జయ చంద్రదినేంద్రశతాయుత సాంద్రశరీరమహాప్రసరా
జయ జయ తామరసోదర సోదర చారుపదోజ్ఘితగాంగఝరా
జయ జయ కేశవ కేశినిషూదన శౌరి శరజ్జలజాక్ష హరీ
--
ఇదే పద్యం కాస్త మార్పుతో పెద్దన వ్రాసిన స్వారోచిషమనుసంభవం (మనుచరిత్ర) అనే కావ్యం లో ఉన్నది.
జయ జయ దానవదారణకారణ శాజ్గ్రరధాంగగదాసిధరా
జయ జయ చంద్రదినేంద్రశతాయుత సాంద్రశరీరమహాప్రసరా
జయ జయ తామరసోదర సోదర చారుపదోజ్ఘితగాంగఝరా
జయ జయ కేశవ కేశినిషూదన శౌరి హరీ దురితాపహరా (మనుచరిత్ర - 6-104)
ఇలాగే మరికొన్ని పెద్దన వ్రాసిన పద్యాలు చిన్నచిన్న మార్పులతో ఆముక్తమాల్య కావ్యంలో కనబడతాయి. ఇలాంటి వాటి వల్లనే అసలు ఆముక్తమాల్యద కావ్యం మొత్తం శ్రీకృష్ణదేవరాయలు కాకుండా పెద్దన వ్రాసాడనే నమ్మకమున్నది కొందరికి. మరొకరి కావ్యంలో నచ్చిన పద్యాలను అక్కడక్కడా వాడుకోవడం సహజమే. ఆ పద్యాలను తప్పించి సింహభాగం పద్యాల కూర్పు, శిల్పము పెద్దన రచనా శిల్పానికి తేడాతోనే ఉంటాయి.
--
ఆముక్తమాల్యద కావ్యపాఠం గ్రూపువారి సహకారంతో
gud information - tnq
ReplyDelete