చం. సుడిగొని రామపాదములు - 100 పద్యాలు

 

చ. సుడిగొని రామపాదములు - మొల్ల

సుడిగొని రామపాదములు సోకిన ధూళి వహించి రాయి యే
ర్వడ ఒక కాంత యయ్యెనట, పన్నుగ నీతని పాదరేణు లి
య్యెడ వడి నోడ సోక నిది ఎట్లగునో యని సంశయాత్ముడై
కడిగె గుహుండు రామపదకంజయుగంబు శుభంబు పెంపునన్

1.     సుడిగొని 

2.     రామపాదములు సోకిన 

3.     ధూళి వహించి రాయి 

4.     యేర్వడ 

5.     ఒక కాంత యయ్యెనట, 

6.     పన్నుగన్ 

7.     ఈతని పాదరేణు లియ్యెడ వడి 

8.    నోడ సోక నిది ఎట్లగునో యని 

9.     సంశయాత్ముడై కడిగె 

10.  గుహుండు 

11.   రామపదకంజయుగంబు 

12.  శుభంబు పెంపునన్

అర్ధాలు:

సుడిగొని = గాలివాటున; రామపాదములు = శ్రీరాముని పాదములు; సోకిన = తగిలితే; ధూళి = దుమ్ము;వహించి = అంటుకుని; రాయి = రాయి; యేర్వడ = చక్కగా; ఒక కాంత = ఒక స్త్రీ వలె; అయ్యెనట = మారినది అట; పన్నుగన్ = చక్కగా; ఈతని = ఈ శ్రీరాముని; పాదరేణులు = పాదముల దుమ్ము;ఇయ్యెడ వడిన్ = ఇక్కడ పడి; ఓడ సోకన్ = పడవకు తాకితే; ఇది ఎట్లగునో = ఇది ఎట్లా మారిపోతుందో;అని = అని; సంశయాత్ముడై = అనుమానముతో; కడిగె = కడిగినాడు; గుహుండు = గుహుడు; రామపద= శ్రీరాముని పాదలనే; కంజ = పద్మ; యుగంబు = రెండింటినీ; శుభంబు = శుభము; పెంపునన్ = కలుగునట్లుగా;

భావం:
ఈ పద్యం మొల్ల వ్రాసిన రామాయణం లోనిది. అరణ్యవాసమునకు వెళ్లిన శ్రీరాముడిని నది దాటించడం కోసం గుహుడు పడవలో ఎక్కించుకున్న సందర్భంలోనిది.

 
“ఎప్పుడో ఒకసారి శ్రీరాముని పాదాలకు అంటుకున్న దుమ్ము గాలివాటున తగిలితే, ఒక రాయి ఆడదిగా మారిపోయిందటు. ఇప్పుడు ఆ పాదాల ధూళి నా పడవకు తాకితే నా పడవ ఏమైపోతుందో” అని అనుమానం వచ్చి గుహుడు శ్రీరాముని పాదపద్మాలను కడిగాడు. దాని వలన అతనికి శుభములు కలిగినాయి.

Comments