మ. సిరికిం జెప్పడు - 100 పద్యాలు

 

మ. సిరికిం జెప్పఁడు

సిరికిం జెప్పఁడు; శంఖచక్ర యుగముం జేదోయి సంధింపఁ డే
పరివారంబును జీరఁ డభ్రగపతిం బన్నింపఁ డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు వివాదప్రోత్థితశ్రీకుచో
పరి చేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.

1.    సిరికిం జెప్పఁడు; 

2.    శంఖచక్ర యుగముం జేదోయి సంధింపఁడు

3.    ఏ పరివారంబును జీరఁడు

4.    అభ్రగపతిం బన్నింపఁడు 

5.    ఆకర్ణికాంతర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు

6.    వివాదప్రోత్థిత 

7.    శ్రీకుచో పరిచేలాంచలమైన వీడఁడు

8.    గజప్రాణావనోత్సాహియై.

అర్థం: 

సిరికిం = లక్ష్మీదేవికి; చెప్పఁడు = చెప్పలేదు ; శంఖ = శంఖము; చక్ర = సుదర్శన చక్రము;యుగముం = రెండింటిని; చేదోయి = రెండు చేతులలోనూ; సంధింపఁడు = ధరించలేదు;
ఏ పరివారంబును = తన చుట్టు ఉన్నవారిని; చీరఁడు = పిలువలేదు; అభ్రగపతిం =గరుత్మంతుడిని ; బన్నింపఁడు = పిలువలేదు; ఆకర్ణికాంతర = చెవుల మీద పడుతున్న;ధమ్మిల్లముఁ = జుట్టును; చక్కనొత్తఁడు = సర్దుకోలేదు; వివాద = తగవు వలన; ప్రోత్థిత = ఎత్తిన;శ్రీ = లక్ష్మీదేవి యొక్క; కుచ = గుండెల మీద; పరి చేలాంచలము = చీర కొంగు; ఐన =అయినా; వీడఁడు = విడువలేదు; గజ = గజేంద్రుని; ప్రాణా = ప్రాణాలను; వనోత్సాహియై =రక్షించాలనే తొందరలో;


భావం: 

గజరాజు ప్రాణాలను కాపాడాలన్న తొందరలో శ్రీహరి, లక్ష్మీదేవికి చెప్పలేదు; శంఖ చక్రాలను ధరించ లేదు; తనవారిని ఎవరినీ రమ్మనలేదు; గరుత్మంతుడిని రమ్మనలేదు; చెదరినజుట్టును కనీసం సర్దుకోలేదు; (ఆటలో తలెత్తిన) వివాదం మూలాన  తాను పట్టుకున్న లక్ష్మీదేవి చీర కొంగును సైతం విడిచిపెట్టలేదు.

Comments