యుద్ధకాండ: 310-314 - విభీషణుడు రావణాసురుని వారించుట
సందర్భము: రావణాసురుడు మంత్రులతో కొలువుతీరి వారి ప్రతాపాలు వింటుండగా, విభీషణుడు యుద్ధం వద్దని వారిస్తున్నాడు.
యుద్ధకాండ - 310-314
మేటివానరు లిట మీఱక మున్నె - కోటలు వారిచేఁ గూలకమున్నె,సౌమిత్రిబాణవర్షము రాకమున్నె - రామునికోపాగ్ని రాఁజకమున్నె,
యాయగ్నిచే లంక యడఁగకమున్నె - యీయసురావళి యీల్గకమున్నె,
సీతఁ బుచ్చుఁడు వేగ శ్రీరాముకడకు - సీతఁ దెచ్చినకీడు చేఁ జేతఁ గుడుపు
ధర్మాత్ముఁ డౌ రామ ధరణీశ్వరుండు - ధర్మంబువలననే తగ నుండు జయము
భావం: ఆ వానర వీరులు చెలరేగక ముందే, కోటలు వారి ద్వారా కూలక మందే, లక్ష్మణుడి బాణవర్షము రాక ముందే, శ్రీరాముని కోపాగ్ని రాజుకోక మందే, ఆ అగ్నివలన లంకా నగరము నాశనము కాక ముందే, రాక్షసజాతి చనిపోక ముందే, వేగమే సీతను శ్రీరాముని వద్దకు పంపించు, సీతను తీసుకువచ్చిన పాపము అనుభవించు, ధర్మాత్ముడైన శ్రీరాముడుకు ధర్మము వలననే గెలుపు తధ్యము.
ఈలుగు = చచ్చు
పుచ్చు = పంపు
--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
Comments
Post a Comment